Abn logo
Oct 17 2021 @ 02:39AM

చెన్నై కింగ్స్‌

ఫైనల్లో కోల్‌కతాపై విజయం

ధోనీసేన ఖాతాలో

నాలుగో ఐపీఎల్‌ టైటిల్‌


ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్టుగా.. గత సీజన్‌లో ఏడో స్థానంలో నిలిచి ఘోర పరాభవం ఎదుర్కొన్న చోటే.. సూపర్‌గా ఆడిన చెన్నై తామే ‘కింగ్స్‌’మని నిరూపించుకుంది. అటు రెండో దశలో అద్భుతంగా ఆడుతూ వచ్చిన కోల్‌కతాపై అన్ని విభాగాల్లోనూ ముప్పేట దాడికి దిగి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. తద్వారా ఇదే జట్టుపై 2012 ఫైనల్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.


 ప్రపంచంలో మూడు విభిన్న దశాబ్దాల్లోనూ టైటిల్‌ను గెలిచిన ఏకైక టీ20 ఫ్రాంచైజీగా చెన్నై (2010, 2011, 2018, 2021).

ఐపీఎల్‌ ఫైనల్లో అత్యధిక పరుగులు (56) ఇచ్చిన రెండో బౌలర్‌గా ఫెర్గూసన్‌. వాట్సన్‌ (61) ముందున్నాడు.

ఒకే సీజన్‌లో ఒకే జట్టు తరఫున 600+ స్కోర్లు సాధించిన మూడో జోడీగా రుతురాజ్‌ (635)- డుప్లెసి (633) నిలిచింది. గతంలో బెంగళూరు (2013) తరఫున గేల్‌ (708), కోహ్లీ (634).. 2016లో కోహ్లీ (973), డివిల్లీర్స్‌ (687) ముందున్నారు.


ప్రైజ్‌మనీ

విజేత చెన్నైకి రూ.20 కోట్లు 

కోల్‌కతాకు రూ.12.50 కోట్లు


దుబాయ్‌: ‘మిస్టర్‌ కూల్‌’ ఎంఎస్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌-14 సీజన్‌ విజేతగా నిలిచింది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఈ తుది పోరులో చెన్నై 27 పరుగుల తేడాతో గెలిచింది. తన వందో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన డుప్లెసి (59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 86) అదరగొట్టడంతో పాటు బౌలర్లంతా ప్రత్యర్థిపై విరుచుకుపడ్డారు. వీరి ధాటికి ఏడుగురు కేకేఆర్‌ బ్యాటర్స్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. తొమ్మిదోసారి ఫైనల్‌ ఆడిన చెన్నైకిది నాలుగో ఐపీఎల్‌ టైటిల్‌. గతంలో 2010, 2011, 2018లలో గెలిచింది. ముంబై (5) టాప్‌లో కొనసాగుతోంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. మొయిన్‌ అలీ (37 నాటౌట్‌), రుతురాజ్‌ (32), ఊతప్ప (31) రాణించారు. నరైన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్లు గిల్‌ (51), వెంకటేశ్‌ అయ్యర్‌ (50) మాత్రమే ఆకట్టుకున్నారు. శార్దూల్‌కు మూడు, జడేజా.. హాజెల్‌వుడ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా డుప్లెసి, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా హర్షల్‌ పటేల్‌ (ఆర్‌సీబీ, 32 వికెట్లు) నిలిచారు. 


