ముంబై.. కసిదీరా.

ABN , First Publish Date - 2020-10-02T09:37:05+05:30 IST

ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓటములతో కసి మీదున్న ముంబై ఇండియన్స్‌ పంజా విసిరింది. రోహిత్‌ శర్మ (45 బంతుల్లో 8 ఫోర్లు...

ముంబై.. కసిదీరా.

గత మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ ద్వారా భంగపడిన ముంబై ఇండియన్స్‌.. ఈసారి ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. 192 పరుగుల ఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ పూర్తిగా తడబడింది. పేస్‌.. స్పిన్‌తో బెంబేలెత్తించిన ముంబై బౌలర్లు రాహుల్‌ సేనను పేకమేడలా కూల్చారు. సూపర్‌ ఓపెనింగ్‌ జోడీ మయాంక్‌, రాహుల్‌లను స్వల్ప స్కోరుకే కట్టడి చేసి ఆదిలోనే పైచేయి సాధించారు. అంతకుముందు నత్తనడకన సాగిన ముంబై ఇన్నింగ్స్‌కు చివర్లో పొలార్డ్‌, హార్దిక్‌ భారీ సిక్సర్లతో ఊపు తెచ్చారు. దీంతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఏర్పడింది..


చిత్తుగా ఓడిన పంజాబ్‌

రోహిత్‌ అర్ధసెంచరీ

చెలరేగిన పొలార్డ్‌, హార్దిక్‌


అబుదాబి: ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓటములతో కసి మీదున్న ముంబై ఇండియన్స్‌ పంజా విసిరింది. రోహిత్‌ శర్మ (45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) అర్ధసెంచరీకి తోడు.. బౌలర్లు బుమ్రా (2/18), రాహుల్‌ చాహర్‌ (2/26), ప్యాటిన్సన్‌ (2/28) సమష్టి ప్రదర్శనతో చెలరేగారు. ఫలితంగా పంజాబ్‌ కింగ్స్‌ లెవన్‌పై 48 పరుగుల తేడాతో ముంబై ఘనవిజయం సాధించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు సాధించింది. ఆఖర్లో పొలార్డ్‌ (20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 నాటౌట్‌), హార్దిక్‌ (11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 నాటౌట్‌) దుమ్ము రేపారు. ఆ తర్వాత ఛేదనలో పంజాబ్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడింది. పూరన్‌ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) మాత్రమే రాణించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పొలార్డ్‌ నిలిచాడు.

పోరాటమే లేదు..: భారీ స్కోరు ఛేదనలో పంజాబ్‌ నుంచి ఎలాంటి పోరాటమూ కనిపించలేదు. ఒత్తిడికి లోనై ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్‌ మయాంక్‌ (25)ను బుమ్రా అద్భుత బంతితో బౌల్డ్‌ చేయగా అటు కరుణ్‌ నాయర్‌ (0)ను క్రునాల్‌ డకౌట్‌ చేశాడు. కొద్దిసేపటికే కెప్టెన్‌ రాహుల్‌ (17)ను స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ దెబ్బతీయడంతో 60 పరుగులకే పంజాబ్‌ టాపార్డర్‌ పెవిలియన్‌లో కూర్చుం ది. ఈ దశలో నికోలస్‌ పూరన్‌ క్రీజులో ఉన్నంతసేపు అదరగొట్టాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ప్రమాదకరంగా కనిపించాడు. తను మరి కొద్దిసేపుంటే మ్యాచ్‌ పరిస్థితి ఎలా ఉండేదో కానీ 14వ ఓవర్‌లో ప్యాటిన్సన్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో మ్యాక్స్‌వెల్‌ (11), నీషమ్‌ (7), సర్ఫరాజ్‌ (7) వికెట్లు కోల్పోవడంతో పంజాబ్‌ పరాజయం ఖాయమైంది.

ఆచితూచి..: ఆరంభంలో ముంబై ఇన్నింగ్స్‌ సాగిన తీరు చూస్తే భారీ స్కోరు సాధ్యమేనా అనిపించింది. కానీ పొలార్డ్‌, పాండ్యా తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చివరి ఆరు ఓవర్లలోనే 104 పరుగులు వచ్చాయి. అంతకుముందు తొలి ఓవర్‌ నే మెయిడిన్‌గా వేసిన పేసర్‌ కాట్రెల్‌.. డికాక్‌ (0) వికెట్‌ సైతం తీశాడు. ఇక సూర్యకుమార్‌ (10)ను ఫైన్‌ లెగ్‌ నుంచి నేరుగా విసిరిన త్రోతో షమి రనౌట్‌ చేశాడు. దీంతో ముంబై 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే క్రీజులో కెప్టెన్‌ రోహిత్‌, ఇషాన్‌ కిషన్‌ ఉన్నప్పటికీ పంజాబ్‌ బౌలర్ల లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులకు బౌండరీలు సాధించడం కష్టమైంది. దీంతో తొలి 10 ఓవర్లలో జట్టు చేసింది 62 పరుగులే.. ఇక 14వ ఓవర్‌లో ఇషాన్‌ క్యాచ్‌ అవుట్‌ కావడంతో మూడో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 

