Abn logo
Sep 19 2020 @ 03:34AM

ధోనీపైనే కళ్లన్నీ..

Kaakateeya

నేడు తొలిపోరులో ముంబై వర్సెస్ చెన్నై 

రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో..


అబుదాబి: దేశంలో క్రికెట్‌ హంగామా సృష్టించేందుకు చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే), ముంబై ఇండియన్స్‌ జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య శనివారం అబుదాబిలో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్‌ మొదలవనుంది. 2008లో సీజన్‌ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా అత్యంత విజయవంతమైన జట్లుగా చెన్నై, ముంబై పేరు తెచ్చుకున్నాయి. ధోనీ సారథ్యం లోని సీఎ్‌సకే ఖాతాలో మూడు టైటిళ్లున్నాయి. అలాగే ఆడిన పది సీజన్లలో 8సార్లు ఫైనల్‌ చేరిందంటే సీఎస్‌కే నిలకడ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈసారి ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడడం, రైనా.. హర్భజన్‌ దూరం కావడం వారిని ఆందోళన పరుస్తోంది. ఈ పరిస్థితులను మహీ ఎలా అధిగమిస్తాడన్నది ఆసక్తికరమే. ఇక నాలుగు టైటిళ్లతో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్‌ ఉరకలెత్తే ఉత్సాహంతో ఉంది. రోహిత్‌ శర్మ నేతృత్వం.. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అందుబాటులో ఉండడం వారికి కలిసి రానుంది.


అనుభవమే అండగా చెన్నై..

సీఎ్‌సకేకు అన్నీ తానై నడిపించే ఎంఎస్‌ ధోనీ ఎప్పటిలాగే కొండంత బలం కానున్నాడు. ఈసారి ఎలాంటి ఒత్తిడీ లేకపోవడంతో అతడి బ్యాట్‌ మరింత గర్జించే అవకాశం ఉంది. అంతేకాదు ఈ జట్టులో దేశీ, విదేశీ ఆటగాళ్లు కూడా అపార అనుభవజ్ఞులు. వాట్సన్‌, డుప్లెసి, రాయుడు, మురళీ విజయ్‌, కేదార్‌ జాదవ్‌, జడేజా, బ్రావోలతో బ్యాటింగ్‌ పటిష్టంగా కనిపిస్తోంది.  చెన్నై ముఖ్యంగా స్పిన్‌ బౌలింగ్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది. తాహిర్‌, పీయూష్‌ చావ్లా, జడేజా, కరణ్‌ శర్మ రూపంలో వారికి చక్కటి వనరులున్నాయి. భజ్జీ గైర్హాజరీతో తమిళనాడు స్పిన్నర్‌ సాయికిశోర్‌ను పవర్‌ప్లేలో ఉపయోగించే చాన్సుంది. పేస్‌లో చాహర్‌, ఎన్‌గిడి, బ్రావో, సామ్‌ కర్రాన్‌ సిద్ధంగా ఉన్నారు. 

రైనా లేకపోవడం..

‘మిస్టర్‌ ఐపీఎల్‌’ రైనా గైర్హాజరీతో ఈసారి టాపార్డర్‌లో నాణ్యమైన లెఫ్ట్‌ హ్యాండర్‌ లేకపోవడంతో లెగ్‌ స్పిన్‌ను ఎదుర్కోవడం చెన్నైకి సవాల్‌ కానుంది. రైనా స్థానంలో వన్‌డౌన్‌లో ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

సూపర్‌ ఫామ్‌లో..

గతేడాది రోహిత్‌ బ్యాటింగ్‌ పరంగా ఆకట్టుకోకపోయినా అద్భుత నాయకత్వంతో ముంబై జట్టును నడిపించాడు. ఈసారి అతను బ్యాట్‌ను కూడా ఝుళిపిస్తే ప్రత్యర్థి బెంబేలెత్తాల్సిందే. హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌ లిన్‌ జట్టులో చేరడం అదనపు బలం. రోహిత్‌కు జతగా డికాక్‌, లిన్‌లలో ఒకరు ఓపెనింగ్‌లో రానున్నారు. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, క్రునాల్‌ పాండ్యా, పొలార్డ్‌ల మెరుపు ఇన్నింగ్స్‌తో భారీస్కోర్లు నమోదయ్యే చాన్సుంది. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ గతేడాది ఫామ్‌ చాటుకున్నాడు. బౌలింగ్‌లో బుమ్రా, ధవల్‌ కులకర్ణి, బౌల్ట్‌, కల్టర్‌నైల్‌ ఉన్నారు.

స్పిన్‌లో వెనుకబాటు..

ముంబై బ్యాటింగ్‌ ఆర్డర్‌ బాగానే ఉన్నా స్పిన్‌ విభాగం మాత్రం అనుభవలేమితో ఉంది. క్రునాల్‌ బౌలింగ్‌లో వైవిధ్యం కరువైంది. 20 ఏళ్ల రాహుల్‌ చాహర్‌కు అంతగా అనుభవం లేదు. అండర్‌-19 ప్లేయర్‌ అనుకుల్‌ రాయ్‌ ఉన్నా అతడిని ఉపయోగించుకునే సాహసం చేస్తుందా అనేది చూడాలి. అత్యంత అనుభవం కలిగిన పేసర్‌ మలింగ దూరమవడం ముంబై జట్టుకు అన్నింటికన్నా పెద్ద షాక్‌.


తుది జట్లు (అంచనా)

ముంబై: రోహిత్‌ (కెప్టెన్‌), డికాక్‌/లిన్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, పొలార్డ్‌, హార్దిక్‌, క్రునాల్‌, ధవల్‌ కులకర్ణి, రాహుల్‌ చాహర్‌, బౌల్ట్‌, బుమ్రా.

చెన్నై: వాట్సన్‌, విజయ్‌, రాయుడు, డుప్లెసి, ధోనీ, జాదవ్‌, జడేజా, బ్రావో, శార్దూల్‌, దీపక్‌ చాహర్‌, తాహిర్‌.


పిచ్‌ 

ఆరేళ్ల క్రితం ఈ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌లో సగటు స్కోరు 147. పిచ్‌ స్పిన్నర్లకు సహకరించవచ్చు. టాస్‌ గెలిచిన జట్టు చేజింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది. 

Advertisement
Advertisement
Advertisement