అమ్మలగన్న యమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ

ABN , First Publish Date - 2020-10-22T09:14:59+05:30 IST

అమ్మలగన్న యమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ

అమ్మలగన్న యమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ

కారణం లేని కార్యం, మరణం లేని పుట్టుక ఉండవు. ‘‘ధర్మానికి హాని కలిగినప్పుడు అధర్మం పెచ్చుమీరినప్పుడు సాకార రూపంతో లోకంలో నేను అవతరించి సత్పురుషులను రక్షిస్తాను. దుష్టులను శిక్షిస్తాను’’ అంటాడు కృష్ణపరమాత్ముడు భగవద్గీతలో. దేవీ భాగవతంలో కూడా.. జగన్మాత, దేవిగా అవతరించి చెడుపై పోరాడి మంచిపై విజయం సాధిస్తుందని చెప్పబడింది. 


మాఁ దుర్గా సుఖదాయిని జగ్‌ కీ పాలన్‌ హార్‌

పూజోఁ మాఁ కో నౌ దివస్‌ కర్‌ దోగీ ఉద్ధార్‌


‘‘ప్రేమ స్వరూపిణియైున దుర్గామాత ఈ జగత్తునంతా సృష్టించి పోషించే అన్నపూర్ణేశ్వరి. ఆ అమ్మలగన్న అమ్మ అందరినీ అభివృద్ధి మార్గాన నడిపిస్తూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఈ నవరాత్రుల్లో మనస్ఫూర్తిగా ఆ తల్లిని నియమనిష్ఠలతో పూజిస్తే మనను ఉద్ధరిస్తుంది’’ అన్నాడు మహాత్మా కబీరు.


అమ్మలఁగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలాఁ బె

ద్దమ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ తన్ను లో

నమ్మిన వేలుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా

యమ్మ కృపాబ్ధి యిచ్చు త మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్‌


‘‘దుర్గాదేవి తల్లులందరికీ తల్లి. ముగ్గురమ్మలు.. లక్ష్మీ, సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి. లోకాలన్నింటా నిండి ఉన్న శక్తి స్వరూపిణి. దేవతలకు శత్రువులైన రాక్షసుల తల్లులకు గర్భశోకాన్ని కలిగించిన తల్లి. అనగా లోకకంటకులైన రాక్షసులను సంహరించిన స్వరూపం. తనను నమ్ముకున్న అష్టమాతృకలకు శక్తినిచ్చిన తల్లి. అంత గొప్పదైన మా అమ్మ.. సముద్రమంత కరుణ కలిగిన దుర్గమ్మ.. నాకు దయతో కవిత్వ, మహత్వ, పటుత్వ సంపదలు ఇచ్చుగాక’’ అంటూ పోతానామాత్యులవారు అత్యంత అద్భుతంగా ఆ తల్లి గొప్పదనాన్ని వివరించారు. అందుకే పోతనగారి భాగవతం అమృతతుల్యమై శాశ్వతత్వాన్ని పొందిందంటారు భక్తులు.


ముగురమ్మలగన్న అమ్మ.. ఆ దుర్గమ్మ మహిషాసురుడిని సంహరించి లోకాలను కాపాడినందుకు గుర్తుగా దసరా వేడుకలు జరుపుకోవడం కద్దు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తే.. విజయ దశమి. ఆ రోజున.. శమీ వృక్షం(జమ్మిచెట్టు) రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి చేపట్టే ఏ కార్యమైనా సఫలమవుతుందని నమ్మిక. విజయదశమి రోజు శమీ వృక్షాన్ని పూజించడం లక్ష్మీప్రదమని, శత్రునాశనం అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామచంద్రుడు శమీ వృక్షాన్ని పూజించి దశకంఠుడైన రావణున్ని సంహరించింది ఆ రోజే. ఇదే రీతిలో.. అందరి మనసుల్లోని దుష్టత్వాన్ని అణచి, మంచిని పెంచి శాశ్వతమైన శాంతి సౌఖ్యాలను ప్రసాదించవలసిందిగా ఆ దుర్గమ్మ తల్లిని వేడుకుంటూ చేసేవే దసరా వేడుకలు. అదే ఈ పండుగ అంతరార్థం.



పరికిపండ్ల సారంగపాణి, 9849630290

Updated Date - 2020-10-22T09:14:59+05:30 IST