ముచ్చటగా మూడోసారైనా!?

ABN , First Publish Date - 2021-06-24T04:30:32+05:30 IST

కాళంగినది నీరు ఉప్పుమయం కాకుండా నిలువరించేందుకు చేపట్టనున్న గ్రాయిన నిర్మాణానికి ఐదేళ్లుగా గ్రహణం వీడటం లేదు.

ముచ్చటగా మూడోసారైనా!?
దెబ్బతిన్న కాళంగి గ్రాయిన (ఫైల్‌)

‘కాళంగి’పై గ్రాయిన నిర్మాణం ఎప్పటికో!?

రెండుసార్లు టెండర్లు ఆహ్వానించినా ముందుకురాని కాంట్రాక్టర్లు 


 తడ, జూన 23 : కాళంగినది నీరు ఉప్పుమయం కాకుండా నిలువరించేందుకు చేపట్టనున్న గ్రాయిన నిర్మాణానికి ఐదేళ్లుగా గ్రహణం వీడటం లేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు. ఇప్పటిరి రెండు సార్లు టెండర్లకు ఆహ్వానించినా ఎవరూ రాకపోవడంతో ముచ్చటగో మూడోసారికి ఇంజనీర్లు సిద్ధమవుతున్నారు. దొరవారిసత్రం,  సూళ్లూరుపేట మండలాల మీదుగా కాళంగి నది  ప్రవహించి తడ మండలం చేనిగుంట వద్ద పులికాట్‌ సరస్సు ఉప్పునీటిలో కలుస్తుంది. నదిలో నీటి లభ్యత లేని సమయంలో సరస్సులోని ఉప్పునీరు నదిలోకి వచ్చి చేరుతూ ఉంటుంది. సూళ్లూరుపేట పట్టణం వరకు ఈ నీరు రావడంతో ఇక్కడ భూగర్భ జలాలన్నీ ఉప్పుమయమైపోయాయి. గతంలో ఈ పరిస్థితి నెలకొనడంతో షార్‌ అధికారులు నది పులికాట్‌లో కలిసేచోట గ్రాయినను నిర్మించారు. కొంతకాలం ఆ గ్రాయినతో కొంత ఇబ్బందులు తప్పినా గ్రాయిన దెబ్బతినడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. 2015లో అప్పటి  టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతుల కోసం సుమారు రూ.35 లక్షలు కేటాయించగా 2016లో పూర్తయ్యాయి. అదే ఏడాది కురిసిన ఓ మోస్తారు వర్షానికి ఆ గ్రాయిన కొట్టుకుపోయింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. 2018లో గ్రాయిన నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం 3.35 కోట్లు మంజూరు చేసింది. 2019లో ప్రభుత్వం మారిపోవడంతో ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. ఆ ఏడాది సెప్టెంబరులో రాష్ట్ర జలవనరులశాఖామంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ దెబ్బతిన్న గ్రాయినను పరిశీలించారు. శాశ్వత గ్రాయిన నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధంచేయాలని ఇరిగేషన అధికారులను ఆదేశించారు. త్వరలోనే నిర్మిస్తామంటూ హామీ ఇచ్చారు.  రెండేళ్లు గడుస్తున్నా ఆ పనుల ఊసేలేదు.


ముందుకురాని కాంట్రాక్టర్లు


ప్రభుత్వం మూడు నెలల క్రితం శాశ్వత గ్రాయిన నిర్మాణం కోసం  8.20 కోట్లను మంజూరు చేసింది. జలవనరులశాఖ అధికారులు పనులు మొదలుపెట్టేందుకు టెండర్లను ఆహ్వానించారు. మొదటి విడతలో ఓ అర్హతలేని కాంట్రాక్టరు టెండర్‌ వేయటంతో అది రద్దయింది. రెండోసారి టెండర్లను ఆహ్వానించినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన కరువై టెండర్ల తుదిగడువు ముగిసిపోయింది.  దీంతో ఒక్క టెండరు కూడా దాఖలు కాలేదు. దీంతో గ్రాయిన నిర్మాణానికి గ్రహణం వీడేడిఎప్పుడా, కాళంగి నీరు తాగు, సాగునీటికి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా  అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. 


మరోసారి టెండర్లు ఆహ్వానిస్తాం


ఇప్పటికి రెండుసార్లు టెండర్లను ఆహ్వానించాం. కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు దాఖలుకాలేదు. మరోసారి టెండర్ల షెడ్యూల్‌  ప్రకటిస్తామని అప్పుడు వచ్చే టెండర్లను బట్టి పనులను మొదలుపెడతాము. 

- సతీష్‌బాబు, డీఈఈ ఇరిగేషన శాఖ, సూళ్లూరుపేట

Updated Date - 2021-06-24T04:30:32+05:30 IST