Abn logo
Nov 17 2020 @ 19:21PM

బీపీసీఎల్ కొనుగోలుకు ఆసక్తి చూపని ముఖేష్ అంబానీ...

Kaakateeya

 ముంబై : భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) వాటా కొనుగోలు రేసు నుండి ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కో తప్పుకున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్రం ఈ ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలో వాటాలను విక్రయించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను కేంద్రానికి నాలుగు వరకు బిడ్స్ అందినట్లుగా సమాచారం. ఈ బిడ్స్‌లో రిలయన్స్, విదేశీ చమురు దిగ్గజాలు సౌదీ ఆరామ్‌కో, బ్రిటిష్ పెట్రోలియం, టోటల్ బిడ్స్ ఉన్నాయా ? లేవా ? అన్న విషయమై వ్యాపార వర్గాల్లో స్పష్టత లేకపోవడం గమనార్హం. ఆసక్తి ఉన్న సంస్థల నుండి బిడ్స్ అందుకున్నట్లు లావాదేవీ అడ్వైజర్లు చెప్పినట్లు డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్‌మెంట్ తెలిపింది. అడ్వైజర్ల పరిశీలన అనంతరం లావాదేవీలు రెండో దశలోకి వెళతాయి. కాగా... బిడ్స్ ప్రక్రియ సోమవారంతోనే  ముగిసింది. 


కాగా బీపీసీఎల్‌లో కేంద్రం తన 52.98 శాతం వాటాను విక్రయిస్తోంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.47,430 కోట్లు. దేశవ్యాప్తంగా 17 వేలకు పైగా పెట్రోల్ బంకులు, 6 వేలకు పైగా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీలు, 61 విమానయాన ఇంధన స్టేషన్లు  బీపీసీఎల్‌ కు ఉన్నాయి. కాగా, మూడు నుండి నాలుగు బిడ్లు దాఖలైన నేపథ్యంలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ స్క్రూటినీ అనంతరం రెండో దశలోకి వెళుతుంది. ఇందుకు రెండు నుండి మూడు వారాల సమయం పడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

Advertisement
Advertisement