Abn logo
Nov 6 2020 @ 01:55AM

హైహై ముంబై

Kaakateeya

ఫైనల్లో రోహిత్‌ సేన 

బుమ్రాకు 4 వికెట్లు

57 పరుగులతో ఢిల్లీ చిత్తు 


ముంబై ఇండియన్స్‌ సమష్టి ప్రదర్శనతో గర్జించింది. గ్రాండ్‌ విక్టరీతో ఐపీఎల్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. బ్యాటింగ్‌లో ఇషాన్‌, హార్దిక్‌ మెరుపులు మెరిపించగా.. బుమ్రా బుల్లెట్‌లా విరుచుకుపడడంతో వార్‌ వన్‌సైడ్‌ అయింది. గట్టి పోటీ ఇస్తుందనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఆఖరికి ముంబై చేతిలో చెత్తగా.. చిత్తుగా ఓడింది. ఈ విజయంతో ముంబై వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరగా.. ఢిల్లీ టైటిల్‌ ఆశలు ఇంకా ముగియలేదు. క్వాలిఫయర్‌-2 రూపంలో క్యాపిటల్స్‌కు మరో అవకాశం ఉంది. 


దుబాయ్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఐపీఎల్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇషాన్‌ కిషన్‌ (30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా (14 బంతుల్లో 5 సిక్స్‌లతో 37 నాటౌట్‌) వీరవిహారం చేయగా.. పేస్‌గన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (4/14) నిప్పులు చెరగడంతో.. గురువారం జరిగిన క్వాలిఫయర్స్‌-1లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 57 పరుగులతో మట్టికరిపించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 200/5 స్కోరు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) అర్ధ సెంచరీ చేశాడు. అశ్విన్‌ (3/29) మూడు వికెట్లు తీశాడు. ఛేదనలో ఢిల్లీ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 143 పరుగులే చేసింది. స్టొయినిస్‌ (65) హాఫ్‌ సెంచరీ చేశాడు. బౌల్ట్‌ (2/9) రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా.. ఢిల్లీ టైటిల్‌ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఫైనల్‌ బెర్త్‌ కోసం ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విజేతతో ఢిల్లీ క్వాలిఫయర్‌-2లో తలపడనుంది. బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.


బుమ్రా దెబ్బకు విలవిల: భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ కనీస పోరాటాన్ని ప్రదర్శించలేకపోయింది. ఆరంభంలోనే బౌల్ట్‌, బుమ్రా నిప్పులు చెరగడంతో.. ఢిల్లీ బ్యాటింగ్‌ పేకమేడను తలపించింది. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా లేకుండానే మూడు టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఓపెనర్‌ పృథ్వీ షాను డకౌట్‌ చేసిన బౌల్ట్‌ ఢిల్లీ పతనానికి నాంది పలికాడు. ఆ తర్వాతి ఓవర్‌లో ధవన్‌ (0)ను బుమ్రా బౌల్డ్‌ చేశాడు. 3వ ఓవర్‌లో రహానె (0)ను బౌల్ట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 0/3తో పీకల్లోతు కష్టాలోపడ్డ ఢిల్లీని కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (12), స్టొయినిస్‌ ఆదుకొనే ప్రయత్నం చేశారు. కానీ, అయ్యర్‌ను క్యాచ్‌ అవుట్‌ చేసిన బుమ్రా నాలుగో వికెట్‌కు 20 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. రిషభ్‌ పంత్‌ (3)ను క్రునాల్‌ పెవిలియన్‌ చేర్చాడు. అనంతరం వచ్చిన అక్షర్‌ పటేల్‌ (42) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. స్టొయిని్‌సతో కలసి ఆరో వికెట్‌కు 71 రన్స్‌ జోడించినా.. అవి ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి. 12వ ఓవర్‌లో స్టొయినిస్‌ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. తర్వాతి ఓవర్‌లో 6,4తో చెలరేగాడు. మరోవైపు అక్షర్‌ కూడా బ్యాట్‌కు పని చెప్పాడు. పొలార్డ్‌ 15వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదాడు. తర్వాతి ఓవర్‌లో స్టొయినిస్‌, సామ్స్‌ (0)ను బుమ్రా అవుట్‌ చేశాడు. అక్షర్‌ను పొలార్డ్‌ పెవిలియన్‌ చేర్చాడు. 


