బురద తీసే సేవకులు... ఇల్లిల్లూ తిరిగి...

ABN , First Publish Date - 2020-10-25T12:16:53+05:30 IST

వందలాది మంది ప్రజలు వరద నీటిలో మునిగి ఉన్న ఇంటిని వదిలేసి తెలిసిన వారి, బంధువుల ఇళ్లకు పరుగులు తీశారు. వరద తగ్గిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే టీవీలు, ఫ్రిజ్‌లు, బైక్‌లు, కంప్యూటర్లు, ఎలక్ర్టానిక్‌, వంటింటి వస్తువు లు అన్నీ బురదతో నిండిపోయాయి.

బురద తీసే సేవకులు... ఇల్లిల్లూ తిరిగి...

హైదరాబాద్ : వందలాది మంది ప్రజలు వరద నీటిలో మునిగి ఉన్న ఇంటిని వదిలేసి తెలిసిన వారి, బంధువుల ఇళ్లకు పరుగులు తీశారు. వరద తగ్గిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే టీవీలు, ఫ్రిజ్‌లు, బైక్‌లు, కంప్యూటర్లు, ఎలక్ర్టానిక్‌, వంటింటి వస్తువు లు అన్నీ బురదతో  నిండిపోయాయి. ఇంటి నిండా మూడడుగుల మేర పేరుకుపోయిన బురదను తొలగించడం ఇప్పుడు తలకు మించిన భారంగా మారింది. ఇలాంటి సమయంలో ‘మీ ఇంటికొచ్చి చేయందిస్తాం’ అంటూ ముందుకొచ్చాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. బాలాపూర్‌, రాయల్‌ కాలనీ, హపీజ్‌ బాబానగర్‌, ఉమర్‌ కాలనీ, అల్‌ జుబేల్‌ కాలనీ పరిసర బస్తీల్లో సేవలందిస్తున్నాయి. నగరానికి చెందిన సఫా బైతుల్‌ మాల్‌, హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌లకు చెందిన వలంటీర్లు చేతిలో చీపుర్లు, వైపర్లు పట్టి బురదను తొలగించే పనిలో చురుగ్గా పాల్గొంటున్నారు. టన్నుల కొద్దీ బురదను తీసి బయట పోస్తున్నారు. దానిని తమ వాహనాల్లోనే దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సఫా బైతుల్‌ మాల్‌ ఆధ్వర్యంలో 50 మంది యువకులు ఇంటింటికి తిరిగి శుభ్రం చేస్తున్నారు. హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌  సభ్యులు ముం పు ప్రాంతాల్లో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.


ఆదుకోవాలనే.. 

ఇంట్లోని విలువైన వస్తువులు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారికి తోడుగా నిలవాలనే ఉద్దేశంతో మా వంతు తోడ్పాటునందిస్తున్నాం.  

-గయాసుద్దీన్‌ రషాదీ, సఫాబైతుల్‌ మాల్‌ నిర్వాహకుడు


ధైర్యాన్నిస్తున్నాం 

బాధితుల ఇళ్లలో పేరుకుపోయిన బుర ద, ఇతర వ్యర్థాలను తొలగించడానికి ప్రత్యేకంగా వలంటీర్లను నియమించాం. రోజు 20 నుంచి 25 ఇళ్లు శుభ్రం చేస్తున్నాం.   కార్యకర్తలు ఇంటింటికి తిరిగి వైద్యపరీక్షలు చేస్తున్నారు.  

-ముజ్తబా అస్కరి, హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ నిర్వాహకుడు

Updated Date - 2020-10-25T12:16:53+05:30 IST