ముంబై అదరహో

ABN , First Publish Date - 2020-10-07T09:20:12+05:30 IST

డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది.

ముంబై అదరహో

రాజస్థాన్‌పై ఘన విజయం

 సూర్యకుమార్‌ అర్ధసెంచరీ

 బుమ్రాకు నాలుగు వికెట్లు


ఐపీఎల్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేసిన బుమ్రా (4/20). అలాగే ఈ సీజన్‌లో డెత్‌ ఓవర్లలో ఎక్కువ వికెట్లు (9) తీసి రబాడ సరసన నిలిచాడు.


ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌ (194)లు ఆడిన రెండో ఆటగాడిగా రోహిత్‌. రైనా (193)ను అధిగమించాడు.


నాలుగుసార్లు విజేతగా నిలిచినప్పటికీ ముంబై ఇండియన్స్‌ జట్టు 2015 నుంచి ఇప్పటి వరకు రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించలేకపోయింది. దీనికి సమాధానంగా అన్నట్టు ఈసారి ఎడారి దేశంలో ఉతికి ఆరేసింది. ముందుగా సూర్యకుమార్‌ యాదవ్‌ నిలకడైన ఆటతీరుతో భారీ స్కోరు సాధించిన ముంబై.. ఆ తర్వాత తమ బౌలింగ్‌ పదునేంటో ప్రత్యర్థికి చూపించింది. బుమ్రా పదునైన యార్కర్లకు ఆర్‌ఆర్‌ నుంచి సమాధానం లేకుండా పోయింది. బట్లర్‌ ఒంటరి పోరాటం మినహా చెప్పుకోవడానికి ఏమీ లేదు. స్మిత్‌, శాంసన్‌ కేవలం షార్జాలోనే రాణిస్తుండడం జట్టును దెబ్బతీస్తోంది.


అబుదాబి: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అద్భుత విన్యాసాలు చేసిన రోహిత్‌ సేన 57 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. బుమ్రా (4/20) పదునైన బంతులతో దెబ్బతీశాడు. ఢిల్లీతో కలిపి 8 పాయింట్లున్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో ముంబై అగ్రస్థానానికి చేరింది.


మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 79 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా హార్దిక్‌ పాండ్యా (19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 30 నాటౌట్‌) రాణించాడు. శ్రేయా్‌సకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 18.1 ఓవర్లలో 136 పరుగులకు కుప్పకూలింది. బట్లర్‌ (44 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 70) పోరాటం వృథా అయ్యింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ నిలిచాడు.


ఆరంభం నుంచే పతనం:

లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ తొలి మూడు ఓవర్లలోనే యశస్వి జైస్వాల్‌ (0), స్మిత్‌ (6), శాంసన్‌ (0) వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అప్పటికి స్కోరు 12 పరుగులే. గత మ్యాచ్‌లో విశేషంగా రాణించిన లోమ్రోర్‌ (11) క్యాచ్‌ను సబ్‌స్టిట్యూట్‌ అనుకుల్‌ రాయ్‌ తన ఎడమవైపు సమాంతరంగా డైవ్‌ చేస్తూ అద్భుతంగా పట్టేశాడు. ఇలాంటి పరిస్థితిలో జోస్‌ బట్లర్‌ ఒక్కడే ఒంటరి పోరాటం సాగిస్తూ ముంబై బౌలర్లను ఎదుర్కొన్నాడు. కానీ అతడికి సరైన భాగస్వామ్యం లభించలేదు. తొమ్మిదో ఓవర్‌ నుంచి తాను అవుటైన 14వ ఓవర్‌ వరకు ఒక్కో సిక్సర్‌ చొప్పున బాదుతూ పరుగులను పెంచే ప్రయత్నం చేశాడు. ప్యాటిన్సన్‌ బౌలింగ్‌లో బట్లర్‌ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌ దగ్గర పొలార్డ్‌ పైకి ఎగిరి మరీ అందుకోవడంతో ఆశలు వదులుకుంది. ఇక టామ్‌ కర్రాన్‌ (15), రాహుల్‌ తెవాటియా (5)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చడంతో ఆర్‌ఆర్‌ ఇన్నింగ్స్‌లో అద్భుతాలేమీ జరగలేదు. బుమ్రా సహా ఇతర బౌలర్ల విజృంభణకు ఏడు ఓవర్లలోనే చివరి ఆరు వికెట్లు నేలకూలాయి.