ఓపెనర్లు మాత్రమే..:

భారీ ఛేదనను కేకేఆర్‌ మెరుగ్గానే ఆరంభించింది. ఓపెనర్లు గిల్‌, వెంకటేశ్‌ చెన్నై బౌలర్లును దీటుగా ఎదుర్కొంటూ గట్టి పునాది వేశారు. కానీ మిడిలార్డర్‌ ఘోరంగా దెబ్బతింది. ఖాతా తెరువకముందే అయ్యర్‌ ఇచ్చిన క్యాచ్‌ను ధోనీ వదిలేశాడు. ఆ తర్వాత తనదైన శైలిలో చెలరేగుతూ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీ ఉన్నంత సేపు చెన్నై శిబిరంలో ఆందోళన కనిపించింది. వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్లతో చెలరేగి రన్‌రేట్‌కు తగ్గట్టుగా ఆడారు. కానీ 11వ ఓవర్‌లో అయ్యర్‌ను అవుట్‌ చేసిన శార్దూల్‌ జట్టుకు రిలీఫ్‌నిచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఆ తర్వాత కేకేఆర్‌ పతనం ఆరంభమైంది. గిల్‌ కూడా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నా 14వ ఓవర్‌లో దీపక్‌ చాహర్‌కు చిక్కాడు. రాణా (0), నరైన్‌ (2), మోర్గాన్‌ (4), దినేశ్‌ కార్తీక్‌ (9), షకీబ్‌ (0), త్రిపాఠి (2) ఇలా వచ్చి అలా వెళ్లడంతో 125/8 స్కోరుతో జట్టు ఓటమిని ఖాయం చేసుకుంది. చివర్లో మావి (20), ఫెర్గూసన్‌ (18 నాటౌట్‌) కాస్త వేగం చూపి పరాజయ అంతరాన్ని తగ్గించగలిగారు. 

కలిసికట్టుగా..:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది.  వచ్చిన వారు వచ్చినట్టుగా బ్యాట్లు ఝుళిపించారు. కేకేఆర్‌ బౌలర్లు వీరిని ఏ దశలోనూ ఇబ్బందిపెట్టలేకపోయారు. ముఖ్యంగా ఆఖరి బంతికి అవుటైన ఓపెనర్‌ డుప్లెసి కీలక ఇన్నింగ్స్‌తో అండగా నిలిచాడు. రుతురాజ్‌తో కలిసి తొలి వికెట్‌కు 61 పరుగులు అందించాడు. ఆతర్వాత ఊతప్ప మూడు సిక్సర్లతో 15 బంతుల్లోనే 31 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డాడు. 11వ ఓవర్‌లో డుప్లెసి 4,4,6తో 35 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అలాగే ఊతప్పతో కలిసి రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించాడు. అతడి నిష్క్రమణ తర్వాత కూడా కేకేఆర్‌కు ఊరట దక్కలేదు. చివర్లో అలీ, డుప్లెసి జోడీ చుక్కలు చూపించింది. 17వ ఓవర్‌లో అలీ రెండు సిక్సర్లు బాదగా, తర్వాతి ఓవర్‌లో డుప్లెసి 6,4తో చెలరేగాడు. 19వ ఓవర్‌లోనూ అలీ 4,6తో 13 పరుగులు రాబట్టాడు. చివరి ఓవర్‌ ఆరో బంతికి డుప్లెసి వెనుదిరిగినా అప్పటికి జట్టు భారీ స్కోరు సాధించింది. మూడో వికెట్‌కు 39 బంతుల్లో 68 పరుగులు వచ్చాయి.

స్కోరుబోర్డు

చెన్నై సూపర్‌కింగ్స్‌:

రుతురాజ్‌ (సి) మావి (బి) నరైన్‌ 32; డుప్లెసి (సి) వెంకటేశ్‌ అయ్యర్‌ (బి) మావి 86; ఊతప్ప (ఎల్బీ) నరైన్‌ 31; మొయిన్‌ అలీ (నాటౌట్‌) 37; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 192/3. వికెట్ల పతనం: 1-61, 2-124, 3-192. బౌలింగ్‌: షకీబ్‌ 3-0-33-0; మావి 4-0-32-1; ఫెర్గూసన్‌ 4-0-56-0; వరుణ్‌ 4-0-38-0; నరైన్‌ 4-0-26-2; అయ్యర్‌ 1-0-5-0.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌:

