పొలార్డ్‌ బాదుడు

ABN , First Publish Date - 2021-05-02T09:46:55+05:30 IST

కీరన్‌ పొలార్డ్‌ ఊచకోత ముందు 219 పరుగుల లక్ష్యం కూడా చిన్నబోయింది. రెండు పవర్‌ఫుల్‌ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ ఉర్రూతలూగిస్తూ చివరకు ఆఖరి బంతికి ముగిసింది. పదో ఓవర్‌లో బరిలోకి వచ్చిన పొలార్డ్‌ 8 సిక్సర్లతో వీర బాదుడు బాది ముంబైకి చిరస్మరణీయ విజయాన్నందించాడు.

పొలార్డ్‌ బాదుడు

34 బంతుల్లో 87 నాటౌట్‌

ఆఖరి బంతికి చెన్నైపై గెలిచిన ముంబై 


ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు చేసిన తొలి ఆటగాడు పొలార్డ్‌ (17 బంతుల్లో). పృథ్వీ షా (18 బంతుల్లో), రాయుడు (20 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


విజయవంతమైన ఛేదనలో చివరి పది ఓవర్లలో ఎక్కువ రన్స్‌ (138) చేసిన జట్టుగా ముంబై


ఐపీఎల్‌లో ఇది రెండో అత్యధిక ఛేదన (219/6). రాజస్థాన్‌ (226/6)ది తొలిస్థానం


కీరన్‌ పొలార్డ్‌ ఊచకోత ముందు 219 పరుగుల లక్ష్యం కూడా చిన్నబోయింది. రెండు పవర్‌ఫుల్‌ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ ఉర్రూతలూగిస్తూ చివరకు ఆఖరి బంతికి ముగిసింది. పదో ఓవర్‌లో బరిలోకి వచ్చిన పొలార్డ్‌ 8 సిక్సర్లతో వీర బాదుడు బాది ముంబైకి చిరస్మరణీయ విజయాన్నందించాడు. అంతకుముందు రాయుడు, మొయిన్‌ అలీ, డుప్లెసి తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెన్నై భారీ స్కోరు సాధించినా సీఎస్‌కేకు నిరాశ తప్పలేదు.


న్యూఢిల్లీ: తాజా సీజన్‌లో అదిరిపోయే మ్యాచ్‌. పొలార్డ్‌ (34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 నాటౌట్‌) ఒంటి చేత్తో ముంబై ఇండియన్స్‌కు అద్భుత విజయాన్నందించాడు. అతడి ఆటతీరుతో 219 పరుగుల ఛేదనలో ముంబై ఆఖరి బంతికి 4వికెట్ల తేడాతో గెలిచింది.


శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగుల భారీస్కోరు సాధించింది. అంబటి రాయుడు (27 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 నాటౌట్‌), మొయిన్‌ అలీ (36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 58), డుప్లెసి (28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) మెరుపు అర్ధసెంచరీలు సాధించారు. పొలార్డ్‌కు 2వికెట్లు దక్కాయి. ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి గెలిచింది. సామ్‌ కర్రాన్‌కు 3 వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పొలార్డ్‌ నిలిచాడు.


ఆకాశమే హద్దుగా..: భారీ ఛేదనను ముంబై ధాటిగానే ఆరంభించింది. తొలి వికెట్‌కు మెరుపు వేగంతో డికాక్‌ (38), రోహిత్‌ (35) కలిసి 71 పరుగులు అందించారు. అయితే స్వల్ప వ్యవధిలోనే ఈ ఇద్దరితోపాటు సూర్యకుమార్‌ (3) వెనుదిరి గారు. క్రునాల్‌ (32) ఉన్న కాసేపు వేగంగా ఆడాడు. కానీ పొలార్డ్‌ భీకరంగా ఆడాడు. 13వ ఓవర్‌లో 3, 14వ ఓవర్‌లో 2 సిక్సర్లు బాదిన పొలార్డ్‌.. 15వ ఓవర్‌లో 6,4,4,4తో 17 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. మరోవైపు అతడిచ్చిన క్యాచ్‌లను జడేజా, డుప్లెసి వదిలేయడం చెన్నై కొంప ముంచింది. ఇక 12 బంతుల్లో 31 పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్‌లో హార్దిక్‌ (16) రెండు సిక్సర్లు బాదినా అతడితోపాటు నీషమ్‌ (0) వికెట్‌ను సామ్‌ తీశాడు. అయితే ఆరు బంతుల్లో 16 రన్స్‌ కోసం పొలార్డ్‌ రెండు ఫోర్లు, సిక్సర్‌ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.


