దళిత ద్రోహి సీఎం జగన్‌

ABN , First Publish Date - 2020-05-24T08:53:34+05:30 IST

దళిత ద్రోహి ముఖ్యమంత్రి జగన్‌ అని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్య క్షుడు ఎంఎస్‌ రాజు మండిపడ్డారు.

దళిత ద్రోహి సీఎం జగన్‌

వైద్యుడు సుధాకర్‌పై దాడి అమానుషం

హైకోర్టు తీర్పు వైసీపీకి చెంపపెట్టు

టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు


అనంతపురం వైద్యం, మే 23: దళిత ద్రోహి ముఖ్యమంత్రి జగన్‌ అని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్య క్షుడు ఎంఎస్‌ రాజు మండిపడ్డారు. వైద్యుడు సుధాకర్‌పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ శనివారం టీడీపీ ఎస్సీ సెల్‌ నేతృత్వంలో దళిత వర్గాలు, టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోని అంబేడ్కర్‌ విగ్రహాల ఎదుట నిరసన వెలిబుచ్చాయి. ఎంఎస్‌ రాజు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయం వద్ద దళిత నేతలు.. ప్రభుత్వం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ కరోనా వైద్యసేవలు అందించే వారికి రక్షణ పరికరాలు ఇవ్వకపోతే ఎలా అని దళిత వైద్యుడు సుధాకర్‌ ప్రశ్నించటమే నేరమా అని ప్రశ్నించారు. డాక్టర్‌ను సస్పెండ్‌ చేయటమేకాక పోలీసులతో కొట్టించి స్టేషన్‌కు తరలించటం అమానుషమన్నారు.


బోటు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు న్యాయం చేయాలని అడిగిన మాజీ ఎంపీ దళిత నేత హర్షకుమార్‌ను అక్రమ కేసుతో అరెస్టు చేయించి 48 రోజులు జైలులో పెట్టించారన్నారు. దళితుల అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకోవటం అన్యాయమని ప్రశ్నించిన దళిత నేత రాజే్‌షపై కేసు పెట్టి, జైలుకు పంపించారన్నారు. ప్రకాశం జిల్లాలో తొమ్మిది మంది దళితులు చనిపోతే పరిహారం ఇవ్వటంలో వివక్ష చూపారన్నారు. ఆత్మకూరులో వంద దళిత కుటుంబాలను ఊర్ల నుంచి తరిమేశారన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను నిర్వీర్యం చేశారన్నారు. ఇలా రాష్ట్రంలో దళితులను అణచి వేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ దళిత ద్రోహి కాదా అని ప్రశ్నించారు. డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీకి చెంపపెట్టు అన్నారు. హైకోర్టు తీర్పుకు మద్దతుగా అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి, హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్‌, ఎస్సీ జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుళ్లాయప్ప, ఎమ్మార్పీఎస్‌ నేత చిన్న పెద్దన్న, మాదిగ మహాశక్తి నేత చిన్న ఆంజనేయులు, ఎస్సీ, ఎస్టీ ప్రజాసంఘం అధ్యక్షుడు మల్లికార్జున, మాదిగ విద్యార్థి సమాఖ్య నాయకులు నగేష్‌, సుదర్శన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-24T08:53:34+05:30 IST