గిల్‌ (ఎల్బీ) చాహర్‌ 51; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) జడేజా (బి) శార్దూల్‌ 50; రాణా (సి) డుప్లెసి (బి) శార్దూల్‌ 0; నరైన్‌ (సి) జడేజా (బి) హాజెల్‌వుడ్‌ 2; మోర్గాన్‌ (సి) చాహర్‌ (బి) హాజెల్‌వుడ్‌ 4; దినేశ్‌ కార్తీక్‌ (సి) రాయుడు (బి) జడేజా 9; షకీబ్‌ (ఎల్బీ) జడేజా 0; త్రిపాఠి (సి) అలీ (బి) శార్దూల్‌ 2; ఫెర్గూసన్‌ (నాటౌట్‌) 18; మావి (సి) చాహర్‌ (బి) బ్రావో 20; వరుణ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 165/9. వికెట్ల పతనం: 1-91, 2-93, 3-97, 4-108, 5-119, 6-120, 7-123, 8-125, 9-164. బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-32-1; హాజెల్‌వుడ్‌ 4-0-29-2; శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-38-3; బ్రావో 4-0-29-1; రవీంద్ర జడేజా 4-0-37-2.

నైట్‌రైడర్స్‌కు గెలిచే అర్హత ఉంది

ఈ సీజన్‌లో కప్‌ గెలిచే అర్హత ఏ జట్టుకైనా ఉందంటే అది కేకేఆరే. భారత్‌లో జరిగిన తొలి అంచెలో ఏడో స్థానంలో నిలిచిన ఆ జట్టు యూఏఈలో గొప్పగా పుంజుకుని ఫైనల్‌కు రాగలిగింది. ఇక మా జట్టు తొమ్మిదిసార్లు ఫైనల్‌కు చేరడం గొప్ప విషయం. అలాగే తుది పోరులోనూ మేం చాలాసార్లు ఓడాం. అద్భుతంగా రాణించే ఆటగాళ్లు మా వెంట ఉండడం అదృష్టం. వాస్తవానికి మా జట్టు ఎక్కడ ఆడినా అభిమానులు మద్దతిస్తుంటారు. అలాగే వచ్చే సీజన్‌లో నేను సీఎ్‌సకేకు ఆడడం కన్నా.. ఈ జట్టుకు ఏం కావాలో అదే ముఖ్యం. మరో పదేళ్లపాటు పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది.

- ఎంఎస్‌ ధోనీ


కెప్టెన్‌ @300

ధోనీ టీ20 ఫార్మాట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా 300 మ్యాచ్‌లకు సారథిగా వ్యహరించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ ఐపీఎల్‌ టైటిల్‌ను గెలవడం ద్వారా అతడీ ఫీట్‌ను మరింత చిరస్మరణీయం చేసుకున్నాడు. ధోనీ తర్వాత డారెన్‌ సామీ (208) మాత్రమే 200కు పైగా మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఈ సీజన్‌ హీరోలు

పర్పుల్‌ క్యాప్‌: హర్షల్‌ పటేల్‌ (బెంగళూరు- 32 వికెట్లు)

ఆరెంజ్‌ క్యాప్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌ (చెన్నై- 635 పరుగులు)

అత్యంత విలువైన ఆటగాడు: హర్షల్‌ పటేల్‌ 

ఎమర్జింగ్‌ ప్లేయర్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌ 

పవర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌: వెంకటేశ్‌ అయ్యర్‌ (కోల్‌కతా)

గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ది సీజన్‌: హర్షల్‌ పటేల్‌ 

అత్యధిక సిక్సర్లు:  కేఎల్‌ రాహుల్‌ (పంజాబ్‌ - 30 సిక్స్‌లు)

సూపర్‌ స్ట్రయికర్‌: హెట్‌మయెర్‌ (ఢిల్లీ-168 స్ట్రయిక్‌రేట్‌)

ఫెయిర్‌ ప్లే అవార్డు: రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు