బహుళ తాత్వికం తిలక్‌ కవిత్వం

ABN , First Publish Date - 2021-06-14T07:05:49+05:30 IST

కాలం ఎప్పుడూ సాపేక్షమే. కవిత్వమూ అంతే. రోజులు గడిచే కొద్దీ కవీ కవిత్వమూ కాలపరీక్షను ఎదుర్కొంటారు. ఒకానొక వర్తమానంలో కొన్ని సిద్ధాంతాలు, ధోరణులు, వాదనలూ సాహిత్యాన్ని...

బహుళ తాత్వికం తిలక్‌ కవిత్వం

కాలం ఎప్పుడూ సాపేక్షమే. కవిత్వమూ అంతే. రోజులు గడిచే కొద్దీ కవీ కవిత్వమూ కాలపరీక్షను ఎదుర్కొంటారు. ఒకానొక వర్తమానంలో కొన్ని సిద్ధాంతాలు, ధోరణులు, వాదనలూ సాహిత్యాన్ని బలంగా ప్రభావితం చేస్తాయి. అవి ఎంత బలంగా ఉంటాయంటే వాటికి ఎదురువెళ్లడం యుగధర్మాన్ని ప్రతిఘటించడమే అవుతుంది. అంతటి ప్రతికూల పరిస్థితులలో కూడా వాటికి భిన్నమైన ఆలోచనలు పొడ చూపుతుంటాయి. వాటిని గుర్తించ డానికీ, ప్రేమించడానికీ, ప్రకటించడానికీ సమాజం భయపడుతుంది. ఈ ఆలోచనలు చిన్నప్పుడు కథలో చదువుకున్నట్టుగా తుఫాను సమయంలో తలలు వంచి వాతావరణం తెరిపినపడ్డాక తలలెత్తే చిన్నచిన్న మొక్కలు. ఇవి క్రమంగా ఎదిగి అస్తిత్వాన్ని ప్రకటిస్తాయి. అట్లాగే ఎన్ని విప్లవాత్మక మార్పులు సంభ వించినా గతంతో పూర్తిగా తెగదెంపులు చేసుకోలేని లక్షణం ఒకటి సమాజంలో ఉంటుంది. రాయి ఆదిమ మానవుడి ఆయుధం. అయితే అణ్వాయుధాలు వచ్చిన కాలంలోనైనా కుక్క వెంటపడ్డప్పుడు కంటికి కనిపించిన బెడ్డముక్కే ఆయుధమౌతుంది. ఎన్ని గ్రైండింగ్‌ మెషీన్లు వచ్చినా రుచితెలిసిన గృహిణి ఎక్కడో ఒకచోట సన్నికల్లు మీద పచ్చడి నూరుతూనే ఉంటుంది. దీన్నే అవిచ్ఛిన్నత అన్నారు. వర్తమాన నూతన భావనలు గతాన్ని ప్రభావితం చేసిన కొన్ని సార్వత్రిక మానవీయ భావనల్ని తనతో కలుపుకున్నపుడూ, మానవజాతి విముక్తికి ఏ ఒక్క సిద్ధాంతమో పరిష్కారం చూపలేదని భావించినపుడూ, అఖండసత్యం అంటూ లేదనీ ఉన్నవన్నీ పాక్షిక సత్యాలేననీ అర్థమైనపుడూ ఆలోచనాపరుడు లేదా కళాకారుడు విభిన్నమైనవీ లేదా వ్యతిరిక్తమైనవీ అనుకున్న భావనల్ని సంలీనపరుస్తాడు. దాన్నే బహుళ తాత్వికత అనవచ్చు. యాభై ఐదేళ్ల క్రితం మరణించి ఈ సంవత్సరం శతజయంతి జరుపుకుంటున్న దేవరకొండ బాలగంగాధర తిలక్‌ (1 ఆగస్టు 1921 - 1 జులై 1966) కవిత్వం అటువంటి బహుళతాత్వికతకు ఉత్తమ ఉదాహరణ అనిపిస్తుంది.