హార్దిక్‌ మెరుపులు: రోహిత్‌ నిరాశపరిచినా.. ఇషాన్‌, సూర్యకుమార్‌ అర్ధ శతకాలకు తోడు.. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా విధ్వంసంతో ముంబై భారీస్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆదిలోనే అశ్విన్‌ షాకిచ్చాడు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ రోహిత్‌ను డకౌట్‌ చేశాడు. మరో ఓపెనర్‌ డికాక్‌ (40) మాత్రం తొలి బంతి నుంచే బ్యాట్‌ను ఝళిపించాడు. అతడికి సూర్యకుమార్‌ నుంచి సహకారం అందడంతో స్కోరు వేగం పెరిగింది. అశ్విన్‌ 6వ ఓవర్‌లో సూర్యకుమార్‌ 6,4 బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 63/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే, డికాక్‌ను అవుట్‌ చేసిన అశ్విన్‌.. రెండో వికెట్‌కు 62 రన్స్‌ భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశాడు. అనంతరం ఇషాన్‌తో కలసి సూర్యకుమార్‌ స్కోరుబోర్డును నడిపించాడు. 12వ ఓవర్‌లో నోకియా బౌలింగ్‌లో ఫోర్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకున్న యాదవ్‌.. ఐదో బంతికి క్యాచ్‌ అవుటయ్యాడు. పొలార్డ్‌(0)ను అశ్విన్‌ పెవిలియన్‌ చేర్చాడు. 


‘డెత్‌’లో మోత: రబాడ 15వ ఓవర్‌లో ఇషాన్‌ 4,6తో గేర్‌ మార్చాడు. తర్వాతి ఓవర్‌లో ఇషాన్‌ 2 ఫోర్లు బాదగా.. క్రునాల్‌ సిక్స్‌తో మొత్తం 18 పరుగులు పిండుకున్నారు. క్రునాల్‌ను అవుట్‌ చేసిన స్టొయినిస్‌.. మూడో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. హార్దిక్‌ రావడంతోనే భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. రబాడ 19వ ఓవర్‌లో హార్దిక్‌ రెండు సిక్స్‌లు కొట్టగా.. ఇషాన్‌ బౌండ్రీ బాదాడు. ఆఖరి ఓవర్‌లో పాండ్యా 6,6 సాధించగా.. ఇషాన్‌ చివరి బంతిని సిక్స్‌కు తరలించడంతో ముంబై స్కోరు 200 మార్క్‌కు చేరింది. వీరి దెబ్బకు ఢిల్లీ ఆఖరి 5 ఓవర్లలో 78 పరుగులు సమర్పించుకుంది. 


స్కోరు బోర్డు

ముంబై: డికాక్‌ (సి) ధవన్‌ (బి) అశ్విన్‌ 40, రోహిత్‌ శర్మ (ఎల్బీ) అశ్విన్‌ 0, సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) సామ్స్‌ (బి) నోకియా 51, ఇషాన్‌ కిషన్‌ (నాటౌట్‌) 55, పొలార్డ్‌ (సి) రబాడ (బి) అశ్విన్‌ 0, క్రునాల్‌ పాండ్యా (సి) సామ్స్‌ (బి) స్టొయినిస్‌ 13, హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 37; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 200/5; వికెట్ల పతనం: 1-16, 2-78, 3-100, 4-101, 5-140; బౌలింగ్‌: సామ్స్‌ 4-0-44-0, అశ్విన్‌ 4-0-29-3, రబాడ 4-0-42-0, అక్షర్‌ పటేల్‌ 3-0-27-0, నోకియా 4-0-50-1, స్టొయినిస్‌ 1-0-5-1;


ఢిల్లీ: పృథ్వీషా (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 0, ధవన్‌ (బి) బుమ్రా 0, రహానె (ఎల్బీ) బౌల్ట్‌ 0, శ్రేయాస్‌ అయ్యర్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 12, స్టొయినిస్‌ (బి) బుమ్రా 65, రిషభ్‌ పంత్‌ (సి) సూర్యకుమార్‌ (బి) క్రునాల్‌ 3, అక్షర్‌ పటేల్‌ (సి) చాహర్‌ (బి) పొలార్డ్‌ 42, సామ్స్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 0, రబాడ (నాటౌట్‌) 15, నోకియా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 143/8; వికెట్ల పతనం: 1-0, 2-0, 3-0, 4-20, 5-41, 6-112, 7-112, 8-141; బౌలింగ్‌: బౌల్ట్‌ 2-1-9-2, బుమ్రా 4-1-14-4, క్రునాల్‌ 4-0-22-1,  కల్టర్‌నైల్‌ 4-0-27-0, పొలార్డ్‌ 4-0-36-1, రాహుల్‌ చాహర్‌ 2-0-35-0.


6

ముంబై ఫైనల్‌ చేరడం ఇది ఆరోసారి. వరుసగా రెండోసారి.


10

ఐపీఎల్‌లో 200 ప్లస్‌ స్కోరు చేయడం ముంబైకిది పదోసారి. ఈ పదిసార్లూ ముంబై మ్యాచ్‌ నెగ్గడం విశేషం.


Advertisement
Advertisement