ప్లేఆఫ్స్‎కు ముంబై!

ABN , First Publish Date - 2020-10-29T09:21:37+05:30 IST

సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 నాటౌట్‌) మ్యాచ్‌ విన్నింగ్‌ హాఫ్‌ సెంచరీతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ప్లేఆ ఫ్స్‌కు

ప్లేఆఫ్స్‎కు ముంబై!

లక్ష్యం చిన్నదే అయినా.. పిచ్‌ బౌలర్లకు సహకరిస్తుండడంతో ముంబై శిబిరంలో కొంత ఆందోళన రేగింది. కానీ, కీలక మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. తుదికంటా నిలిచి.. ముంబైని ఒంటి చేత్తో గెలిపించాడు. పడిక్కళ్‌ అర్ధ శతకంతో మెరిసినా.. బుమ్రా దెబ్బకు బెంగళూరు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఈ విజయంతో మొత్తం 16 పాయింట్లతో ముంబై ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నట్టే! 


అదరగొట్టిన సూర్యకుమార్‌

బెంగళూరు ఓటమి 

పడిక్కళ్‌ శ్రమ వృథా


అబుదాబి: సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 నాటౌట్‌) మ్యాచ్‌ విన్నింగ్‌ హాఫ్‌ సెంచరీతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ప్లేఆ ఫ్స్‌కు దాదాపుగా చేరుకుంది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 164/6 స్కోరు చేసింది. దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (45 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 74) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. ఛేదనలో ముంబై 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. సిరాజ్‌, చాహల్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సూర్యకుమార్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. 


‘సూర్య’ ప్రతాపం: సూర్యకుమార్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో ముంబై గట్టెక్కింది. పరుగులు చేయడానికి మిగతా బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందులు పడుతున్నా.. సూర్యకుమార్‌ అలవోకగా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఐదో వికెట్‌కు హార్దిక్‌ పాండ్యాతో కలసి 51 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలిపించాడు. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ఓపెనర్లు డికాక్‌ (18), ఇషాన్‌ కిషన్‌ (25) పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. ఆరో ఓవర్‌లో డికాక్‌ను అవుట్‌ చేసిన సిరాజ్‌.. తొలి వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఊరించే బంతితో ఇషాన్‌ను చాహల్‌ బోల్తా కొట్టించాడు. అయితే, సూర్యకుమార్‌ ఎంట్రీతో సీన్‌ మారింది. చాహల్‌ వేసిన 10వ ఓవర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ 6,4తో గేర్‌ మార్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లో సిరాజ్‌ బౌలింగ్‌లో పడిక్కళ్‌ మంచి క్యాచ్‌ అందుకోవడంతో సౌరభ్‌ తివారి (5) వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ముంబై 73/3తో నిలిచింది. స్టెయిన్‌ వేసిన 13వ ఓవర్‌లో యాదవ్‌ మూడు ఫోర్లు బాదాడు. అయితే, చాహల్‌ బౌలింగ్‌లో చెత్త షాట్‌తో క్రునాల్‌ వికెట్‌ పారేసుకోవడంతో.. నాలుగో వికెట్‌కు 35 రన్స్‌ భాగస్వామ్యం ముగిసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్యా (17) ధాటిగా ఆడాడు. చివరి 30 బంతుల్లో 48 రన్స్‌ అవసరమవగా, సిరాజ్‌ వేసిన 16వ ఓవర్‌లో సూర్యకుమార్‌ 3 ఫోర్లతో 13 రన్స్‌ రాబట్టడంతో మ్యాచ్‌ ముంబైవైపు మొగ్గింది. హార్దిక్‌ను మోరిస్‌ అవుట్‌ చేసినా, ఆఖరి ఓవర్‌ తొలి బంతిని ఫోర్‌కు తరలించి సూర్యకుమార్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. 


