చెరొకటి

ABN , First Publish Date - 2021-11-18T06:41:42+05:30 IST

డబ్బు సంచులు కుమ్మరించారు.. మద్యాన్ని ఏరులై పారించారు..

చెరొకటి

పురపోరులోనూ టీడీపీ గట్టిపోటీ

రెండు మున్సిపాలిటీల్లో హోరాహోరీ

ప్రలోభాలకు లొంగని ఓటర్లు

ఓట్ల లెక్కింపులో ఒత్తిళ్లు

అయినా గెలుపు దిశగా టీడీపీ

కొండపల్లిలో చెరిసగం

స్వతంత్ర అభ్యర్థి చేరికతో పెరిగిన టీడీపీ బలం

జగ్గయ్యపేటలో వైసీపీని బెంబేలెత్తించిన ఓటర్లు

తొలి రౌండ్లలో టీడీపీకి ఆధిక్యం

లెక్కింపు కేంద్రంలోకి ఉదయభాను

అధికారులకు బెదిరింపులు.. ఫలితాలపై సందేహాలు 


డబ్బు సంచులు కుమ్మరించారు.. మద్యాన్ని ఏరులై పారించారు.. ఓటర్లను అన్ని రకాలుగా ప్రలోభపెట్టారు. అధికారులను బెదిరించారు.. యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. ఎలాగైనా గెలిచాం అనిపించుకునేందుకు ఎన్ని చేయాలో అన్నీ చేశారు. కొన్నిచోట్ల ఫలితాలను సైతం తారుమారు చేయించారు. అయినా అధికార వైసీపీ నాయకులకు నిరాశే మిగిలింది. కొండపల్లి ఖిల్లాపై టీడీపీ జెండా రెపరెపలాడింది. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో వైసీపీకి ఉత్సాహాన్నివ్వని గెలుపు దక్కింది. 


(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కొండపల్లి, జగ్గయ్యపేట మున్సిపాలిటీల్లో బుధవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ టీడీపీ గెలుపు అంచున నిలిచింది. అధికార పార్టీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. అంతిమ అస్త్రంగా అధికారులపై బెదిరింపులకు దిగారు. అధినాయకులతో ఫోన్లు చేయించారు. అయినా కొండపల్లిని దక్కించుకోలేకపోయారు. అతికష్టంపై జగ్గయ్యపేటలో జెండా ఎగురవేశారు. 


వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు

జగ్గయ్యపేట మున్సిపాలిటీలో బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన దగ్గర నుంచి టీడీపీ గెలుపు దిశగా పయనించడం ప్రారంభించింది. మొత్తం 31 వార్డులకుగాను అధికశాతం వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో నిలిచారు. అదే ఊపు కొనసాగితే టీడీపీ 18 డివిజన్లలో గెలుపు సాధించి జగ్గయ్యపేట మున్సిపాలిటీని దక్కించుకునేది. టీడీపీ గెలుపు దిశగా పయనిస్తుందన్న విషయాన్ని అధికార వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. స్థానిక ఎమ్మెల్యే ఉదయభాను ఆగమేఘాలపై ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు. అధికారులు పాసులున్న ఏజెంట్లు మాత్రమే లోపలికి వెళ్లాలని చెబుతున్నా, వారి మాటలను లెక్క చేయకుండా లోపలికి  వెళ్లిపోయారు. ఉదయభాను వెళ్లిన దగ్గర నుంచి సీన్‌ మారిపోయింది. అప్పటి వరకు వెంటవెంటనే వెలువడిన ఫలితాలు ఆగిపోయాయి. 


ఫలితాలు తారుమారు

జగ్గయ్యపేటలో మొత్తం వార్డులు 31

వైసీపీకి 17.. టీడీపీకి 14

13వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థిని పున్నా లక్ష్మి ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు తొలుత అధికారులు ప్రకటించారు. ఈ ఫలితంపై వైసీపీ అభ్యర్థిని కాటగాని శివకుమారి అభ్యంతరం తెలపగా, రీకౌంటింగ్‌ నిర్వహించారు. అందులోనూ నాలుగు ఓట్ల ఆధిక్యతతో టీడీపీ అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే ఉదయభాను కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఈ ఫలితాన్ని అధికారులు తారుమారు చేశారు. వైసీపీ అభ్యర్థిని ఆరు ఓట్లతో గెలిచినట్టు ప్రకటించారు. 19వ వార్డులో తొమ్మిది ఓట్లు, 24వ వార్డులో ఆరు, 31వ వార్డులో ఐదు ఓట్లతో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇవన్నీ సింగిల్‌ డిజిట్‌ మెజారిటీలు కావడంతో టీడీపీ అభ్యర్థులు రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేశారు. అయితే  అధికారులు రీకౌంటింగ్‌కు అనుమతించకుండా, హడావిడిగా వైసీపీ అభ్యర్థులు గెలిచినట్టు ప్రకటించి, ధ్రువీకరణ పత్రాలు అందించేశారు. దీంతో మొత్తం 31 వార్డుల్లో వైసీపీ 17 గెలుపొందగా, టీడీపీ 14 స్థానాలకు పరిమితమైంది. ఓట్ల లెక్కింపు అధికారులను ఎమ్మెల్యే బెదిరించి, ఫలితాలను తారుమారు చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 


--------

కొండపల్లిలో టీడీపీ పాగా

మొత్తం వార్డులు 29 

టీడీపీకి 14

వైసీపీకి 14

ఇతరులు 1

స్వతంత్ర అభ్యర్థి చేరికతో 15కు పెరిగిన టీడీపీ బలం


కొండపల్లి మున్సిపాలిటీలో వైసీపీ, టీడీపీ నడుమ హోరాహోరీ పోరు సాగింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఇక్కడ వైసీపీ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఇక్కడ డబ్బు, మద్యం ఏరులై పారింది. చివరి నిమిషం వరకు అధికార పార్టీ నాయకులు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. మొత్తం 29 వార్డులు ఉండగా టీడీపీకి 14.. వైసీపీకి 14 వార్డులు దక్కాయి. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థిని కరిమికొండ శ్రీలక్ష్మి గెలుపొందారు. అయితే టీడీపీ నేతల ఆహ్వానం మేరకు ఆమె చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో టీడీపీ బలం 15కు చేరింది. వైసీపీ తరఫున మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఇక్కడ ఎక్స్‌అఫిషియో ఓటు వినియోగించుకున్నా, ఎంపీ కేశినేని నాని టీడీపీ తరఫున ఎక్స్‌అఫిషియో ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది. ఉత్కంఠ పరిణామాల నడుమ ఎట్టకేలకు కొండపల్లి టీడీపీ ఖాతాలోకి చేరడంతో ఆ పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌, ఆయన బామ్మర్ది అక్రమాల కారణంగా ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత గూడుకట్టుకుంది. దాని ఫలితంగానే కొండపల్లిలో వైసీపీ ఓటమిపాలైంది. 2019 ఎన్నికల్లో కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో వైసీపీకి సుమారు 4,500 ఓట్ల ఆధిక్యం దక్కగా, ఈసారి కేవలం 1,068 ఓట్ల ఆధిక్యాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. స్వతంత్ర అభ్యర్థికి పోలైన ఓట్లనూ పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆధిక్యం 819కి పడిపోతుంది.



Updated Date - 2021-11-18T06:41:42+05:30 IST