ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం

ABN , First Publish Date - 2022-01-24T08:34:25+05:30 IST

శ్రీకాళహస్తి దేవస్థాన ఆస్థాన జ్యోతిష పండితుడు, శ్రీశైల, వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి (63) శివైక్యమయ్యారు.

ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం

  • తీవ్రమైన గుండెపోటు.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి
  • మాజీ సీఎం చంద్రబాబు సంతాపం.. నేడు అంత్యక్రియలు


కవాడిగూడ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి దేవస్థాన ఆస్థాన జ్యోతిష పండితుడు, శ్రీశైల, వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి (63) శివైక్యమయ్యారు. ఆదివారం సాయంత్రం తీవ్రమైన గుండెపోటు రావడంతో.. ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో.. నిమ్స్‌ ఆస్పత్రి వద్ద కారులోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే డ్రైవర్‌.. అదే ఆస్పత్రిలోకి తీసుకెళ్లగా.. అక్కడ ఎమర్జెన్సీ బెడ్లు ఖాళీ లేకపోవడంతో.. సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆయన మృతి చెందారని నిర్ధారించారు. గుంటూరు జిల్లా పండరీపురం గ్రామంలో జన్మించిన ములుగు.. పంచాంగ శ్రవణం, రాశిఫలాలు, జ్యోతిష ఫలితాలను వెల్లడించడం ద్వారా ఖ్యాతి గడించారు. నాలుగు దశాబ్దాలకు పైగా జ్యోతిష రంగానికి సేవలందించిన ఆయన.. తొలుత మిమిక్రీ కళాకారుడిగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆయన రూపొందించి విడుదల చేసిన ‘శ్రీదేవి పెళ్లి’ అనే హాస్య కథానిక.. సంచలనం సృష్టించింది. ఆ క్యాసెట్లు లక్షల్లో అమ్ముడయ్యాయి. సినీ హాస్యనటులు బ్రహ్మానందం, ఏవీఎ్‌సలతో కలిసి కొన్ని స్టేజ్‌ షోలు కూడా చేశారు. నాడు ఎన్టీఆర్‌.. తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు.. ఆయన అభిమానిగా రామలింగేశ్వర శాస్త్రి.. పార్టీ ప్రచారంలో పాలుపంచుకున్నారు.


నాటి కాంగ్రెస్‌ నాయకుల స్వరాలను అనుకరిస్తూ అప్పట్లో ఆయన చేసిన మిమిక్రీ.. ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. అనంతర కాలంలో జ్యోతిష రంగంలోకి వచ్చి అసమాన కీర్తి ప్రతిష్ఠలను సాధించారు. ఎన్నికలు, రాజకీయం సహా అనేక విషయాల్లో ఆయన చెప్పిన జ్యోతిషం చాలా సందర్భాల్లో అక్షర సత్యమైంది. చంద్రబాబు, జయలలిత మళ్లీ ముఖ్యమంత్రులు అవుతారని, 2019లో జగనే సీఎం అవుతారని ఆయన చెప్పిన జ్యోతిషం నిజమయింది. శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి వేదాలు, పూజా, హోమాది క్రతువుల్లో శిక్షణ పొందిన బ్రాహ్మణులతో కలిసి ఆయన ప్రతి మాస శివరాత్రికీ పాశుపతహోమాలు నిర్వహించేవారు. కాగా, రామలింగేశ్వర సిద్ధాంతికి భార్య విజయ (52)తో పాటు కుమార్తె శివజ్యోతి ఉండగా.. కుమారుడు కార్తీక్‌.. 15 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాగా, రామలింగేశ్వర శాస్త్రి అంత్యక్రియలు సోమవారం ఉదయం 11 గంటలకు మలక్‌పేట్‌లోని  హిందూ శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ములుగు మృతి పట్ల ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బాధాకరమన్నారు. పంచాంగ కర్తగా, జ్యోతిష పండితుడిగా ఆయన చేసిన సేవలు నిరుపమానమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2022-01-24T08:34:25+05:30 IST