ప్చ్‌..ముం‘బై’

ABN , First Publish Date - 2021-10-09T06:41:59+05:30 IST

డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌నుంచి నిష్క్రమించింది. పరుగుల వర్షం కురిసిన శుక్రవారంనాటి ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 42 పరుగులతో నెగ్గి కోల్‌కతా.

ప్చ్‌..ముం‘బై’

హైదరాబాద్‌పై  గెలుపు

అయినా ఐపీఎల్‌నుంచి అవుట్‌

కిషన్‌, సూర్య సునామీ ఇన్నింగ్స్‌

కోల్‌కతాకు నాలుగో బెర్త్‌

ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్‌

10వ తేదీ: ఢిల్లీ గీచెన్నై (క్వాలిఫయర్‌ 1-దుబాయ్‌)

11వ తేదీ: బెంగళూరుగీకోల్‌కతా (ఎలిమినేటర్‌-షార్జా)

13వ తేదీ : క్వాలిఫయర్‌-2 (షార్జా)

15వ తేదీ: ఫైనల్‌ (దుబాయ్‌)


అబుధాబి: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌నుంచి నిష్క్రమించింది. పరుగుల వర్షం కురిసిన శుక్రవారంనాటి ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 42 పరుగులతో నెగ్గి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో 14 పాయింట్లతో సమంగా నిలిచింది. కానీ మెరుగైన రన్‌రేట్‌తో నైట్‌రైడర్స్‌కు నాలుగో ఫ్లేఆఫ్స్‌ బెర్త్‌ దక్కింది. తాను భారీ స్కోరు చేసిన వికెట్‌పై రైజర్స్‌ను 65 రన్స్‌కే పరిమితం చేయడం సాధ్యంకాని వేళ..ముంబై లీగ్‌ దశతోనే టోర్నీనుంచి తిరుగుముఖం పట్టింది. రైజర్స్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ గాయంతో బరిలోకి దిగకపోవడంతో మనీష్‌ పాండే కెప్టెన్‌గా వ్యవహరించాడు. చావోరేవో అయిన మ్యాచ్‌లో కీలకమైన టాస్‌ గెలిచిన ముంబై మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది.


ఇషాన్‌ కిషన్‌ సునామీ ఇన్నింగ్స్‌ (32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 84) అనంతరం సూర్యకుమార్‌ యాదవ్‌ (40 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 82) తుఫాన్‌ బ్యాటింగ్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 235/9తో భారీ స్కోరు చేసింది. ఐపీఎల్‌, చాంపియన్స్‌లీగ్‌లో ముంబైకిది అత్యధిక స్కోరు కావడం విశేషం. హైదరాబాద్‌ బౌలర్లలో హోల్డర్‌ నాలుగు, అభిషేక్‌ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం హైదరాబాద్‌ 20 ఓవర్లలో 193/8 స్కోరే చేసింది. మనీశ్‌ పాండే (41 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69 నాటౌట్‌) అజేయ అర్ధ శతకం సాధించాడు. జేసన్‌ రాయ్‌ (21 బంతుల్లో 6 ఫోర్లతో 34), అభిషేక్‌ శర్మ (16 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33) రాణించారు. నీషమ్‌, బుమ్రా, నైల్‌ తలో రెండు వికెట్లు తీశారు. ఇషాన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.


హైదరాబాద్‌ దీటైన జవాబు:

భారీ లక్ష్య ఛేదనలో రాయ్‌, అభిషేక్‌ శర్మ హైదరాబాద్‌కు చక్కటి ఆరంభం ఇచ్చారు. రెండో ఓవర్లో రెండు పోర్లు బాదిన రాయ్‌..మరుసటి ఓవర్లో మరో రెండు బౌండ్రీలు, అభిషేక్‌ సిక్సర్‌ కొట్టడంతో హైదరాబాద్‌ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. కల్టర్‌ నైల్‌ బౌలింగ్‌లో యువ బ్యాటర్‌ అభిషేక్‌ హ్యాట్రిక్‌ ఫోర్లు సాధించడంతో పవర్‌ ప్లేలో హైదరాబాద్‌ రాయ్‌ వికెట్‌ కోల్పోయి 70/1తో ప్రత్యర్థికి దీటుగానే బదులిచ్చింది. తర్వాత పాండే, గార్గ్‌ (29) తప్ప మిగిలినవారు విఫలమయ్యారు.


