రెండో రోజూ కొనసాగిన సమ్మె

ABN , First Publish Date - 2021-06-16T07:24:16+05:30 IST

సమస్యల పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు చేపట్టి సమ్మె రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగింది.

రెండో రోజూ కొనసాగిన సమ్మె
ఒంగోలులో అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు

విధులకు హాజరుకాని మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు

ఒంగోలులో అర్ధనగ్న ప్రదర్శన  

ప్రభుత్వంపై ధ్వజం

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 15 :  సమస్యల పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు చేపట్టి సమ్మె రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగింది. ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు, కందుకూరు, మార్కాపురం, చీరాల మున్సిపాలిటీలు, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు నగర పంచాయతీల్లో పనిచేస్తున్న 18వేల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలులో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రకాశం భవన్‌ వద్ద అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఎర్రజెండాలు చేతపట్టి ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజవెత్తారు. సీఐటీయూ జిల్లా కార్యరద్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం మునిసిపల్‌ కార్మికుల సమస్యలపై చిన్నచూపు ప్రదర్శిస్తున్నదన్నారు. ప్రాణాలకు తెగించి కొవిడ్‌ సేవల్లో పాల్గొంటున్న వారికి కనీస ఆరోగ్య భద్రత కరువైందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకుడు జి.వి. కొండారెడ్డి, మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కె.సామ్రాజ్యం, కొర్నెపాటి శ్రీనివాసరావు, సీఐటీయూ నగర నాయకులు శ్రీరామ్‌ శ్రీనివాసరావు, తంబి శ్రీనివాసరావు, జి.రమేష్‌, పలువురు కార్మికులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-16T07:24:16+05:30 IST