శ్రీశ్రీ యుగంలో కవిత్వ వ్యక్తిత్వాన్నీ నిలుపుకున్న ఒకరిద్దరిలో తిలక్‌ ఒకడు. శ్రీశ్రీ అతన్ని వయస్సు సగం తీరక ముందే, నభం సగం చేరకముందే అస్తమించిన ప్రజాకవీ, ప్రభారవీ అన్నాడు. సమకాలిక సమస్యలకు స్వచ్ఛ స్ఫాటిక ఫలకం అని కూడా అన్నాడు. అభ్యుదయ భావాలకు రమ్యమైన శైలిని సమకూర్చడంలో తిలక్‌ కృతకృత్యుడయ్యాడన్నారు కుందుర్తి. కుందుర్తి వేసిన బాటలో చాలామంది ప్రయాణించి తిలక్‌ని భావాభ్యుదయ కవి అనీ, మానవతా వాద కవి అనీ అన్నారు. రాచమల్లు రామచంద్రారెడ్డి తిలక్‌ నెహ్రూ మీద రాసిన ఎలిజీలో తన లక్షణాలనే నెహ్రూకు ఆపాదించినట్లు చెబుతూ తిలక్‌ ఏమరుపాటున అభ్యుదయం మాట్లాడినా అతను తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడని అన్నారు. అయితే వీళ్లందరూ తిలక్‌ సమకాలికులు. తిలక్‌ కవిత్వం రాస్తున్న కాలంలో జీవించి, ఆయన మరణించిన కాలపు సమీప వర్తమానంలో స్పందించిన వాళ్లు. వీళ్లు తిలక్‌ను అంచనా కట్టే నాటికి తిలక్‌ మీద ఎవరెవరి ప్రభావాలు ఉన్నాయో గ్రహింపుకొచ్చే వీలుంది కానీ కాలం మీద తిలక్‌ చూపగల ప్రభావం వారి చర్చలో లేదు. తిలక్‌ మరణించిన అర్ధశతాబ్దం తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆయన నడచిన, దారులు వేసిన బాటలు ఇప్పుడు తెలుగు కవిత్వానికి రహదారులయ్యాయని అర్థమౌతుంది. అప్పుడు నిరాదరణకు నిర్లక్ష్యానికి నిందకూ గురైన భావనలు కొన్ని ఇప్పుడు ఆదరింపబడి ఆమోదింపబడుతున్నాయని కూడా అర్థమౌతుంది. ఉదాహరణకు రా.రా. దుర్లక్షణంగా భావించిన ఏకాంత సౌందర్య రచన, స్వాప్నికతలు కవిత్వం కోల్పోవడానికి వీలులేని మౌలిక లక్షణాలని అంగీకార మైంది. రా.రా. తిలక్‌లో నిరసించిన ప్రబంధ కవిత్వ భాష కూడా కవి తన భాషా సామర్థ్యం కోసం అధ్యయనం చేయాల్సిన అంశమే అయ్యింది. మొత్తం మీద కొంచెం తేరిపార చూస్తే తెలుగు కవిత్వం మీద ఇప్పుడు శ్రీశ్రీ కాలం నాటి ఏకైక సిద్ధాంత ప్రభావం కన్నా తిలక్‌లోని బహుళ తాత్విత ఛాయలే ఒకింత ఎక్కువ ఉన్నట్టనిపిస్తుంది.


తిలక్‌లో బహుళతాత్విక ఛాయల్ని గుర్తించడంతోపాటు శ్రీశ్రీ యుగం విస్మరించిన కొన్ని సార్వత్రిక భావనల్ని తిలక్‌ కవిత్వీకరించడం వల్ల ఆయన ఇప్పుడు మరింత రిలవెంట్‌గా ఉన్నాడని చెప్పడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.


ఇంతా చేస్తే శ్రీశ్రీ కన్నా తిలక్‌ పదకొండేళ్లే చిన్నవాడు. శ్రీశ్రీ డెబ్భై మూడేళ్లు బతికి ముప్పై ఎనిమిదేళ్ల క్రితం మరణిస్తే తిలక్‌ నలభై ఐదేళ్లే బతికి యాభై ఐదేళ్ల క్రితం మరణించాడు. మరణంలో శ్రీశ్రీ కన్నా తిలక్‌ పెద్దవాడు. తిలక్‌ మరణించాక గడచిన కాలం కూడా జీవించిన కాలం కన్నా పెద్దది. మహా ప్రస్థాన గీతాల్ని శ్రీశ్రీ మార్క్సిజం ప్రభావంతో రాసినా రాయకపోయినా అవి తెలుగు కవిత్వం మీద చూపిన ప్రభావం అపారం. శ్రీశ్రీ నిబద్ధుడు కాకముందు రాసిన సారవంతమైన కవిత్వం అతన్నీ తెలుగు కవిత్వాన్నీ 1970దాకా నడిపిస్తే అక్కణ్ణుంచీ విప్లవ భావజాలమే అతన్నీ అతని కవిత్వాన్నీ నడిపించింది. 


