లాక్‌డౌన్ వేళ ముంబై యువతికి అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన పోలీసులు!

ABN , First Publish Date - 2021-04-24T00:20:19+05:30 IST

దేశంలో కరోనా వైరస్ మరోమారు చెలరేగిపోతోంది. వేలాదిమందికి సంక్రమిస్తూ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతి

లాక్‌డౌన్ వేళ ముంబై యువతికి అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన పోలీసులు!

ముంబై: దేశంలో కరోనా వైరస్ మరోమారు చెలరేగిపోతోంది. వేలాదిమందికి సంక్రమిస్తూ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతి రోజూ వందలాదిమందిని బలితీసుకుంటోంది. మహారాష్ట్రలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వైరస్‌కు కళ్లెం వేసేందుకు లాక్‌డౌన్ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ యువతి తన బర్త్‌డేనాడు స్నేహితులతో చేసిన వాట్సాప్ చాటింగ్‌‌ను చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. కరోనా వేళ ఎంత బాధ్యతగా వ్యవహరించిందో అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. అక్కడితో ఆగక బర్త్ డే నాడు ఇంట్లోనే ఉన్న ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘రెస్పాన్సిబుల్ సిటిజెన్’ అని రాసి ఉన్న చాక్లెట్ కేకును నేరుగా ఆమె ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి బర్త్‌డే విషెస్ చెప్పారు. 


ఆశ్చర్యం నుంచి తేరుకున్న ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సంతోషంగా పుట్టిన రోజు జరుపుకుంది. ఏప్రిల్ 22న సమతా పాటిల్ అనే యువతి బర్త్‌డే. విషయం తెలిసిన స్నేహితులు పార్టీ ఇవ్వాలంటూ పదేపదే అడుగుతున్నారు. దీనికి నిరాకరించిన ఆమె బయట పరిస్థితులు బాగాలేవని, లాక్‌డౌన్ కావడంతో ఇంట్లోనే ఉండాలని సూచించింది. ‘బీ సేఫ్’ అంటూ వారి క్షేమాన్ని ఆకాంక్షించింది. ఆ తర్వాత ఆ వాట్సాప్ చాటింగ్‌ను స్క్రీన్‌షాట్ తీసి ముంబై పోలీసులకు షేర్ చేసింది. అది చూసిన పోలీసులు ఆమెను బాధ్యతాయుతమైన పౌరురాలిగా పేర్కొంటూ ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ వేళ బాధ్యతగా వ్యవహరించిన మీకు స్థానిక పోలీసులు వచ్చి ప్రశంసిస్తారని పేర్కొన్నారు. 


అనుకున్నట్టే ఆ తర్వాత కాసేపటికే వచ్చిన పోలీసులు ఆమె చేతిలో ఓ చాక్లెట్ కేక్ పెట్టి ఆశ్చర్యపరిచారు. దానిపై ‘రెస్పాన్సిబుల్ సిటిజెన్’ అని రాసి ఉంది. దీంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. బాధ్యతాయుతంగా వ్యవహరించినందుకు తమవైపు నుంచి చిన్న గిఫ్ట్ అని, మీరు ఈ రోజు సేఫ్‌గా జరుపుకునే బర్త్ డే.. నగరాన్ని రేపు ‘హ్యాపీ’ మారుస్తుందంటూ ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. మరోమారు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. స్పందనగా సమత థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడీ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2021-04-24T00:20:19+05:30 IST