ఇషాన్‌ తుఫాన్‌:

నాకౌట్‌కు చేరాలంటే 171 రన్స్‌తో ముంబై గెలవాలి. ఈనేపథ్యంలో ఆ జట్టుకు టాస్‌ రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. ముంబైకి ఇషాన్‌ సునామీ ఇన్నింగ్స్‌తో అద్భుత ఆరంభం ఇచ్చాడు. కొడితే ఫోరు లేదంటే సిక్స్‌ అన్న స్థాయిలో సన్‌రైజర్స్‌ బౌలర్లను చీల్చిచెండాడాడు. స్పిన్నర్‌ మహ్మద్‌ నబీ హైదరాబాద్‌ బౌలింగ్‌ దాడిని మొదలుపెట్టగా..రెండో బంతిని కిషన్‌ మిడ్‌వికెట్‌ వైపు సిక్సర్‌గా మలిచాడు. పేసర్‌ సిద్దార్థ్‌ కౌల్‌ వేసిన రెండో ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లతో ఇషాన్‌ కదం తొక్కాడు. అదే జోరులో నబీ బౌలింగ్‌లో 4,4, హోల్డర్‌ బౌలింగ్‌లో 6,4,4తో కిషన్‌ ఈ ఐపీఎల్‌లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ (16 బంతుల్లో) నమోదు చేశాడు. అంతేకాదు..ఈసారి టోర్నీలో పొలార్డ్‌ వేగవంతమైన అర్ధశతక (17 బంతులు) రికార్డును ఇషాన్‌ బద్దలుగొట్టాడు.


మరోవైపు  రోహిత్‌ (18)..ఓ భారీ షాట్‌ సంధించే క్రమంలో ఆరో ఓవర్లో రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మొత్తంగా కిషన్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో పవర్‌ ప్లే ముగిసే సరికి ముంబై 83/1తో నిలిచింది. యువ పేసర్‌ మాలిక్‌కు 4,6తో స్వాగతం పలికిన ఇషాన్‌..రషీద్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో దుమ్ము రేపాడు. హార్దిక్‌ కూడా బ్యాట్‌కు పనిచెబుతూ సిక్సర్‌ కొట్టడంతో 8వ ఓవర్లోనే ముంబై స్కోరు సెంచరీ దాటింది. తదుపరి ఓవర్లో హార్దిక్‌ (10)ను హోల్డర్‌ పెవిలియన్‌కు చేర్చినా..రైజర్స్‌కు భారీ ఊరటను ఉమ్రాన్‌ మాలిక్‌ ఇచ్చాడు. మాలిక్‌ ఆఫ్‌స్టంప్‌ ఆవలిగా వేసిన బంతి..కిషన్‌ బ్యాట్‌ను తాకుతూ కీపర్‌ సాహా చేతిలోకి వెళ్లడంతో అతడి సుడిగాలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. తెలివైన కెప్టెన్సీతో మనీశ్‌ పాండే 13వ ఓవర్లో స్పిన్నర్‌ అభిషేక్‌ను బౌలింగ్‌కు దించాడు. వరుస బంతుల్లో పొలార్డ్‌, నీషమ్‌ను అవుట్‌ చేసిన అభిషేక్‌ ముంబైకి డబుల్‌ ఝలక్‌ ఇచ్చాడు. 