డెత్‌ ఓవర్లలో విజృంభణ: 14 ఓవర్ల దాకా నిదానంగా సాగిన ముంబై ఇన్నింగ్స్‌ ఆ తర్వాత రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. బిష్ణోయ్‌ వేసిన 15వ ఓవర్‌లో పొలార్డ్‌, రోహిత్‌ చెరో సిక్సర్‌ బాది గేరు మార్చారు ఆ తర్వాత నీషమ్‌ను ఓ ఆట ఆడుకుంటూ రోహిత్‌ వరుసగా 4,4,6,6తో 22 పరుగులు రాబట్టాడు. కానీ షమి అతడి దూకుడుకు బ్రేక్‌ వేశాడు. 17వ ఓవర్‌లో రోహిత్‌ బౌండరీ లైన్‌ దగ్గర ఇచ్చిన క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్‌ అందుకుని.. అదుపు తప్పే ప్రయత్నంలో బంతిని నీషమ్‌ వైపు విసరడంతో రోహిత్‌ అవుట్‌ కాక తప్పలేదు. ఇక 18వ ఓవర్‌లో హార్దిక్‌ 6,4,4తో 18 రన్స్‌ రాబట్టాడు. మరోవైపు 19వ ఓవర్‌లో పొలార్డ్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో 19 రన్స్‌.. ఆఖరి ఓవర్‌లోనైతే హ్యాట్రిక్‌ సిక్సర్లతో 25 పరుగులు రావడంతో జట్టు భారీ స్కోరు సాధించింది. 


రోహిత్‌ @ 5000

రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు ఐపీఎల్‌లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఫీట్‌ సాధించిన మూడో ఆటగాడయ్యాడు. విరాట్‌ కోహ్లీ (5430), సురేశ్‌ రైనా (5368) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.


స్కోరుబోర్డు

ముంబై ఇండియన్స్‌: డికాక్‌ (బి) కాట్రెల్‌ 0, రోహిత్‌ (సి) నీషమ్‌ (బి) షమి 70, సూర్యకుమార్‌ (రనౌట్‌/షమి) 10, ఇషాన్‌ (సి) కరుణ్‌ నాయర్‌ (బి) గౌతమ్‌ 28, పొలార్డ్‌ (నాటౌట్‌) 47, హార్దిక్‌ (నాటౌట్‌) 30; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 191/4; వికెట్ల పతనం: 1-0, 2-21, 3-83, 4-124; బౌలింగ్‌: కాట్రెల్‌ 4-1-20-1, షమి 4-0-36-1, రవి బిష్ణోయ్‌ 4-0-37-0, కృష్ణప్ప గౌతమ్‌ 4-0-45-1, నీషమ్‌ 4-0-52-0.

కింగ్స్‌లెవెన్‌ పంజాబ్‌: కేఎల్‌ రాహుల్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 17, మయాంక్‌ అగర్వాల్‌ (బి) బుమ్రా 25, కరుణ్‌ నాయర్‌ (బి) క్రునాల్‌ పాండ్యా 0, నికోలస్‌ పూరన్‌ (సి) డికాక్‌ (బి) ప్యాటిన్సన్‌ 44, మ్యాక్స్‌వెల్‌ (సి) బౌల్ట్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 11, నీషమ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 7, సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ (ఎల్బీ) ప్యాటిన్సన్‌ 7, కృష్ణప్ప గౌతమ్‌ (నాటౌట్‌) 22, రవి బిష్ణోయ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బౌల్ట్‌ 1, షమి (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 143/8; వికెట్ల పతనం: 1-38, 2-39, 3-60, 4-101, 5-107, 6-112, 7-121, 8-124; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-42-1, ప్యాటిన్సన్‌ 4-0-28-2, క్రునాల్‌ పాండ్యా 4-0-27-1, బుమ్రా 4-0-18-2, రాహుల్‌ చాహర్‌ 4-0-26-2.

Updated Date - 2020-10-02T09:37:05+05:30 IST