బలవంతపు ఏకగ్రీవాలకు ఎసరే

ABN , First Publish Date - 2021-02-17T05:55:37+05:30 IST

అంగబలంతో మాచర్ల మునిసిపాలిటీలోని అన్ని వార్డులను గత ఏడాది ఏకగ్రీవం చేసుకొన్న వైసీపీకి మింగుడుపడని ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ జారీ చేశారు.

బలవంతపు ఏకగ్రీవాలకు ఎసరే

మున్సిపాలిటీ ఎన్నికలపై ఎస్‌ఈసీ ఉత్తర్వు

భౌతికంగా అడ్డుకున్న వాటిపై ఫిర్యాదుల స్వీకరణ 

ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం

మాచర్లలో మళ్లీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం!

గుంటూరు, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): అంగబలంతో మాచర్ల మునిసిపాలిటీలోని అన్ని వార్డులను గత ఏడాది ఏకగ్రీవం చేసుకొన్న వైసీపీకి మింగుడుపడని ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ జారీ చేశారు. ప్రత్యర్థులను నామినేషన్లు వేయకుండా భౌతికంగా అడ్డుకొన్న వార్డులకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి వాటిపై తుది నిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని జిల్లా ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌కి కేటాయించింది. అప్పట్లో టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన పార్టీ సీనియర్‌ నేతలపై భౌతికదాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాలతో మాచర్లలోని అన్ని వార్డులకు తిరిగి నామినేషన్ల ప్రక్రియ చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక మునిసిపాలిటీలోని అన్ని వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకొన్నది. ఇలా జరగడానికి బెదిరింపులే కారణమన్న విషయం బహిరంగ రహస్యమే. పంచాయతీల్లో ఒక చిన్నవార్డుకే పోటీ పడి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తోండగా అంత పెద్ద మునిసిపాలిటీలో ఉన్న 31 వార్డులకు అధికార పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా మరెవరూ నామినేషన్‌ వేయలేదంటే అప్పట్లో నెలకొన్న పరిస్థితి ఊహించవచ్చు. తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయడం లేదని టీడీపీ రాష్ట్ర కమిటీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మాచర్ల వెళుతుండగా మార్గమధ్యలో వైసీపీ నాయకులు అటకాయించి దుంగలతో దాడి చేశారు. ఆ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. ఆ తర్వాత కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందో అక్కడి నుంచి తిరిగి కొనసాగిస్తూ ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పట్లో బలవంతంగా ఏకగ్రీవాలు జరిగాయని, ఎన్నికల ప్రక్రియని రద్దు చేసి పునఃప్రారంభించాలని వైసీపీ మినహా టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు కోరుతూ వస్తోన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. బెదిరింపుల్లో ప్రభావిత పార్టీలు తగిన ఆధారాలతో ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ని సంప్రదించే అవకాశాన్ని ఎస్‌ఈసీ కల్పించింది. ఈ నేపథ్యంలో అప్పట్లో జరిగిన ఘటనల ఆధారంగా ప్రతిపక్షాలు జిల్లా ఎన్నికల అధికారిని సంప్రదించేందుకు సన్నద్ధమయ్యాయి. వాటి ఆధారంగా అభ్యర్థులకు తిరిగి నామినేషన్లు వేసే అధికారం కల్పించవచ్చు. ఈ నేపథ్యంలో బలవంతపు ఏకగ్రీవాలకు ఎసరు పడినట్లేనన్న వాదన వినిపిస్తోన్నది. 


Updated Date - 2021-02-17T05:55:37+05:30 IST