పుర పోరుకు సై

ABN , First Publish Date - 2021-03-04T05:27:13+05:30 IST

జంగారెడ్డిగూడెంపురపోరుఅధికార,ప్రతిపక్ష పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు కదులుతున్నారు

పుర పోరుకు సై

పురపాలక సంఘ ఎన్నికలు ఈనెల 10వ తేదీన పురస్కరించుకుని బుధవారం నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ముగిసింది. జంగారెడ్డిగూడెం పురపోరులో అన్ని వార్డుల్లోనూ మొత్తం 69 మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు సై అంటున్నారు. ఒక్క ఏకగ్రీవం కూడా కాకపోవడం గమనార్హం. కొవ్వూరు పురపాలక పోరులో 23 వార్డులకు గాను 13 ఏకగ్రీవాలు కాగా పది వార్డుల్లో పోటీ నెలకొంది. మొత్తం 27 మంది బరిలో నిలిచారు. 

జంగారెడ్డిగూడెం పోరులో..69 

ఏకగ్రీవాలు నిల్‌

అన్ని వార్డుల్లోను పోటీ

టీడీపీ, జనసేన పొత్తుతో ఫుల్‌జోష్‌

జంగారెడ్డిగూడెం, మార్చి3:జంగారెడ్డిగూడెంపురపోరుఅధికార,ప్రతిపక్ష పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు కదులుతున్నారు. చైర్‌పర్సన్‌ రిజర్వేషన్‌ జనరల్‌ మహిళ కావడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఏకగ్రీవాల వైపు కదిపిన పావులు విఫలమయ్యాయి. టీడీపీ చైర్‌ పర్సన్‌ అభ్యర్ధి కరుటూరి రమాదేవి ప్రకటన నుంచి పట్టణ రాజకీయ వాతావరణం మారిపోయింది. తెలుగు తమ్ముళ్లు జోష్‌ మీదున్నారు. ప్రచారాలు హోరెత్తిస్తున్నారు. దీనికి తోడు టీడీపీ, జనసేన పార్టీలు జతకట్టడంతో ఇక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. 

మున్సిపల్‌ పరిధిలో ఏకగ్రీవాలు లేవు. అన్ని వార్డుల్లోనూ పోటీ నెలకొంది. 29 వార్డుల్లో 69 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 128 నామినేషన్‌లు 

దాఖలయ్యాయి. వీటిలో నామినేషన్‌ల ఉపసంహరణ సమయంలో 59 నామినేషన్‌లు ఉపసంహరించుకోగా బరిలో 69 మంది నిలిచారు. వైసీపీ నుంచి 27 మంది, టీడీపీ నుంచి 24 మంది, జనసేన పార్టీ నుంచి ఏడుగురు, కాంగ్రెసు పార్టీ నుంచి ముగ్గురు, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, బీజేపీ నుంచి నలుగురు, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు ఎన్నికల బరిలో ఉన్నారు.

అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం : గన్ని 

టీడీపీ, జనసేనలు కలసి అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. జంగారెడ్డిగూడెంలోని టీడీపీ అభ్యర్థి కరుటూరి రమాదేవి ఇంటి వద్ద టీడీపీ, జనసేన నాయకులు విలేకరుల సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీపై టీడీపీ, జనసేన కలసి ముందుకు కదలి జెండా ఎగుర వేస్తామన్నారు. 


కొవ్వూరు పోరులో.. 27 

23 వార్డుల్లో 13 ఏకగ్రీవం

వైసీపీ 9, టీడీపీ 4 కైవసం

86 మంది నామినేషన్ల ఉపసంహరణ

కొవ్వూరు, మార్చి 3 : కొవ్వూరు పురపాలక పోరులో 86 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు మున్సిపల్‌ కమిషనర్‌ కేటీ సుధాకర్‌ తెలిపారు. పట్టణంలోని 23 వార్డులకు 126 మంది నామినేషన్లను దాఖలుచేశారు. వాటిలో మంగళవారం 60 మంది, బుధవారం 26 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇంకా బరిలో 27 మంది పోటీలు నిలిచారు. 

13 వార్డులు ఏకగ్రీవం

కొవ్వూరులో 23 వార్డులకు గాను 13 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వైసీపీ 9 వార్డులు, టీడీపీ 4 వార్డులు దక్కుంచుకున్నాయి. మిగిలిన 10 వార్డులలో మాత్రమే పోటీ నెలకొంది. టీడీపీ 5, వైసీపీ 7, స్వతంత్రులు 4, సీపీఎం 1, బీజేపి 6, జనసేన 4 చోట్ల పోటీలో నిలిచాయి. 1,2,8,23 వార్డులలో ద్విముఖ పోటీ, 3, 9, 10, 13, 14 వార్డులలో త్రిముఖ పోటీ, 4వ వార్డులో నలుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు.

బెడిసికొట్టిన నేతల ప్రయత్నాలు 

పురపోరులో బీజేపీ 7, జనసేన  4 వార్డులలో నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో 10 వార్డులలో పోటీ పడుతున్నారు. వైసీపీ, టీడీపీ మధ్య కుదుర్చుకున్న ఒప్పందంలో బీజేపీ, జనసేనకు ఒక్కొక్క వార్డు ఏకగ్రీవం ఇవ్వడానికి నిర్ణయించగా బీజేపీ, జనసేన అభ్యర్థులు ప్రలోభాలకు లొంగకపోవడంతో పది వార్డులలో పోటీ తప్పలేదు. వైసీపీ, టీడీపీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల వార్డులను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. 

Updated Date - 2021-03-04T05:27:13+05:30 IST