విమర్శను బలోపేతం చేసేందుకు ‘బహుళ’ స్వరాలు

ABN , First Publish Date - 2020-07-27T06:16:45+05:30 IST

మూల్యాంకనం పునర్మూల్యాంకనం, నిర్ధారణ, పునర్నిర్ధారణలు, ప్రగతి మార్గంలో పయనించే మనిషి చేసే పనులు. సాహితీ మార్గంలో ఈ పనులు చేసేది విమర్శకుడు. సృజనకారునికి ఉన్నట్లే విమర్శకునికి...

విమర్శను బలోపేతం చేసేందుకు ‘బహుళ’ స్వరాలు

కులం-మతం, మెజారిటీ-మైనారిటీ, ప్రాంతీయత-జాతీయత, పేద-ధనిక, స్త్రీ-పురుష, వర్గము-వర్ణము, భాష-సంస్కృతి ఇలా అనేక రకాలుగా సమాజం విభజితమై ఉంది. ఈ విభజన వెనుకగల శక్తులు, సమాజంలోని అన్ని మూలాలకు వ్యాపించినయి. సాహిత్యాన్ని కూడా ప్రభావితం చేసినవి. నన్నయ నుండి నేటి వరకు గల విమర్శ తీరుతెన్నులను, ప్రభావాలను పునర్మూల్యాంకనానికి పెట్టినవి. ‘బహుళ’ వాటికి చోటు కల్పించింది. ఇన్ని గొంతుల్ని ఒకేచోట చదవడానికి పాఠకునికి వీలు చేకూర్చింది.


మూల్యాంకనం పునర్మూల్యాంకనం, నిర్ధారణ, పునర్నిర్ధారణలు, ప్రగతి మార్గంలో పయనించే మనిషి చేసే పనులు. సాహితీ మార్గంలో ఈ పనులు చేసేది విమర్శకుడు. సృజనకారునికి ఉన్నట్లే విమర్శకునికి కూడా ఒక దృక్పథం ఉంటుంది. మెరుగైన సాహిత్య ప్రస్థానం కోసం విమర్శ. దీని వెనకాల పరిచయం/ సమీక్ష/ విశ్లేషణ/ విమర్శ అనే పేరు మీద జరిగే తతంగం అంతా ఎట్లుందో, ఎట్లా ఉండాలో చెపుతున్నది ‘బహుళ’ (సాహిత్య విమర్శ, సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు) అనే పుస్తకం. 25 వ్యాసాలతో కూడిన ఈ సంపుటికి ఎ.కె.ప్రభాకర్‌ సంపాదకుడు.


ఆశ్రితజన పక్షపాతము, బంధుజన ప్రీతి, పరస్పర సహాయము అనేవి సమాజంలో విశ్వరూపం ధరించి నర్తిస్తున్నవి. ఈ నాట్యము నయనానందకరంగా, కళాత్మకంగా సాగుతున్నది. ఫలితంగా సమాజంలో పెడధోరణులు వ్యాప్తి చెందినవి. ఇలాంటి ధోరణులు సాహిత్యంలోకి వచ్చి చేరినవి. స్నేహాలు, పరిచయాలు, విమర్శను ప్రభావితం చేస్తున్నవి. ఐడెంటిటీ క్రైసిస్‌ రచయితలను, విమర్శకులను ఆవహించినది. తన-పర భావనలు రాజ్యమేలుతూ విమర్శను నిర్దేశిస్తున్నవి. ఈ విషయాన్ని సామాజిక విమర్శలో భాగంగా ప్రస్తావించింది ‘బహుళ’. ఇక్కడే సిద్ధాంత చర్చ కనిపిస్తుంది. భావజాలాలన్నీ వృత్త కేంద్రకం నుండి బయల్దేరి, వికేంద్రీకరణ చెంది, వృత్త పరిధిలో తమ తమ స్థలాల్లో కుదురుకున్నవి. అక్కడి నుండి మాట్లాడుతున్నవి. ఆ మేరకు సూక్ష్మపరిశీలన సాధ్యపడింది. అదే సమయాన ఇతరుల పట్ల అసహన ప్రదర్శన జరిగింది. ఈ ప్రమేయం వల్ల విమర్శకు జరిగిన మేలు, కీడు ఏమిటి- అనేది ‘బహుళ’ చర్చించింది. విమర్శ ఎలా ఉండాలి? అని వివేచించింది.