పడిక్కళ్‌ అదరగొట్టినా: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు జోష్‌ ఫిలిప్‌ (33), పడిక్కళ్‌ మంచి ఆరంభాన్ని అందించినా.. బుమ్రా దెబ్బకు మిడిలార్డర్‌ కుప్పకూలడంతో ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఫామ్‌లో లేని ఫించ్‌ స్థానంలో ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ ఫిలి్‌పకు ఓపెనర్‌గా అవకాశం దక్కింది. ఆరంభంలో ఇద్దరూ ఆచితూచి ఆడినా.. ఆ తర్వాత డేరింగ్‌ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. టచ్‌లో ఉన్న పడిక్కళ్‌ బౌండ్రీలతోనే ఎక్కువ పరుగులు స్కోరు చేశాడు. దీంతో పవర్‌ప్లేలో బెంగళూరు వికెట్‌ నష్టపోకుండా 54 పరుగులు చేసింది. అయితే, 7వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ (1/43).. ఫిలి్‌పను స్టంప్‌ అవుట్‌ చేసి ముంబైకు బ్రేకిచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బందిపడ్డ కోహ్లీ (9)ని బుమ్రా అవుట్‌ చేయడంతో ముంబై మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చింది. మరోవైపు ధాటిగా ఆడుతున్న పడిక్కళ్‌ 13వ ఓవర్‌లో ఫోర్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన డివిల్లీర్స్‌(15) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ప్యాటిన్సన్‌ వేసిన 14వ ఓవర్‌లో డివిల్లీర్స్‌ 4,6 బాదాడు. చాహర్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో పడిక్కళ్‌ ఒక్కసారిగా 6,4,4తో చెలరేగాడు.. ఐపీఎల్‌లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. అయితే, మూడో వికెట్‌కు 36 పరుగులతో వీరిద్దరి భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో.. డివిల్లీర్స్‌ను అవుట్‌ చేసి పొలార్డ్‌ దెబ్బకొట్టాడు. 


5 బంతుల్లో 3 వికెట్లు: 17వ ఓవర్‌ మూడో బంతికి శివమ్‌ దూబె (2)ను అవుట్‌ చేసిన బుమ్రా.. ఐదో బంతికి పడిక్కళ్‌ను పెవిలియన్‌ చేర్చడంతో డెత్‌ ఓవర్లలో చాలెంజర్స్‌ పుంజుకోలేకపోయింది. 18వ ఓవర్‌ రెండో బంతికి మోరిస్‌ (4)ను బౌల్ట్‌ క్యాచ్‌ అవుట్‌ చేశాడు. ఆఖర్లో గుర్‌కీరత్‌ (14 నాటౌట్‌), సుందర్‌ (10 నాటౌట్‌) జట్టు స్కోరును 160 పరుగులు దాటించారు. 


స్కోరుబోర్డు

బెంగళూరు: జోష్‌ ఫిలిప్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) రాహుల్‌ 33, దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (సి) బౌల్ట్‌ (బి) బుమ్రా 74, కోహ్లీ (సి) తివారి (బి) బుమ్రా 9, డివిల్లీర్స్‌ (సి) రాహుల్‌ (బి) పొలార్డ్‌ 15, శివమ్‌ దూబె (సి) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 2, మోరిస్‌ (సి) ప్యాటిన్సన్‌ (బి) బౌల్ట్‌ 4, గుర్‌కీరత్‌ సింగ్‌ (నాటౌట్‌) 14, వాషింగ్టన్‌ సుందర్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 164/6; వికెట్ల పతనం: 1-71, 2-95, 3-131, 4-134, 5-134, 6-138; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-40-1, బుమ్రా 4-1-14-3, క్రునాల్‌ 4-0-27-0, ప్యాటిన్సన్‌ 3-0-35-0, రాహుల్‌ చాహర్‌ 4-0-43-1, పొలార్డ్‌ 1-0-5-1. 

ముంబై: డికాక్‌ (సి) గుర్‌కీరత్‌ (బి) సిరాజ్‌ 18, ఇషాన్‌ కిషన్‌ (సి) మోరిస్‌ (బి) చాహల్‌ 25, సూర్యకుమార్‌ (నాటౌట్‌) 79, సౌరభ్‌ తివారి (సి) పడిక్కళ్‌ (బి) సిరాజ్‌ 5, క్రునాల్‌ పాండ్యా (సి) మోరిస్‌ (బి) చాహల్‌ 10, హార్దిక్‌ పాండ్యా (సి) సిరాజ్‌ (బి) మోరిస్‌ 17, పొలార్డ్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 19.1 ఓవర్లలో 166/5; వికెట్ల పతనం: 1-37, 2-52, 3-72, 4-107, 5-158; బౌలింగ్‌: మోరిస్‌ 4-0-36-1, స్టెయిన్‌ 4-0-43-0, సుందర్‌ 4-0-20-0, సిరాజ్‌ 3.1-0-28-2, చాహల్‌ 4-0-37-2. 

Updated Date - 2020-10-29T09:21:37+05:30 IST