గంటకు రూ.90 కొట్లు!

ABN , First Publish Date - 2020-09-30T07:09:49+05:30 IST

కరోనా కట్టడికి మార్చి చివరి వారంలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వ్యక్తిగత సంపద గంటకు రూ.90 కోట్ల చొప్పున పెరిగింది...

గంటకు రూ.90 కొట్లు!

  • దేశంలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి 
  • ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ సంపాదన ఇది
  • రూ.6.60 లక్షల కోట్లకు చేరిన మొత్తం సంపద 
  • ఏడాది కాలంలో 73 శాతం వృద్ధి చెందిన ఆస్తి 
  • హురున్‌ రిచ్‌ లిస్ట్‌లో వరుసగా 9వ సారి నెం.1 


ముంబై: కరోనా కట్టడికి మార్చి చివరి వారంలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వ్యక్తిగత సంపద గంటకు రూ.90 కోట్ల చొప్పున పెరిగింది. మంగళవారం విడుదలైన ‘‘ఐఐఎ్‌ఫఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2020’’ ఈ విషయాన్ని వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంలో ముకేశ్‌ ఆస్తి రూ.2,77,700 కోట్లు (73 శాతం) వృద్ధి చెంది రూ.6,58,400 కోట్లకు చేరుకుంది. దాంతో వరుసగా తొమ్మిదో సారీ ఈ సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగారు. భారత్‌తో పాటు ఆసియా మొత్తంగానూ అత్యంత ధనవంతుడు ముకేశే. అంతేకాదు, ప్రపంచ ధనవంతుల జాబితాలోనూ ఆయనకు 4వ స్థానం లభించింది. వరల్డ్‌ టాప్‌-5లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు కూడా. దేశీయ శ్రీమంతుల జాబితాలో ముకేశ్‌ తర్వాత నాలుగు స్థానాల్లో ఉన్న వారి మొత్తం ఆస్తి కంటే ముకేశ్‌ సంపదే అధికం. హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌కు సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు.. 





  1. ఈ ఏడాది ఆగస్టు 31నాటికి రూ.1,000 కోట్లు, అంతకుపైగా ఆస్తి కలిగిన వారిని ఈ జాబితాలో చేర్చారు. ఈసారి మొత్తం 828 మందికి స్థానం లభించింది. 
  2. జాబితాలోని టాప్‌-5 ధనవంతుల ఆస్తి.. మొత్తం 828 మంది సంపదలో 21 శాతానికి సమానం. 
  3. డీ-మార్ట్‌ సూపర్‌ మార్కెట్ల అధిపతి రాధాకిషన్‌ దమానీ ఆస్తి ఈ ఏడాది కాలంలో 56 శాతం వృద్ధి చెంది రూ.87,200 కోట్లకు చేరుకుంది. దాంతో ఆయన తొలిసారిగా టాప్‌- 10లోకి చేరుకున్నారు. 
  4. దేశ రాజధాని ఢిల్లీ కంటే ఆర్థిక రాజధాని ముంబైలోనే అధిక శ్రీమంతులుఉన్నారు. 
  5. మొత్తం 828 మంది ధనవంతుల్లో మహిళలు 5 శాతం (40 మంది) మాత్రమే. గోద్రెజ్‌కు చెందిన స్మితా క్రిష్ణ రూ.32,400 కోట్ల ఆస్తితో దేశంలో అత్యంత ధనిక మహిళగా నిలిచారు. రూ.31,600 కోట్ల నెట్‌వర్త్‌ కలిగిన బయోకాన్‌ చైర్మన్‌ కిరణ్‌ మజుందార్‌ షా ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. 
  6. తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌లో అదరగొట్టిన హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ చైర్మన్‌ అశోక్‌ సూతా కూడా ఈ జాబితా లో చోటు దక్కించుకున్నారు. 

Updated Date - 2020-09-30T07:09:49+05:30 IST