తిలక్‌ 1966లో మరణించగా 1968లో ‘అమృతం కురిసిన రాత్రి’ తొలి కూర్పు వచ్చింది. ఆ సంపుటి 1971లో సాహిత్య అకాడెమి బహుమతి పొందింది. అది 1999 లోపు పది ముద్రణలు పొందింది. అంటే సగటున మూడేళ్లకొకటి. నిర్దిష్టమైన గణాంకాలు లేవు గానీ ఆ తర్వాత ఇంకా ఎక్కువ ముద్రణలే పొందింది. ఇది తిలక్‌ కవిత్వం పట్ల పెరుగుతున్న ఇష్టానికి ఒక కొలమానం.


శ్రీశ్రీ తిలక్‌ల వంటి ఇద్దరు ప్రతిభావంతుల ప్రభావాలను అంచనా వేస్తున్న ప్పుడు వారి క్రొనాలజీని పరిగణనలోకి తీసుకోవాలి. తిలక్‌ కంటే ముందుతరానికి చెందిన శ్రీశ్రీ ప్రభావం తిలక్‌ మీద తిలక్‌ కాలపు కవిత్వం మీద ఉంది. అయితే తిలక్‌ శ్రీశ్రీ తరువాతి కాలానికి చెంది ప్రతిభావంతుడైన కవి అని గుర్తించినపుడు అతను కవిత్వం మీద చూపిన ప్రభావరీత్యా అతన్ని శ్రీశ్రీ కన్నా వెనుక ఉంచడమో తక్కువ చెయ్యడమో సరికాదు. శ్రీశ్రీ ప్రభావంతో ఆయనలాగే కవిత్వం రాసినవాళ్లు ఒక్కరు కూడా మిగలకుండా కొట్టుకుపోయారు. తిలక్‌ మిగిలాడు. శ్రీశ్రీ విప్లవమార్గం పట్టినపుడు దాని మీద ఆయన కవిత్వ ప్రభావం స్వల్పం. తిలక్‌ను చూస్తున్న కోణంలోంచే ఆయన తరవాతి కాలానికి చెందిన చెరబండరాజునూ, శివసాగర్‌ చూసినపుడు విప్లవకవిత్వం మీద శ్రీశ్రీ ప్రభావంకన్నా వీరిద్దరి ప్రభావమే ఎక్కువని అర్థమౌతుంది. కాబట్టి 1930లలో ప్రారంభమైన శ్రీశ్రీ శతాబ్దం 1980కి ముగిసింది.


తెలుగు కవిత్వంలో 1960 తర్వాత కవులుగా నిలదొక్కున్న అజంతా, బైరాగి, ఇస్మాయిల్‌, వేగుంట మొదలుకొని అస్తిత్వవాద కవుల దాకా అందరూ శ్రీశ్రీ ప్రభావం నుంచి బయటపడో లేదా లేకుండానేనో నిలదొక్కుకున్నవాళ్లే. అందులో మొదటివాడు తిలక్‌. తిలక్‌ ప్రభావం ప్రధానంగా శ్రీశ్రీ కాలం నాటి పరిమిత వస్తుదృష్టి నుంచి కవిత్వాన్ని విముక్తం చెయ్యడంలో దానికి విస్తృతినివ్వడంలో ఉంది. అంటే తిలక్‌ బహుళ తాత్వికతలో ఉంది. తిలక్‌ కవిత్వంలో అగాథ బాధాపాథః పతంగాలతోపాటు గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ, త్యాగశక్తి, ప్రేమరక్తి, శాంతిసూక్తి ఉన్నాయి. చీకటి నవ్విన చిన్ని వెలుతురుంది. అప్పుడు ఆల్ఫ్‌ మీద మంచు దుఃఖంలా కరిగింది. వెన్నెల బిందువు కొబ్బరిమొవ్వులోకి వినపడీ వినపడని చప్పుడుతో జారిపడింది. నీరంధ్ర వర్షాన వంతెనకింద నిండు చూలాలు ప్రసవించి మూర్ఛిల్లింది. గొంగళీపురుగులు సగం సగం తిన్న కలల్ని నెమరేస్తో బజ్జున్నాయి. ఏకాకి నౌక నిర్లిప్తంగా తీరం వదలి సముద్రంలోకి వెళిపోయింది. సూర్యుణ్ణి తలమీద పువ్వుగా ధరించింది వసుధైక గీతం. దీపాల మధ్య చీకటి దివ్యంగా మెరిసిపోయింది. గజానికొక గాంధారి కొడుకు పుట్టాడు. జీవితపు ప్రిజం వేర్వేరు కోణాల్ని ప్రతిబింబించింది. సువర్ణం కన్నా అగ్రవర్ణం లేదని అందరూ అంగీకరించారు. పంచశీలలో చైనా అనే సీల ఊడిపోయింది. మతావేశం పొదుగుకున్న జాతి కోతి అయ్యింది. రహస్య సృష్టి సానువుల నుండి కాంతి జలపాతం జారిపడింది. అంతరాంతర జ్యోతిస్సీమలు బహిర్గత మయ్యాయి. ఇంటికున్న కిటికీలన్నీ తెరుచుకున్నాయి. ఆమె లేకపోయినా ఇంటి ముందు జూకామల్లె తీగలో అల్లుకున్న ఆమె పాట మిగిలి ఉంది. వైవిధ్య భరితమైన ఈ తీరే తిలక్‌ బహుళత్వపు మూలం.


