జిల్లాలో 115 మెగా ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు

ABN , First Publish Date - 2021-09-29T04:52:33+05:30 IST

జిల్లాలో కొత్తగా రూ.20వేల కోట్ల పెట్టుబడితో 115 మెగా ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు నెలకొల్పబడుతున్నాయని కలెక్టర్‌ చక్రఽధర్‌బాబు చెప్పారు.

జిల్లాలో 115 మెగా ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్‌


నెల్లూరు(హరనాథపురం), సెప్టెంబరు 28 : జిల్లాలో కొత్తగా రూ.20వేల కోట్ల పెట్టుబడితో 115 మెగా ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు నెలకొల్పబడుతున్నాయని కలెక్టర్‌ చక్రఽధర్‌బాబు చెప్పారు. తిక్కన భవనలో మంగళవారం జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డీఐఈపీసీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి పెద్ద పీట వేశామన్నారు. ఈ సమావేశానంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాకు చెందిన మేకపాటి గౌతమ్‌రెడ్డి రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రిగా ఉండటం, ఫంక్షనల్‌ పోర్టు పెద్దపెద్ద నగరాలకు అనుకూలంగా ఉండటం జిల్లాకు ఎంతగానో కలిసొచ్చిందన్నారు. జిల్లాలో ఎక్కువగా నైపుణ్యం కలిగిన యువత ఉందన్నారు. పారిశ్రామిక అభివృద్ధ్దికి కావాల్సిన వనరులు ఉన్నాయని తెలిపారు. వైజాగ్‌-చైన్నై, బెంగళూరు-చైన్నై పారిశ్రామిక కారిడార్ల ద్వారా ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమలు రావడానికి ఎంతో ఆస్కారం ఉందన్నారు. సమావేశంలో 128 క్లైయిములను పరిష్కరించామన్నారు. రూ.3.87కోట్ల ప్రోత్సాహకాలను మంజూరు చేశామన్నారు. జిల్లాలో సంవత్సర కాలంలో 10 భారీ పరిశ్రమలు రూ.1556 కోట్ల వ్యయంతో నెలకొల్పారన్నారు. వాటిలో 1300 మంది స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. 556 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రూ.203కోట్ల వ్యయంతో నెలకొల్పారన్నారు. పరిశ్రమలు నెలకొల్పడానికి సింగిల్‌ విండో అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఆ శాఖ అధికారులు 21 రోజుల్లోగా పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకొంటున్నారన్నారు. సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ కింద 272 దరఖాస్తులు అందగా అందులో 246 ఆమోదించామని చెప్పారు. జిల్లాను రాష్ట్రంలోనే పారిశ్రామికంగా అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో నెల్లూరు కార్పొరేషన కమిషనర్‌ దినేష్‌కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ ఫర్హాన అహ్మద్‌ఖాన, జేసీ రోజ్‌మాండ్‌, జిల్లా పరిశ్రమల కేంద్ర జీఎం మారుతిప్రసాద్‌, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీకాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-29T04:52:33+05:30 IST