ముకుల్‌ను బీజేపీ బెదిరించింది, అసలు ద్రోహులు వాళ్లే: మమత

ABN , First Publish Date - 2021-06-11T23:29:30+05:30 IST

పార్టీని వీడిన వాళ్లనందరినీ తిరిగి చేర్చుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నకు మమత సూటిగా..

ముకుల్‌ను బీజేపీ బెదిరించింది, అసలు ద్రోహులు వాళ్లే: మమత

కోల్‌కతా: సొంతగూటికి ముకుల్ రాయ్ తిరిగి చేరుకున్నారు. టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఆయన టీఎంసీలోకి శుక్రవారంనాడు తిరిగి చేరారు. ముకుల్ రాయ్ పునరాగమనాన్ని మమతా బెనర్జీ స్వాగతించారు. ''ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మీకు తెలుసు. ఆయన మళ్లీ సొంతింటికి వచ్చారు. అవును.... మరింత మంది కూడా రాబోతున్నారు'' అని మమత ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


పార్టీని వీడిన వాళ్లనందరినీ తిరిగి చేర్చుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నకు మమత సూటిగా స్పందించారు. ఎన్నికలకు ముందు టీఎంసీలో చేరి బీజేపీలో చేరిన వారిని మాత్రం పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదని, వారంతా 'ద్రోహులు' అని మమత సమాధానమిచ్చారు. ముకుల్‌రాయ్‌ని బీజేపీ బెదిరించిందని, ఆ ప్రభావం ఆయన ఆరోగ్యంపై పడిందని ఆమె ఆరోపించారు. సువేందు అధికారికి సంబంధించి అడిగిన మరో ప్రశ్నకు మమత స్పందిస్తూ, ఎవరైతే వైరం చూపకుండా అత్యంత సున్నితంగా వ్యవహరిస్తూ వచ్చారో వారిని పార్టీలోకి తిరిగి ఆహ్వానిస్తామని చెప్పారు.


ఇండియాకు, బెంగాల్‌కు ఏకైక నేత మమతనే:  ముకుల్

బీజేపీని వీడి పాత మిత్రులను మళ్లీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ముకుల్ రాయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇండియాకు, బెంగాల్‌కు ఏకైక నాయకురాలు మమతేనంటూ ప్రశంసలు కురిపించారు. మమతా బెనర్జీతో తనకు ఎప్పుడూ విభేదాలు లేవని చెప్పారు. ఈ సందర్భంగా మమత జోక్యం చేసుకుంటూ ''విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించకండి' అంటూ మీడియాతో చమత్కరించారు.

Updated Date - 2021-06-11T23:29:30+05:30 IST