1980 తర్వాత వచ్చిన కవిత్వం శ్రీశ్రీని దాటి కొత్త పుంతలు తొక్కినపుడు అందులో ఎక్కువ ప్రతిఫలించింది ఈ భావనలే! అంతకుముందే అనుభూతి కవిత్వం పేరిట ప్రారంభమైన స్వచ్ఛ కవిత్వంలో తిలక్‌ నీడలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన అస్తిత్వవాద కవిత్వాలు మార్క్సిస్టు సిద్ధాంతంతో విభేదించడంలో ‘కాదు ధనికవాదం, సామ్యవాదం’ అన్న తిలక్‌ మార్గం ఉంది. 1980 తర్వాత కలంపట్టిన కవులు ప్రధానంగా స్త్రీవాద, దళిత, మైనారిటీ, ప్రాంతీయవాద కవిత్వాన్నో రాసినప్పటికీ వారంతా ఆ సైద్ధాంతిక చట్రానికి పరిమితం కాకుండా విస్తార మైన జీవనానుభవాన్ని కవిత్వం చెయ్యడంలో తిలక్‌ ఉన్నాడు. ఇవాళ తెలుగులో ఏ వాదానికి చెందిన కవి అయినా ఎంతోకొంత అంతర్ముఖుడు కాగలుగుతున్నా డంటే, తన భావజాలానికి వెలుపల రాయడానికి వెరవడం లేదంటే అది తిలక్‌ ఇచ్చిన ధైర్యమే! గురజాడ తర్వాత శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రజాస్వామికం చేశాడనడం నిజం. అది అత్యధిక సంఖ్యలో ఉన్న పేదవాళ్లని చేర్చడంతో వచ్చిన ప్రజా స్వామ్యం. తిలక్‌ ఆ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూనే కవిత్వంలో వేర్వేరు మానవానుభవాలకూ, భావధారలకూ, సిద్ధాంతాలకూ చోటుకల్పించడం ద్వారా బహుళ తత్వం కలిగిన ప్రజాస్వామ్యానికి పాదులు వేశాడు.


తిలక్‌ కలం నుంచి వచ్చిన తొలి కవితాపంక్తి అనదగ్గ ‘నా కవిత్వం కాదొక తత్వం’ లోనే బహుళత్వానికి పునాది పడింది. శ్రీశ్రీ ప్రభావానికి లోనై అభ్యుదయ కవిత్వం రాస్తున్న కాలంలోనే: ‘‘భారతదేశాన్ని కాదనలేను/ రష్యా దేశాన్ని కొలవ లేను/ నిజం ఎక్కడో అక్కడ నా ప్రాణం ఉంది/ హృదయం ఎక్కడో అక్కడ ఉదయం ఉంది’’ అన్నాడు. ‘‘ఒక సత్యంతో మరో సత్యాన్ని ఖూనీ చెయ్యకు/ పరదేశ స్తుతిలో స్వకీయ సంస్కృతి విస్మరించకు/ ఇంకా కరిగి నీరైపోలేదు హిమాలయ శిఖరాలు/ ఇంకా మరచిపోలేదు తథాగతుని మహాత్ముని ప్రవచనాలు/ ...../ సమ్యక్‌ సమ్మేళనం లేని తౌర్యత్రికం కఠోరమౌతుంది/ కరుణ లేని కవివాక్కు సంకుచితమౌతుంది’’ అన్నాడు. కరుణను కవిత్వానికి అంతిమ లక్ష్యంగా చెయ్యడంతో అన్ని రకాల హింసనూ విధ్వంసాలనూ కవిత్వం ఆవరణ నుంచి నెట్టివేశాడు తిలక్‌.