రెచ్చిపోయిన సూర్య:

కిషన్‌ నిష్క్రమణ తర్వాత పొలార్డ్‌ సహజశైలిలో ఆడకపోవడంతో ముంబై స్కోరుబోర్డులో వేగం తగ్గిన సమయాన.. సూర్యకుమార్‌ విజృంభించాడు. 14వ ఓవర్లో యాదవ్‌ 4,6, క్రునాల్‌ 4తో మొత్తం 16 రన్స్‌ ముంబై రాబట్టింది. క్రునాల్‌ను రషీద్‌ అవుట్‌ చేయగా..సూర్యకుమార్‌ ధాటి బ్యాటింగ్‌ కొనసాగిస్తూ ఓ క్లాస్‌ ఫోర్‌తో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆపై మరింత రెచ్చిపోయిన సూర్య 6,4తో టీ20ల్లో 4000 పరుగులు పూర్తి చేశాడు. మాలిక్‌ వేసిన 19వ ఓవర్లో మూడుబౌండ్రీలు బాదిన సూర్య..చివరి ఓవర్లో మరో భారీ షాట్‌ కొట్టబోయి క్యాచ్‌ అవుటయ్యాడు. 


స్కోరుబోర్డు

ముంబై: రోహిత్‌ (సి) నబీ (బి) రషీద్‌ 18, కిషన్‌ (సి) సాహా (బి) మాలిక్‌ 84, హార్దిక్‌ (సి) రాయ్‌ (బి) హోల్డర్‌ 10, పొలార్డ్‌ (సి) రాయ్‌ (బి) అభిషేక్‌ 13, సూర్యకుమార్‌ (సి) నబీ (బి) హోల్డర్‌ 82, నీషమ్‌ (సి) నబీ (బి) అభిషేక్‌ 0, క్రునాల్‌ (సి) నబీ (బి) రషీద్‌ 9, కల్టర్‌ నైల్‌ (సి) నబీ (బి) హోల్డర్‌ 3, చావ్లా (సి) సమద్‌ (బి) హోల్డర్‌ 0, బుమ్రా (నాటౌట్‌) 5, బౌల్ట్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 235/9; వికెట్ల పతనం: 1-80, 2-113, 3-124, 4-151, 5-151, 6-184, 7-206, 8-230, 9-230; బౌలింగ్‌: నబీ 3-0-33-0, కౌల్‌ 4-0-56-0, హోల్డర్‌ 4-0-52-4, ఉమ్రాన్‌ మాలిక్‌ 4-0-48-1, రషీద్‌ 4-0-40-2, అభిషేక్‌ 1-0-4-2.


సన్‌రైజర్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) క్రునాల్‌ (బి) బౌల్ట్‌ 34; అభిషేక్‌ (సి) కల్టర్‌ నైల్‌ (బి) నీషమ్‌ 33, మనీష్‌ పాండే (నాటౌట్‌) 69; నబీ (సి) పొలార్డ్‌ (బి) చావ్లా 3; సమద్‌ (సి) పొలార్డ్‌ (బి) నీషమ్‌ 2; ప్రియమ్‌ గార్గ్‌ (సి) హార్దిక్‌ (బి) బుమ్రా 29; హోల్డర్‌ (సి) బౌల్ట్‌ (బి) కల్టర్‌ నైల్‌ 1; రషీద్‌ (సి అండ్‌ బి) బుమ్రా 9; సాహా (సి అండ్‌ బి) కల్టర్‌ నైల్‌ 2; సిద్దార్థ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 193/8; వికెట్ల పతనం: 1-64, 2-79, 3-97, 4-100, 5-156, 6-166, 7-177, 8-182; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-30-1; బుమ్రా 4-0-39-2; చావ్లా 4-0-38-1; కల్టర్‌ నైల్‌ 4-0-40-2; నీషమ్‌ 3-0-28-2; క్రునాల్‌ 1-0-16-0. 

Updated Date - 2021-10-09T06:41:59+05:30 IST