యూకేకు షిఫ్ట్ అవుతున్న ముకేశ్ అంబానీ.. రూ. 592 కోట్లతో 49 బెడ్రూముల భవనం కొనుగోలు!

ABN , First Publish Date - 2021-11-06T02:00:54+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ యూకేను తన రెండో ఇంటిగా మార్చుకోబోతున్నారా?

యూకేకు షిఫ్ట్ అవుతున్న ముకేశ్ అంబానీ.. రూ. 592 కోట్లతో 49 బెడ్రూముల భవనం కొనుగోలు!

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ యూకేను తన రెండో ఇంటిగా మార్చుకోబోతున్నాడంటూ పుకార్లు చక్కర్లు కొట్టడం చాలా మంందిని ఆశ్చర్యపరిచింది. అయితే, అటువంటిదేం లేదని రిలయన్స్ ఖండించింది. అంబానీ ఫ్యామిలీ ముంబైలోనే నివసిస్తారంటూ క్లారిటీ ఇచ్చింది. 


‘‘ముకేశ్ అంబానీ తన కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్‌కు షిఫ్టవుతున్నారా? అవును!’’ అనే వార్త ఒకింత కలకలం రేపిందనే చెప్పాలి! ఆయన లండన్‌లోని బకింగ్‌హామ్‌షైర్, స్టోక్ పార్క్‌లో 300 ఎకరాల్లోని అత్యంత విశాలమైన భవానాన్ని రూ. 592 కోట్లకు కొనుగోలు చేసినట్టు ప్రచారం జరిగింది. అంతే కాదు, ఆ భవనంలో 49 బెడ్రూములు ఉన్నట్టు, అంబానీ త్వరలోనే తన కుటుంబాన్ని అక్కడికి షిఫ్ట్ చేయబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. 


కరోనా లాక్‌డౌన్ కారణంగా అంబానీ కుటుంబం చాలా వరకు ముంబైలోని అత్యంత ఖరీదైన ‘అంటిల్లా’ భవనంలోనే గడిపింది. ఈ నేపథ్యంలో తమకు రెండో ఇల్లు అవసరమని గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మొదట్లో లండన్‌లో రూ. 592 కోట్లు పెట్టి అత్యంత విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటికే అందులో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. 


అంబానీ కుటుంబం ఎప్పుడూ తమ దీపావళిని ‘అంటిల్లా’లోనే జరుపుకుంటూ వస్తుండగా ఈసారి మాత్రం లండన్‌ ‘కొత్త ఇంటి’లో జరుపుకునేందుకు వెళ్లినట్టు చెబుతున్నారు. పరిస్థితులన్నీ సద్దుమణిగాక ఏప్రిల్‌లో అంబానీ కుటుంబం తిరిగి ఇండియా వస్తుందని సమాచారం. అంతేకాదు, ‘అంటిల్లా’ లానే లండన్ భవనంలోనూ ఓ మందిరం నిర్మించాలని యోచిస్తున్న అంబానీ.. త్వరలోనే ముంబై నుంచి ఇద్దరు పురోహితులను తీసుకెళ్లబోతున్నారట. అక్కడ నిర్మించే మందిరాన్ని ముంబై ఇంట్లో ఉన్నట్టుగా నిర్మించాలని యోచిస్తున్నారు.


మార్బల్‌తో తీర్చిదిద్దిన గణేశుడు, రాధాకృష్ణ, హనుమాన్ విగ్రహాలను రాజస్థాన్ శిల్పితో చెక్కించనున్నారు. అంతేకాదు, లండన్ ఇంట్లో ఓ బ్రిటిష్ డాక్టర్‌తో చిన్నపాటి ఆసుపత్రి కూడా ఉంది. 1908 తర్వాత ఈ విశాల భవనాన్ని ప్రైవేట్ రెసిడెన్స్‌గా ఉపయోగించారు. తర్వాత కౌంటీ క్లబ్‌గా మారింది. ఈ మాన్షన్‌లో జేమ్స్ బాండ్ సినిమాను చిత్రీకరించారు. ఇప్పుడీ భవనం అంబానీ సొంతమైంది... అంటూ అంబానీ ‘లండన్’ కథ జోరుగా ప్రచారం అయింది... అయితే, తాజాగా అదంతా ఒట్టిదేనని తేలిపోయింది!


Updated Date - 2021-11-06T02:00:54+05:30 IST