సంస్కృతిని అంగీకరించడం తిరోగమనం కాదన్నాడు తిలక్‌. సందర్భం వచ్చినపుడల్లా విశ్వనాథను ఖండించాడు. ‘‘వెలుగును వెనక్కు నెట్టుతూ రేపటి రోజుకి/ పదివేల సంవత్సరాలనాటి పాతముఖాన్ని అతికించేందుకు/ ఒక ‘హాహా హూహూవూ’ ప్రయత్నిస్తోన్న ప్రాతః కాలాన’’ అనీ, ‘‘విశ్వనాథ వారు వెనక్కి వెనక్కి నడవగా/ వేదకాలం యింకా వెనక్కివెనక్కి పోయిందట’’ అనీ, ‘‘మూలమూల ముడుచుకు కూర్చున్నదాన్ని/ మనువుచేసుకోవాలన్న ఉబలాటంతో/ మంచీచెడ్డా మరచిపోయాడు/ మర్యాదల్ని అతిక్రమించాడు/ మరి పనికిరాడు’’ అనీ అనేశాడు. అంటే తిలక్‌ చూసిన దేశీయ సంస్కృతి విశ్వనాథ నిలబెట్టా లనుకున్న సంస్కృతి వేర్వేరని స్పష్టమైంది. 


రష్యాను వ్యతిరేకించిన తిలక్‌ నెహ్రూ మరణిస్తే విచలితుడయ్యాడు: ‘‘చారిత్రక దృక్పథం అతని శక్తి/ సమ్యక్‌ సిద్ధాంత రథ్యమీద రథాన్ని నడిపిస్తాడు’’ అన డానికి ముందు భూత భవిష్యత్‌ వర్తమానాలను ముడివేసే అతని నాయకత్వాన్ని శ్లాఘించాడు. నెహ్రూను అభిమానించడం ప్రజాస్వామిక సామ్యవాదాన్ని అభి మానించడమే కదా!  


తిలక్‌ యుద్ధం, కరువు వంటి సార్వకాలిక సమస్యలను విస్మరించలేదు. తన సమకాలీన కవుల కంటేనే కాదు, తన ముందు కాలపు కవుల కంటే కూడా ఎక్కువ యుద్ధ వ్యతిరేక కవిత్వం రాశాడు. కారణాలకూ అవసరాలకూ అతీతంగా యుద్ధాన్ని అనాగరిక సంభవంగా గుర్తించాడు తిలక్‌. ‘సైనికుడి ఉత్తరం’, ‘వెళ్లిపొండి వెళ్లి పొండి’, ‘అమ్మా నాన్నెక్కడికెళ్లాడు’ కవితలు యుద్ధ ప్రకటన చెయ్యబోయే ప్రతి దేశాధినేత చదవాల్సినవి: ‘‘శాంతి కోసం యుద్ధాన్ని ప్రజ్వలింప జేస్తారు/ సుఖం కోసం ఆ రక్త విప్లవాన్ని తరింప చేస్తారు/ శ్మశాన భూమిని వికసిస్తుంది మీరు నాటిన పూలచెట్టు/ కానీ ఎవరు తుడుస్తారు తల్లీ నీ కన్నీటిబొట్టు’’ అన్నాడు తిలక్‌. కరోనా ముందు వరకూ యుద్ధానికి ఉవ్విళ్లూరిన మన ప్రభుత్వాలకు తిలక్‌ కవిత్వం హెచ్చరిక. 


