దుబాయ్‌కు ధోని పండించిన కూరగాయలు...

ABN , First Publish Date - 2021-01-02T12:30:20+05:30 IST

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రైతుగా కొత్త అవతారమెత్తారు...

దుబాయ్‌కు ధోని పండించిన కూరగాయలు...

రాంచీ (జార్ఖండ్): భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రైతుగా కొత్త అవతారమెత్తారు.రాంచీ నగర శివార్లలోని తన వ్యవసాయ క్షేత్రంలో పండించిన ఉత్పత్తులను దుబాయ్ దేశానికి ఎగుమతి చేసేందుకు మాజీ క్రికెటర్ ధోని సన్నాహాలు  చేస్తున్నారు. ధోని తన రాంచీ ఫామ్‌హౌస్ లో పండిస్తున్న క్యాబేజి, టమోటా, ఇతర కూరగాయలకు మంచి డిమాండ్ ఏర్పడింది. తాను పండించిన కూరగాయలను దుబాయ్ దేశానికి ఎగుమతి చేసేందుకు ఎంఎస్ ధోని ఏజెన్సీని ఎంపిక చేశారు.


రాంచీ శివార్లలోని సెంబో గ్రామంలోని రింగ్ రోడ్డు వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో స్ట్రాబెర్రీలు, క్యాబేజీ, టమోటాలు, బ్రోకలీ, బఠానీలు,బొప్పాయిలను ధోని పండిస్తున్నారు. ధోని పండించిన కూరగాయలకు రాంచీ మార్కెటులో మంచి డిమాండ్ ఉంది. ధోనికి దుబాయ్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ప్రస్థుతం కొత్త సంవత్సరం సందర్భంగా ధోని దుబాయ్ దేశంలో తన కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. 


ధోని తన వ్యవసాయ క్షేత్రంలో పండించిన కూరగాయలను విదేశాలకు పంపే బాధ్యతను జార్ఖండ్ వ్యవసాయ శాఖ తీసుకుంది.ఆల్ సీజన్ ఫాం ఫెష్ ఏజెన్సీ ధోని కూరగాయలను దుబాయ్‌లో విక్రయించనుంది. ఇదే ఏజెన్సీ ద్వారా వ్యవసాయ శాఖ గల్ఫ్ దేశాలకు కూరగాయలను పంపింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కింద ధోని పండించిన కూరగాయలను ఎగుమతి చేయనుందని రాంచీ మార్కెటింగ్ కమిటీ అధిపతి అభిషేక్ ఆనంద్ చెప్పారు. ధోని జార్ఖండ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అని అతని పేరిట కూరగాయలను విదేశాలకు పంపించడం వల్ల జార్ఖండ్ రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందని మార్కెట్ అధికారులంటున్నారు. 

Updated Date - 2021-01-02T12:30:20+05:30 IST