సూర్యకుమార్‌ దూకుడు:

టాస్‌ గెలవగానే బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై ఆరంభం నుంచే ధాటిగా ఆడుతూ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలనుకుంది. దీనికి తగ్గట్టుగానే ఓపెనర్లు డికాక్‌ (23), రోహిత్‌ (35) ఆటతీరు సాగింది. కానీ వీరిని మధ్య ఓవర్లలో లెగ్‌ స్పిన్నర్‌ శ్రేయాస్‌ గోపాల్‌ కట్టడి చేయగలిగాడు. అయితే సూర్యకుమార్‌ తుది కంటా క్రీజులో నిలిచి ఆదుకున్నాడు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్లు చెరో ఫోర్‌ సాధించారు. ఆ తర్వాత మూడో ఓవర్‌లో రోహిత్‌ 6,4.. డికాక్‌ ఫోర్‌తో 15 పరుగులు వచ్చాయి. జోఫ్రా వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో డికాక్‌ వరుసగా 6,4తో జోరు పెంచాడు. కానీ తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన 19 ఏళ్ల పేసర్‌ కార్తీక్‌ త్యాగి అతడిని షార్ట్‌ బాల్‌తో బోల్తా కొట్టించాడు. దీంతో తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ సీజన్‌లో వీరికి ఇదే అత్యధికం. అలాగే పదో ఓవర్‌లో రోహిత్‌, ఇషాన్‌ (0)లను గోపాల్‌ వరుస బంతుల్లో అవుట్‌ చేసి ఝలక్‌ ఇచ్చాడు. ఈ దశలో త్యాగి ఓవర్‌లో మూడు ఫోర్లు సాధించిన సూర్యకుమార్‌.. గోపాల్‌ ఓవర్‌లోనూ రెండు ఫోర్లతో ఆధిక్యం చూపాడు. మరోవైపు హార్దిక్‌, పొలార్డ్‌కన్నా ముందే వచ్చిన క్రునాల్‌ (12) ఆకట్టుకోలేకపోయాడు.


చివర్లో భాగస్వామ్యం:

117/4 స్కోరుతో ఉన్న దశలో హార్దిక్‌ పాండ్యాతో కలిసి సూర్యకుమార్‌ ఐదో వికెట్‌కు అజేయంగా 38 బంతుల్లో 76 పరుగులు సమకూర్చాడు. 33 బంతుల్లో సూర్యకుమార్‌ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే డెత్‌ ఓవర్లలో రాజస్థాన్‌ బౌలర్లు కాస్త ప్రభావం చూపగలిగారు. 17వ ఓవర్‌ వరకు ముంబైని భారీషాట్లు ఆడనీయకుండా చూశారు. దీంతో చివరి మూడు ఓవర్లలో 51 పరుగులు సాధించినప్పటికీ జట్టు స్కోరు 200లోపే ముగిసింది. పొలార్డ్‌కు బ్యాటింగ్‌ అవకాశం రాకపోవడంతో ముంబై మరో 15-20 పరుగులు కోల్పోయినట్టయింది.


స్కోరుబోర్డు

ముంబై ఇండియన్స్‌: డికాక్‌ (సి) బట్లర్‌ (బి) త్యాగి 23; రోహిత్‌ (సి) తెవాటియా (బి) గోపాల్‌ 35; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 79; ఇషాన్‌ (సి) శాంసన్‌ (బి) గోపాల్‌ 0; క్రునాల్‌ (సి) గోపాల్‌ (బి) ఆర్చర్‌ 12; హార్దిక్‌ (నాటౌట్‌) 30; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 193/4. వికెట్ల పతనం: 1-49, 2-88, 3-88, 4-117; బౌలింగ్‌: రాజ్‌పుత్‌ 3-0-42-0; శ్రేయాస్‌ గోపాల్‌ 4-0-28-2; ఆర్చర్‌ 4-0-34-1; కార్తీక్‌ త్యాగి 4-0-36-1; టామ్‌ కర్రాన్‌ 3-0-33-0; తెవాటియా 2-0-13-0.


రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైశ్వాల్‌ (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 0; బట్లర్‌ (సి) పొలార్డ్‌ (బి) ప్యాటిన్సన్‌ 70; స్మిత్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 6; శాంసన్‌ (సి) రోహిత్‌ (బి) బౌల్ట్‌ 0; మహిపాల్‌ (సి) అనుకుల్‌ రాయ్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 11; టామ్‌ కర్రాన్‌ (సి) హార్దిక్‌ (బి) పొలార్డ్‌ 15; తెవాటియా (బి) బుమ్రా 5; ఆర్చర్‌ (సి) పొలార్డ్‌ (బి) బుమ్రా 24; శ్రేయాస్‌ గోపాల్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 1; అంకిత్‌ (సి) రోహిత్‌ (బి) ప్యాటినన్‌ 2; కార్తీక్‌ త్యాగి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 18.1 ఓవర్లలో 136 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-0, 2-7, 3-12, 4-42, 5-98, 6-108, 7-113, 8-115, 9-136; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-26-2; బుమ్రా 4-0-20-4; ప్యాటిన్సన్‌ 3.1-0-19-2; రాహుల్‌ చాహర్‌ 3-0-24-1; క్రునాల్‌ 2-0-22-0; పొలార్డ్‌ 2-0-24-1. 

Updated Date - 2020-10-07T09:20:12+05:30 IST