‘‘ఏ దేశసంస్కృతి అయినా ఏనాడూ కాదొక స్థిరబిందువు/ నైక నదీనదాలు అదృశ్యంగా కలసిన అంతస్సింధువు’’ అన్న తిలక్‌ ఇవాళ్టి సాంస్కృతిక జాతీయ వాదాన్ని కూడా పూర్వ పక్షం చేశాడు. ఈ కవితను ఆయన ఎత్తుకున్న ‘‘మన సంస్కృతి నశించిపోతుందని’’ విచారపడిన సందర్భమే విస్తరించి మెజారిటీ సాంస్కృతిక వాదంగా పరిణమించింది. ‘‘ఎటొచ్చీ విధవలకీ వ్యాకరణానికీ మనుస్మృతికీ/ గౌరవం లేదని వీరికి దిగులు/ ...../ అందరూ లోకంలో శప్తులూ పాపులూ/ మనం మాత్రం భగవదంశ సంభూతులమని వీరి నమ్మిక/ సూర్యుడూ చంద్రుడూ దేవతలూ దేవుళ్లూ/ కేవలం వీరికే తమ వోటిచ్చినట్లు వీరి అహమిక’’ అన్న తిలక్‌ ‘‘ఇది జాతికీ ప్రగతికీ కనబడని విపత్తు’’ అని అప్పుడే ప్రకటించాడు. ఆ విపత్తు ఇప్పుడు రానే వచ్చింది.


‘హార్లెంస్‌లో శవం’ కవితను తిలక్‌ ఏడాది క్రితం రాసినట్టుంటుంది. జార్జి ఫ్లాయిడ్‌ మెడ మీద మోకాలు పెట్టి ప్రాణం పోయేదాకా తొక్కిపెట్టిన అమెరికన్‌ జాత్యహంకారం అంతకు ముందు అనేక సార్లు సుడులు విచ్చిందని మనకు తెలుసు. 1964 జులైలో హార్లెంస్‌ నగరంలో బలైన జార్జి ఫ్లాయిడ్‌ పేరు జేంస్‌ పోవెల్‌. తొమ్మిద తరగతి చదువుతున్న పదిహేను సంవత్సరాల కుర్రాడు. ఆడుకుంటున్న చోట తనకేమాత్రం సంబంధం లేకుండా ప్రారంభమైన జాతి వివక్ష గొడవలోకి చొరవగా ప్రవేశించి ఒక్కడుగా దూసుకెళ్లడానికి ప్రయత్ని స్తూన్నపుడు, కేవలం చిన్న హెచ్చరికతో నిలువరించబడే అవకాశం ఎంతో ఉన్న చోట థామస్‌ గిల్లిగన్‌ అనే పోలీస్‌ అధికారిచే నిర్దాక్షిణ్యంగా కాల్చివేయబడ్డాడు. తెలుగు కవులెవరైనా దీన్ని పట్టించుకున్నారో లేదో గానీ తిలక్‌ దృష్టి నుంచి ఇది తప్పించుకో లేదు: ‘‘దేశదేశాల మనుషుల్లారా/ చచ్చిన పోవెల్‌ మీ తమ్ముడు, మీ మేనల్లుడు,/ మీ లోపలి మానవుడు’’ అని అంటూ, ‘‘ప్రతి ఒకడూ దీనికి బాధ్యుడు/ చరిత్ర పగనెవడూ తప్పించుకోలేడు’’ అంటూ గొప్ప భవిష్య దర్శనంతో ముగించాడు. తిలక్‌ ఆర్థిక అసమానతల వెల్లువలో పడి సామాజిక అసమానతల్ని విస్మరించలేదని స్ఫష్టమైంది


మార్క్స్‌నీ మహాత్ముణ్ణీ, బుద్ధుణ్ణీ శంకరుణ్ణీ, అంగీకరించిన తిలక్‌లో సమన్వయ దృక్పథం ఉంది. విశ్వతత్వం ఉంది. మనిషి మౌలికత మీద తాత్విక దృక్పథం ఉంది. ప్రేమ, కరుణ వంటి మానవీయ గుణాల మీద నమ్మకం ఉంది. సమత్వం కోసం ఆరాటం ఉంది. అహింసను వదులుకోలేని నాగరికత ఉంది. పుట్టిన దేశాన్నీ సంస్కృతినీ వదుకోలేని బెంగ ఉంది. మనుస్మృతి మీద వ్యతిరేకత ఉంది. గతంతో అనుసంధానమై ఉన్న అవిచ్ఛిన్నత ఉంది. అన్ని రకాల భావజాలాల వైపరీత్యాల మీద, మానసిక జాఢ్యాల మీద నిరసన ఉంది. తెలుగులో ఇప్పుడిప్పుడే సంతరించుకుంటున్న బహుళతాత్విక దృక్పథ మూలాలు తిలక్‌లో ఉన్నాయి. అవి ఆయన్ని సమకాలీనం చేస్తున్నాయి.

కొప్పర్తి వెంకట రమణ మూర్తి

Updated Date - 2021-06-14T07:05:49+05:30 IST