ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బహుళ నాయకత్వం

ABN , First Publish Date - 2021-10-22T07:10:39+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బహుళ నాయకత్వం ఉంది.. స్థానికంగా అక్కడ నాయకత్వ కొరత లేదు.. ఇంకొందరు పార్టీలోకి వస్తామంటూ అర్జీలు పెట్టుకున్నారు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బహుళ నాయకత్వం
ఉమ్మడి జిల్లా నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌

 ఉమ్మడి జిల్లా నేతలతో మంత్రి కేటీఆర్‌

నల్లగొండ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బహుళ నాయకత్వం ఉంది.. స్థానికంగా అక్కడ నాయకత్వ కొరత లేదు.. ఇంకొందరు పార్టీలోకి వస్తామంటూ అర్జీలు పెట్టుకున్నారు.. వారి నాయకత్వం మీద విశ్వసనీయత లేదు.. అందుకే వారిని పక్కన పెట్టాం.. అటువంటి వారిని ప్రోత్సహించే పరిస్థితి పార్టీ లేదని యువనేత, మంత్రి కేటీఆర్‌ అన్నారు. నవంబరు 15న వరంగల్‌లో ద్విదశాబ్ది విజయోత్సవ సభ నేపథ్యంలో హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఉమ్మడి జిల్లాతో ఆయన మాట్లాడారు. పార్టీపై, ప్రభుత్వంపై విమర్శలు చేసే వారికి ఘాటైన సమాధానం ఇవ్వాలని, ప్రతిపక్షాల ఆరోపణలను సమర్ధంగా తిప్పికొట్టాలని సూచించారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న షాదీముబారక్‌, కల్యాణలక్ష్మీ, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వంటి వాటిని నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలన్నారు. దీంతో వాడకట్టు మొత్తం విస్తృత ప్రచారం, చర్చ కొనసాగుతుందన్నారు. దీంతో పార్టీకి, స్థానిక నాయకత్వానికి ఉపయోగంగా ఉంటుందన్నారు.


భారీగా జనసమీకరణ చేయాలి

వరంగల్‌లో నిర్వహించనున్న ద్విదశాబ్ది విజయోత్సవ సభకు భారీగా జనసమీకరణ చేయాలని సూచించారు. అందుకు నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలో జన సమీకరణ, వాహనాల ఏర్పాటు తదితరాలు చూసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా ఎన్ని బస్సులు ఏర్పాటు చేయాలనే అంశాన్ని వివరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 2040 ఆర్టీసీ బస్సులు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. 50వేల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలన్నారు. వరంగల్‌కు సమీపంలోని తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, సూర్యాపేట తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలించాలన్నారు. ఈనెల 27న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించనున్న ప్లీనరీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మునిసిపల్‌ చైర్మన్ల వరకు అంతా గులాబీ రంగు చొక్కా ధరించి హాజరుకావాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావమే ఓ సాహసోపేతమైన నిర్ణయమని, అటువంటి పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకొని 21వ వసంతలోకి ప్రజా బహుళ్యానికి చేరువై ఉందంటే అది సీఎం కేసీఆర్‌ ఘనతే అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వందలాది పార్టీలు పుట్టినా నిలదొక్కుకున్నది రెండే రెండు పార్టీలని అందులో మొదటిది తెలుగుదేశం కాగా, రెండోది టీఆర్‌ఎస్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి ఏపీలో ఉప ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి లక్ష్యాలను చేధించడమేగాక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో తొలి, మలి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగిందంటే అది సీఎం కేసీఆర్‌ విజన్‌కు నిదర్శనం అన్నారు. ఇకనుంచి లీడర్‌, క్యాడర్‌కు చేతినిండా పనే ఉంటుందని, ఉమ్మడి జిల్లాలో మూడు పార్టీ కార్యాలయాలు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటిని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని, ఈ సమయంలో శిక్షణ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్‌, గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చినపరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్‌, రాంచంద్రనాయక్‌, సందీ్‌పరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T07:10:39+05:30 IST