రోడ్డెక్కిన బు‘రొద’

ABN , First Publish Date - 2021-12-01T05:23:10+05:30 IST

పాఠశాలకు బురద రోడ్డులో జారుకుంటూ, పడుతూలేస్తూ నిత్యం వెళుతుండడంపై విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నిసార్లు విన్నవించినా పాలకుల్లో ఏమాత్రం చలనం లేకపోవడంపై అక్రోశం పెల్లుబుకింది. వెంటనే రోడ్డు నిర్మించి ఇబ్బందులు తొలగించాలని ధర్నా చేశారు.

రోడ్డెక్కిన బు‘రొద’
హైస్కూలుకు బురదలో నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థులు

రోత దారిలో బడికి వెళ్లలేమని విద్యార్థుల ఆందోళన 

స్తంభించిన రాకపోకలు

కంభం(అర్థవీడు), నవంబరు 30 : పాఠశాలకు బురద రోడ్డులో జారుకుంటూ, పడుతూలేస్తూ నిత్యం వెళుతుండడంపై విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నిసార్లు విన్నవించినా పాలకుల్లో ఏమాత్రం చలనం లేకపోవడంపై అక్రోశం పెల్లుబుకింది. వెంటనే రోడ్డు నిర్మించి ఇబ్బందులు తొలగించాలని ధర్నా చేశారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం అర్ధవీడు మండలం పాపినేనిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు తరగతులను బహిష్కరించి చెక్‌పోస్టు వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ పాఠశాలకు మండలంలోని బొల్లుపల్లి, అచ్చంపేట, అంకభూపాలెం, పాపినేనిపల్లి, అర్ధవీడు గ్రామాల నుంచి సుమారు 300 మందికి పైగా విద్యార్థులు నిత్యం వస్తుంటారు. తారు రోడ్డుపై నుంచి హైస్కూలుకు వెళ్లాలంటే సుమారు అరకిలోమీటరు బురదరోడ్డులోనే నడవాలి. వర్షాకాలంలో వీపుపై పుస్తకాల బ్యాగ్‌ బరువుతో యూనిఫాం ప్యాంట్‌ను మోకాళ్ల వరకు మడిచి చెప్పులను చేతిలో పట్టుకుని జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ నడిచి వెళ్తుంటారు. ఏమాత్రం కాలు జారినా బురదలో పడాల్సిందే. ఇరవై ఏళ్లగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇక ఉపాధ్యాయుల పరిస్థితి చెప్పేందుకు వీలులేదు. ఈ మట్టిరోడ్డును బాగుచేయాలని విద్యార్థులు  పాలకులకు అర్జీలు ఇచ్చారు. పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అయినా ఫలితం లేదు. చివరకు విసుగెత్తిన విద్యార్థులు మంగళవారం రోడ్డుపై ధర్నా చేశారు. విద్యార్థుల ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డు వేస్తామని హామీ ఇచ్చేంత వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. గ్రామస్థులు కూడా విద్యార్థులకు అండగా నిలిచారు. నాడు-నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్తున్న అధికారులకు పాఠశాలకు వెళ్లే రోడ్డు బాగు చేయాలని తెలియదా అని నిలదీశారు.



Updated Date - 2021-12-01T05:23:10+05:30 IST