మప్పేడులో మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కు

ABN , First Publish Date - 2021-10-13T15:41:02+05:30 IST

తిరువళ్ళూరు జిల్లా మప్పేడు వద్ద రూ.1200 కోట్ల పెట్టుబడితో 10 వేల మందికి ఉపాధి కల్పించే విధంగా ‘మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కు’ ఏర్పాటు కానుంది. రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టిడ్కో), జాతీయ ప్రధా

మప్పేడులో మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కు

- రూ.1200 కోట్ల పెట్టుబడి

- 10 వేల మందికి ఉపాధి

- సీఎం స్టాలిన్‌, కేంద్రమంత్రుల సమక్షంలో ఒప్పందం


చెన్నై: తిరువళ్ళూరు జిల్లా మప్పేడు వద్ద రూ.1200 కోట్ల పెట్టుబడితో 10 వేల మందికి ఉపాధి కల్పించే విధంగా ‘మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కు’ ఏర్పాటు కానుంది. రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టిడ్కో), జాతీయ ప్రధాన రహదారుల సరకుల రవాణా నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌), మద్రాసు పోర్ట్‌ట్రస్టు, ఓ ప్రైవేటు సంస్థ ఈ సరుకుల రవాణా కేంద్రం ఏర్పాటుకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. సచివాలయంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, సర్బానంద్‌ సోనోవాల్‌, జనరల్‌ వీకే సింగ్‌ సమక్షంలో నాలుగు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.


158 ఎకరాల విస్తీర్ణంలో...

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ మప్పేడు వద్ద 158 ఎకరాల విస్తీర్ణంలో మల్టీ మాడల్‌ లాజిస్టిక్స్‌ పార్కు ఏర్పాటు కానుండం రాష్ట్ర పారిశ్రామికచరిత్రలో అరుదైన సంఘటన అని పేర్కొన్నారు. ఈ పార్కు వల్ల రాష్ట్రంలో సరకుల రవాణా సులభ తరమవుతుందని, రవాణా ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. పదివేలమందికి ఉపాధికల్పించేలా ఈ లాజిస్టిక్స్‌ పార్కును ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, మద్రాసు పోర్ట్‌ట్రస్టు సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. కొత్త లాజిస్టిక్స్‌ పార్కు చెన్నై సరిహద్దులో రింగ్‌ రోడ్లకు, విమానాశ్రయానికి, మద్రాసు హార్బర్‌, ఎన్నూరు కామరాజర్‌ హార్బర్‌. కాట్టుపల్లి హార్బర్‌కు చేరువగా ఉందని చెప్పారు. రైలు, రహదారుల్లో సరకుల రవాణా సులువుగా సాగటానికి ఈ పార్కు దోహదపడుతుందన్నారు. అంతేకాకుండా లాజిస్టిక్స్‌ పార్కులో గిడ్డుంగులు, శీతలీకరణ గౌడన్లు, యంత్రాల ద్వారా సరకుల లోడింగ్‌ అన్‌లోడింగ్‌ తదితర సదుపాయాలు కూడా వుంటాయని పేర్కొన్నారు. జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బెంగళూరు - చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవే శ్రీపెరుంబుదూరు సమీపం ఇరుంకాట్టు కోట్టై వద్ద ముగిసేలా ప్రణాళిక రూపొందించారని, ఆ హైవేను చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలని కేంద్రమంత్రులకు స్టాలిన్‌ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కోవై, తూత్తుకుడి నగరాల్లోనూ ఇలాంటి మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి తంగం తెన్నరసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీఇరై అన్బు, పారిశ్రామిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎన్‌.మురుగానంద, మద్రాసు పోర్ట్‌ ట్రస్టు చైర్మన్‌ సునీల్‌ పాలీవాల్‌, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు పంకజ్‌కుమార్‌ బన్సాల్‌, టిడ్కో సీఈఓ వందనా గార్గ్‌, జాతీయ ప్రధాన రహదారుల సరకుల రవాణా నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఎల్‌ ఎంఎల్‌) అధికారి ప్రకాష్‌ కౌర్‌, భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చెన్నై జోన్‌ అధికారి ఎస్పీ సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-13T15:41:02+05:30 IST