Abn logo
Apr 1 2021 @ 01:21AM

హార్డ్‌ హిట్టర్లు.. ‘డెత్‌’ బౌలర్లు

  • ఈసారీ ఫేవరెట్‌గా ముంబై
  • ఐపీఎల్‌ 8 రోజుల్లో

ఐపీఎల్‌లో అత్యంత అభిమానగణం ఉన్న జట్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ ముందువరుసలో ఉంటాయి. ధోనీ స్టార్‌ డమ్‌తో సీఎ్‌సకే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా,  ఐదుసార్లు చాంపియన్‌గా నిలవడం ద్వారా ముంబై ఇండియన్స్‌ మెగా టోర్నీలో తనదైన ముద్ర వేసింది..ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల హార్డ్‌ హిట్టింగ్‌ బ్యాట్స్‌మెన్‌, డెత్‌ ఓవర్లలో ప్రత్యర్థికి చుక్కలు చూపే పేస్‌ బౌలింగ్‌.. వెరసి ఐపీఎల్‌లో ముంబై తిరుగులేని జట్టుగా పేరు తెచ్చుకుంది..
గత రెండేళ్లుగా టైటిల్‌ ఒడిసి పట్టిన ముంబై ఇండియన్స్‌ హ్యాట్రిక్‌ ట్రోఫీయే లక్ష్యంగా 14వ సీజన్‌ ఐపీఎల్‌ బరికి కాలుదువ్వుతోంది. అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించే యాజమాన్యం, పటిష్టమైన కోచింగ్‌ బృందం, బలీయమైన ఆటగాళ్ల సమాహారం ముంబై ఇండియన్స్‌ సొంతం. మొదటి ఓవర్‌నుంచే భారీ షాట్లతో విరుచుకుపడగల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సౌతాఫ్రికా చిచ్చరపిడుగు డికాక్‌తో టోర్నీలో మరే జట్టుకూలేని ఓపెనింగ్‌ జోడీ ముంబైదనడం అతిశయోక్తి కాదు. వీరికితోడు దూకుడుగా ఆడే ఆసీస్‌ ఆటగాడు క్రిస్‌ లిన్‌ రూపంలో మరో ప్రారంభ బ్యాట్స్‌మన్‌ ముంబైకి అందుబాటులో ఉన్నాడు. ఇక భయమెరుగని బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ ముంబై టాపార్డర్‌ను మరింత బలోపేతం చేస్తున్నారు. హార్దిక్‌, క్రునాల్‌, వెస్టిండీస్‌ వీరుడు పొలార్డ్‌తో ముంబై మిడిలార్డర్‌ ప్రత్యర్థులకు గుబులు పుట్టిస్తుంది. డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌ బుమ్రాతో పేస్‌ బౌలింగ్‌ దుర్భేద్యంగా ఉంది. డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌కు మరింత పదును తెచ్చేందుకు కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి కొనుగోలు చేసింది. 

నిరుటి ఐపీఎల్‌లో మధ్య ఓవర్లలో బౌల్ట్‌ క్రమం తప్పకుండా వికెట్లు తీసి భళా అనిపించాడు. ఆసీస్‌ బౌలర్‌ కల్టర్‌ నైల్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ పేస్‌ బౌలింగ్‌ దళం ప్రత్యర్థికి దడ పుట్టించడం ఖాయం. కాకపోతే ముంబై స్పిన్‌ విభాగమే బలహీనంగా ఉంది. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ క్రునాల్‌ పాండ్యా పర్లేదనిపిస్తుండగా లెగ్‌స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ ఇంకా నేర్చుకొనే దశలోనే ఉన్నాడు. ఈ విభాగాన్ని మెరుగు పర్చుకొనేందుకు సీనియర్‌ లెగ్గీ పీయూష్‌ చావ్లాను ముంబై కొనుగోలు చేసింది. మొత్తంగా ముంబై ఇండియన్స్‌ బలంగా కనిపిస్తున్నా సీనియర్ల స్థానాలు భర్తీ చేయగల రిజర్వ్‌ బెంచ్‌ లేకపోవడం ఆ జట్టు లోటుగా చెప్పాలి. ఇంగ్లండ్‌తో వైట్‌ బాల్‌ సిరీ్‌సలో ‘ముంబై’ క్రికెటర్లు సూపర్‌గా ఆడారు. దాంతో ఈసారీ ఐపీఎల్‌లో ఆ జట్టును ఫేవరెట్‌గా అంచనా వేస్తున్నారు.జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), డికాక్‌, సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, లిన్‌, అన్‌మోల్‌ప్రీత్‌, సౌరవ్‌ తివారీ, ఆదిత్య తారె, పొలార్డ్‌, హార్దిక్‌, క్రునాల్‌, అనుకూల్‌ రాయ్‌, బుమ్రా, బౌల్ట్‌, రాహుల్‌ చాహర్‌, జయంత్‌ యాదవ్‌, ధవల్‌ కులకర్ణి, మోహిసిన్‌, మిల్నే, కల్టర్‌ నైల్‌, పీయూష్‌ చావ్లా, జేమ్స్‌ నీషమ్‌, యుధ్‌వీర్‌, మార్కో జాన్సన్‌, అర్జున్‌ టెండూల్కర్‌.


Advertisement
Advertisement
Advertisement