పురపోరు.. ప్రచార జోరు

ABN , First Publish Date - 2021-03-05T06:52:22+05:30 IST

ఉమ్మడి ఏపీలో మున్సిపాల్టీలకు 2013లో ఎన్నికలు జరగ్గా, 90 శాతం స్థానాల్లో టీడీపీ విజయబావుటా ఎగురవేసింది. మళ్లీ ఇప్పుడు పుర పోరు జరుగుతుండడంతో కంచుకోటను కాపాడుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అటు 2013లో టీడీపీ సాధించిన భారీ విజయం తరహాలో విజయఢంకా మోగించాలని అధికార వైసీపీ అడుగులు వేస్తోంది.

పురపోరు.. ప్రచార జోరు
సామర్లకోటలో వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ గురువారం ప్రచారం నిర్వహిస్తున్న మాజీ హోంమంత్రి చినరాజప్ప, ఇతర నాయకులు

  • రాజుకున్న మున్సిపల్‌ ఎన్నికల వేడి
  • పోలింగ్‌ దగ్గరపడడంతో ప్రచార బరిలోకి పార్టీలు
  • కేవలం సంక్షేమ పథకాలను నమ్ముకుని వైసీపీ ప్రచారం
  • విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతున్న ప్రతిపక్ష టీడీపీ
  • వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యమని ధ్వజం
  • ఆ పార్టీని గెలిపిస్తే పన్నుల భారం మోత ఖాయమంటూ ప్రచారం
  • పోటీచేసేది కొన్ని డివిజన్లైనా జనసేన,కమ్యూనిస్టు పార్టీలూ స్పీడు

పురపాలికల్లో ప్రచార పోరు మొదలైంది. ప్రధాన పార్టీలు వేటికవే ఓటర్లను ఆకట్టుకునేందుకు డివిజన్ల వారీగా వ్యూహప్రతివ్యూహాలతో బరిలోకి దిగాయి. మొన్నటివరకు అభ్యర్థిత్వాల ఉపసంహరణ ప్రక్రియ ఉండడంతో ఏకగ్రీవాల      ఎత్తుగడల్లో వైసీపీ, అభ్యర్థులను కాపాడుకునే పనిలో టీడీపీ నిమగ్నమయ్యాయి. దీంతో ఎక్కడా మున్సిపల్‌ ఎన్నికల సందడి కనిపించలేదు. బుధవారంతో ఆ తంతు ముగియడంతో పార్టీలు ప్రచారం వేడెక్కించాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల తరపున ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అభ్యర్థుల కోసం నేరుగా రంగంలోకి దిగడంతో పట్టణాల్లో గురువారం సందడి పెరిగింది. సంక్షేమ పథకాలను నమ్ముకుని వైసీపీ ఓటర్లను కలుస్తుండగా, ఆ పార్టీ పాలనలో అభివృద్ధి శూన్యమని, ఈసారి ఓటేస్తే పన్నులు మోతమెగించడం ఖాయమంటూ టీడీపీ ధ్వజమెత్తుతోంది. జనసేన, కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు అక్కడక్కడే ఉన్నా వీళ్లు కూడా స్పీడు పెంచారు.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి ఏపీలో మున్సిపాల్టీలకు 2013లో ఎన్నికలు జరగ్గా, 90 శాతం స్థానాల్లో టీడీపీ విజయబావుటా ఎగురవేసింది. మళ్లీ ఇప్పుడు పుర పోరు జరుగుతుండడంతో కంచుకోటను కాపాడుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అటు 2013లో టీడీపీ సాధించిన భారీ విజయం తరహాలో విజయఢంకా మోగించాలని అధికార వైసీపీ అడుగులు వేస్తోంది. దీంతో మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. అధికారం అండతో టీడీపీని దెబ్బకొట్టడానికి ఏకగ్రీవాల ఎత్తుగడను వైసీపీ అమలు చేసినా పెద్దగా సఫలం కాలేకపోయింది. దీంతో ప్రచారంలో పైచేయి సాధించి ఫలితాలు అనుకూలంగా మల్చుకోవాలని చూస్తోంది. దీంతో ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీల్లో ప్రచార వేగం పెంచింది. తుని మున్సిపాల్టీలో సగం వార్డులను ఏకగ్రీవం చేసుకోగా, ఎక్స్‌అఫీషియో ఓట్ల ద్వారా ఇక్కడ విజయం ఖాయం చేసుకున్నామన్న ధీమాలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. మిగిలిన 15 వార్డుల్లో గెలిచి క్లీన్‌స్వీప్‌ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి పావులు కదుపుతున్నారు. అటు టీడీపీ మిగిలిన 15 వార్డుల్లో సాధ్యమైనన్ని ఎక్కువ గెల్చుకుని వైసీపీకి షాక్‌ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. దీంతో ఈ వార్డుల్లో ఇరు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. రామచంద్రపురం మున్సిపాల్టీలో 28 వార్డులకు పది వార్డులు వైసీపీ పరం కావడంతో మిగిలిన వార్డులు చేజిక్కించుకోవడం కోసం వైసీపీ, వీటిలో నెగ్గి తడాఖా చూపించాలని టీడీపీ కదులుతోంది. అమలాపురంలో ఆరు వార్డులు తమ ఖాతాలో ఉండడంతో మిగిలిన వాటిలో పాగావేయాలని అధికార పార్టీ రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. నేరుగా మంత్రి విశ్వరూప్‌ రంగంలోకి దిగి అన్ని తానై నడిపిస్తున్నారు. టీడీపీ సైతం మిగిలిన వార్డుల్లో అత్యధిక శాతం దక్కించుకునేందుకు పోటాపోటీగా కాలు దువ్వుతోంది. ఇవి మినహా మిగిలిన మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో వైసీపీకి ఏకగ్రీవాలు ఒకటీ అరా తప్పించి లేవు. దీంతో దాదాపు అన్ని వార్డుల్లో వైసీపీకి ప్రత్యర్థి టీడీపీ రూపంలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు ధీటుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ప్రచారానికి నేరుగా బరిలోకి దిగడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