బాదుడే బాదుడు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై తొలి ఓవర్‌ నాలుగో బంతికే రుతురాజ్‌ గైక్వాడ్‌ (4) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ముంబై బౌలర్లకు మొయిన్‌ అలీ, డుప్లెసీ జోడీ చుక్కలు చూపించింది. వీరిధాటికి 10.4 ఓవర్లలోనే స్కోరు 112/1కి చేరింది. రెండో వికెట్‌కు 108 రన్స్‌ భాగస్వామ్యం అందించారు. మూడో ఓవర్‌లో అలీ 6,4.. ఐదో ఓవర్‌లో మరో సిక్సర్‌తో పవర్‌ప్లేలో 49 పరుగులు సాధించింది. ఆ తర్వాత పదో ఓవర్‌లో అలీ సిక్సర్‌తో పాటు 2 ఫోర్లు బాదడంతో స్కోరు 95/1కి చేరింది. ఇక బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో డుప్లెసి  వరుసగా 6,6,4తో బాదగా ఐదో బంతికి కీలక అలీ వికెట్‌ను కోల్పోయింది. మరుసటి ఓవర్‌ లోనే పొలార్డ్‌ వరుసగా డుప్లెసి, రైనా (2) వికెట్లతో చెన్నైకి ఝలక్‌ ఇచ్చాడు.  


చివర్లో రాయుడి మోత: డెత్‌ ఓవర్లలో అంబటి రాయుడు ఆకాశమే హద్దుగా చెలరే గాడు. బంతి ఎలాంటిదైనా స్టాండ్స్‌లోకి పంపాడు. 16వ ఓవర్‌లో అతడి రెండు సిక్సర్లతో జట్టు 17 రన్స్‌ సాధించింది. ఇక 17వ ఓవర్‌లో మరింత విజృంభిస్తూ 4,6,4 బాదగా 21 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్‌లో మరో 6,4,6తో 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇక ఈ ఓవర్‌లోనూ 20 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్‌లోనూ 6,4తో చెన్నై ఇన్నింగ్స్‌ను ముగించాడు.  రాయుడు జోరుతో చివరి ఐదు ఓవర్లలోనే చెన్నై 82 పరుగులు సాధించింది. 



స్కోరుబోర్డు

చెన్నై: రుతురాజ్‌ (సి) హార్దిక్‌ (బి) బౌల్ట్‌ 4; డుప్లెసి (సి) బుమ్రా (బి) పొలార్డ్‌ 50; మొయిన్‌ అలీ (సి) డికాక్‌ (బి) బుమ్రా 58; రైనా (సి) క్రునాల్‌ (బి) పొలార్డ్‌ 2; రాయుడు (నాటౌట్‌) 72; జడేజా (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 218/4. వికెట్ల పతనం: 1-4, 2-112, 3-116, 4-116. బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-42-1; ధావల్‌ కులకర్ణి 4-0-48-0; బుమ్రా 4-0-56-1; రాహుల్‌ చాహర్‌ 4-0-32-0; నీషమ్‌ 2-0-26--0; పొలార్డ్‌ 2-0-12-2.


ముంబై: డికాక్‌ (సి అండ్‌ బి) అలీ 38; రోహిత్‌ (సి) గైక్వాడ్‌ (బి) శార్దూల్‌ 35; సూర్యకుమార్‌ (సి) ధోనీ (బి) జడేజా 3; క్రునాల్‌ (ఎల్బీ) కర్రాన్‌ 32; పొలార్డ్‌ (నాటౌట్‌) 87; హార్దిక్‌ (సి) డుప్లెసి (బి) కర్రాన్‌ 16; నీషమ్‌ (సి) శార్దూల్‌ (బి) కర్రాన్‌ 0; ధావల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 219/6; వికెట్ల పతనం: 1-71, 2-77, 3-81, 4-170, 5-202, 6-203; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-37-0; కర్రాన్‌ 4-0-34-3; ఎన్‌గిడి 4-0-62-0; శార్దూల్‌ 4-0-56-1; జడేజా 3-0-29-1; అలీ 1-0-1-1. 

Updated Date - 2021-05-02T09:46:55+05:30 IST