పన్నుల భారం తగ్గించాలంటూ ఎంటీఎంసీ ఎదుట సీపీఐ ధర్నా

ABN , First Publish Date - 2021-07-30T06:25:07+05:30 IST

ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలని, ఎంటీఎంసీ ఉద్యోగులు, కార్మికులకు నాలుగు మాసాలుగా నిలిపివేసిన జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

పన్నుల భారం తగ్గించాలంటూ   ఎంటీఎంసీ ఎదుట సీపీఐ ధర్నా
మంగళగిరి నగరపాలకసంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సీపీఐ కార్యకర్తలు

మంగళగిరి, జూలై 29: ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలని, ఎంటీఎంసీ ఉద్యోగులు, కార్మికులకు నాలుగు మాసాలుగా నిలిపివేసిన జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పెనుభారాలను మోపుతోందన్నారు. స్థానిక సంస్థల ఆదాయాన్ని ప్రజల జేబులనుంచే పిండాలన్న యోచన సరైంది కాదన్నారు. స్థానిక సంస్థల ఆదాయ వనరులను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలే తప్ప... ఇలా ప్రజల జేబులను కొల్లగొట్టాలని, చూడడం సబబు కాదన్నారు. ప్రభుత్వం ఆస్తిపన్ను, నీటిపన్ను, చెత్తపన్నుల తాలూకు ఇచ్చిన జీవోలు 196, 197, 198లను వెంటనే ఉపసంహరించుకుని ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనరు పి.నిరంజన్‌రెడ్డికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. దీనిపై కమిషనరు స్పందిస్తూ ఆగస్టు ఒకటవ తేదీన మునిసిపల్‌ కార్మికులందరికీ జీతాలను చెల్లిస్తామని, అదేవిధంగా ఆరో తేదీన రెగ్యులర్‌ ఉద్యోగులకు కూడా జీతాలను ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. 

ధర్నాలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నితిరుపతయ్య, సహాయ కార్యదర్శి కె.కాశియ్య, గుంటూరు నగర శాఖ కార్యదర్శి కె.మాల్యాద్రి, మంగళగిరి పట్టణ శాఖ కార్యదర్శి ఎన్‌.బ్రహ్మేశ్వరరావు, నాయకులు జే.జాన్‌బాబు, జి.వెంకయ్య, కె.ఈశ్వరరావు, వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఎంటీఎంసీ సిబ్బందికి ఎట్టకేలకు జీతాలు

మంగళగిరి, జూలై 29: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు జీతాల కష్టాలు తప్పాయి. ఎంటీఎంసీ ఆవిర్భవించిన నాలుగు మాసాలనుంచి జీతాలు అందక సిబ్బంది ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. వీరందరికీ జీతాలను ఇవ్వాల్సిందేనంటూ సీపీఎం, సీపీఐలు ప్రత్యక్ష ఆందోళనకు దిగగా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సిబ్బందికి జీతాలను ఇవ్వలేని దుస్థితిపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతుంది. అన్నివైపులనుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం ఎంటీఎంసీ సిబ్బందికి జీతాలను చెల్లించేందుకు అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం సాయంత్రం ఎంటీఎంసీ అదనపు కమిషనరు కే హేమమాలిని సిబ్బంది జీతాల చెల్లింపు విషయమై కీలక ప్రకటన చేశారు. మంగళగిరి నగర పరిధిలో పనిచేస్తున్న 480 మంది ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందికి జీతాలను చెల్లించేందుకు ప్రభుత్వం రూ.2.87 కోట్లను ఖర్చు చేసేందుకు అనుమతులను మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ జీతాలు శుక్ర లేదా శనివారాల్లో వారివారి ఖాతాల్లో జమవుతాయన్నారు.

మరో రెండుమూడు రోజుల్లో వలంటీర్లకు, ఆగస్టు ఆరవ తేదీన కార్పోరేషన్‌, సచివాలయ ఉద్యోగులకు జీతాలను చెల్లిస్తామన్నారు. వీరందరికీ పెండింగ్‌లలో ఉన్న నాలుగు మాసాల జీతాలను ఒకేసారి చెల్లిస్తున్నట్టు హేమమాలిని స్పష్టం చేశారు.

Updated Date - 2021-07-30T06:25:07+05:30 IST