చేసిందేం లేదు...

అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరకుపైగా దాటినా మున్సిపాల్టీల్లో వైసీపీ చేసిన అభివృద్ధి ఎక్కడా లేదని, కనీసం చిన్న పనికూడా జరగలేదనే అంశాన్ని టీడీపీ ప్రచారాస్త్రంగా మల్చుకుంది. గత టీడీపీ ప్రభుత్వం, అప్పటి మున్సిపల్‌ కౌన్సిల్‌లో ఆమోదించిన పనులు కూడా నిలిపివేశారంటూ ధ్వజమెత్తుతోంది. దీంతో అనేక సమస్యలు వేధిస్తున్నా ఆ పార్టీ నేతలు చిన్న పనికూడా చేయించలేని స్థితిలో ఉన్నారని విరుచుకుపడుతోంది. పిఠాపురం, గొల్లప్రోలులో ఏలేరు ఆధునికీకరణ నిలిచిపోవడం వైసీపీకి మైనస్‌గా మారింది. టీడీపీ ఇక్కడ ఇదే అంశాన్ని ఎత్తిపొడుస్తోం ది. మండపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించకపోవడంతో ప్రభుత్వం ఏ పనీ చేయకుండా ప్రజలను ఇబ్బందిపెడుతోందంటూ పేరుకుపోయిన సమస్యలను టీడీపీ బలంగా ముందుకు తీసుకువెళ్తోంది. వీటన్నింటితోపాటు పథకాల్లో కోతలు, గెలిపిస్తే బాదడానికి సిద్ధంగా ఉన్న కొత్త పన్నులేంటనేది ఏకరువు పెడుతోంది. అదేసమయంలో ఆస్తిపన్ను, మంచినీటి పన్ను బకాయిల రద్దు, అన్నక్యాంటీన్లను తిరిగి తెరిపించడం వంటి మేనిఫెస్టో అంశాలను ప్రజల ముందుంచుతోంది. అటు వైసీపీ పరిస్థితి మరోలా ఉంది. చెప్పుకోవడానికి అభివృద్ధి పనులు లేకపోవడంతో తమ ప్రభుత్వం లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో ఏఏ పథకాలకు ఎంత జమచేస్తున్నదో వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. మళ్లీ గెలిపిస్తే పురపాలికలకు నిధులు రప్పించి అభివృద్ధి చేస్తామంటూ ఆశచూపుతున్నారు. తమ పార్టీని గెలిపిస్తే ప్రజా సమస్యలను కౌన్సిల్‌లో చర్చించి పరిష్కరిస్తామంటూ జనసేన, కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. 

Updated Date - 2021-03-05T06:52:22+05:30 IST