కులం-మతం, మెజారిటీ-మైనారిటీ, ప్రాంతీయత-జాతీయత, పేద-ధనిక, స్త్రీ-పురుష, వర్గము-వర్ణము, భాష-సంస్కృతి ఇలా అనేక రకాలుగా సమాజం విభజితమై ఉంది. ఈ విభజన వెనుకగల శక్తులు, సమాజంలోని అన్ని మూలాలకు వ్యాపించినయి. సాహిత్యాన్ని కూడా ప్రభావితం చేసినవి. నన్నయ నుండి నేటి వరకు గల విమర్శ తీరుతెన్నులను, ప్రభావాలను పునర్మూల్యాంకనానికి పెట్టినవి. ‘బహుళ’ వాటికి చోటు కల్పించింది. ఇన్ని గొంతు ల్ని ఒకేచోట చదవడానికి పాఠకునికి వీలు చేకూర్చింది. అస్తిత్వ స్పృహ, విస్మృత సమూహాలకు గొంతునిచ్చింది. ఇందులోని గొంతులు దళిత వాద, స్త్రీవాద, మైనారిటీ వాద విశిష్టతలను తెలుపు తూనే, బ్రాహ్మణవాద విమర్శ చేసిన హాని ఏమిటో చెప్పాయి. ఆధునిక భావాలు, సాహిత్యోద్యమాల నుండి డయాస్పోరా సాహిత్యం వరకు జరిగిన పరిణామాలు ఏ విధంగా విమర్శకు దోహదపడగలవో తెలిపింది. సమాజము-సాహిత్యము రెండు వస్తు- శిల్పాల్లాగా పరస్పరాధారితాలు. చాలావరకు శిల్పాన్ని వదిలి ‘‘వస్తువు’’ గురించి మాట్లాడుతుంటరు. వస్తువు కళగా మారటంలో తోడ్పడేది శిల్పం. వస్తువు సాహితీ రూపంగా మారడానికి దోహదపడేది శిల్పం. వస్తువును గ్రహించటం కొంత సులభమే. కాని శిల్పాన్ని సాధించటం కష్టం. శిల్పంపై దృష్టిపెట్టే రచయితలు తక్కువగా కనిపిస్తారు. అట్లాగే ఇందులోని వ్యాసాలు రూపాన్ని తక్కువగా సారాన్ని ఎక్కువగా పట్టించుకున్నాయి. కళా సాహిత్య సౌందర్య శాస్త్ర పరికరాలకు దక్కిన స్థలం తక్కువ. ఆ మేరకు అందించిన సమాచారం సమగ్రంగానే ఉంది. ఇందులో అకడమిక్‌ విలువలున్నవి. ‘విభాత సంధ్యలు’, ‘మనలో మనం’ తర్వాత ఆ కోవలో చాన్నాళ్ళకు వచ్చిన వ్యాస సంపుటి ఇది.


అనుభవజ్ఞుడైన మనిషి తనదైన లోకదృష్టిని సంతరించుకుంటడు. రచయిత తనదైన దృక్పథాన్ని ఏర్పరచుకుంటడు. సామజిక, రాజకీయ, ఆర్థిక, భౌగోళిక, సాంకేతిక జ్ఞానం విమర్శకుడు కలిగి ఉండాలి. అదే సమయంలో విమర్శకుడు సొంత దృక్పథాన్ని అలవరుచుకోవాలి. ఈ సంపుటిలో భిన్న దృక్పథాల్ని తెలిపే విలువైన వ్యాసాలున్నాయి. వీటి వల్ల విమర్శకుడు రచనను ఏ విధంగా విశ్లేషించాలి. ఎలాంటి ప్రతిపాదనలు చెయ్యాలి అనే విషయాలపై అవగాహన పెంచుకుంటాడు. సామాజిక చలనాలను, సాహిత్య ధోరణులను వివేచించగల శక్తిని సాధిస్తడు. పాతను తలపోయడం ఫ్యాషన్‌ అయింది. పాతను తిట్టిపోయడం గొప్ప అయింది. ఏక కాలంలో రెండు ధోరణులు ఉండడం ఎలా సాధ్యమైంది? నూతన అభివృద్ధి విధానాలను తలచుకొని వలపోయడం, వాటి ఆధారంగావచ్చిన ఫలితాలను అనుభవించడం సాధారణమైంది. ద్వంద్వం ఎలా వచ్చింది? రెండు నాల్కల్ని సృజన ఏ విధంగా పొదవికొని ఉంది. ఈ కవచాల్ని పెకిలించాలంటే రాజకీయార్థిక విషయాలపై అవగాహన ఉండాలి. దాన్ని అందించే విషయాలు, వ్యాసాలు ఇందులో ఉన్నవి.


బాహ్యదృష్టి బహుళమై, అంతర్దృష్టి లుప్తమౌతున్న కాలమిది. వెలుపలా, లోపలా నిశితంగా చూపుల్ని ప్రసరించాల్సిన సృజన ఎందుకో ఒకవైపే చూస్తుంది. దానికి సమ దృష్టినివ్వాల్సిన విమర్శ నేడు సంచలనాలను ప్రేమిస్తుంది. అందుకే సత్యాల్ని సాపేక్షంగా చూడగలగాలి, చూపగలగాలి అని చెబుతుంది ‘బహుళ’. నిశితమైన, నిక్కచ్చిగా ఉన్న అభిప్రాయాలకే కాక ‘‘విమర్శ వ్యర్థకలాపం’’ అనే భావనకు కూడా విలువ ఇచ్చి ఒక ప్రజాస్వామిక నడకను నడిచి చూపింది. సాహితీ లోకంలో జరుగుతున్న వ్యవహారాల పట్ల పెద్దన్న ధోరణిలో అసహనం వెలగక్కడం కొన్ని వ్యాసాల్లో కనిపిస్తుంది. ద్వేష పూరిత ఖండనల స్థానంలో నిర్మాణాత్మక సూచనలు కావాలి. విమర్శకుని దృక్పథమేదైనా, విమర్శకు ఒక మెథడాలజీ అవసరం. ఈ విషయాల్ని బహుళ ప్రాథమికాంశాలుగా గుర్తించింది. సాహిత్యాన్ని వివేచించడానికి, సామాజిక చలనాల ఛోదక శక్తుల గురించిన తెలివిడి ఉండాలి. అందుకు సామాజిక విమర్శ తెలిసి ఉండాలి. బహుళ దానికి పెద్దపీట వేసింది. అదే సమయంలో విమర్శకుడికి కళాసూత్రజ్ఞానం ఉండాలి. బహుళ దానికి ఉచితాసనం కల్పించింది. ‘పర్‌స్పెక్టివ్స్‌’ పబ్లికేషన్స్‌ నుండి వెలువడిన ఈ పుస్తకం విశ్వవిద్యాలయాల్లో రిఫరెన్స్‌బుక్‌గా ఉండతగినది.

బి.వి.ఎన్‌. స్వామి

92478 17732

Updated Date - 2020-07-27T06:16:45+05:30 IST