సమ్మెకు దిగారు

ABN , First Publish Date - 2021-06-15T07:30:26+05:30 IST

సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు సోమవారం నుంచి సమ్మెకు దిగారు.

సమ్మెకు దిగారు
ఒంగోలులోని కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న పారిశుధ్య కార్మికులు, సీఐటీయూ నాయకులు

20వేల మంది కాంట్రాక్టు కార్మికులు విధులకు దూరం

మున్సిపాలిటీల్లో నిలిచిపోయిన పారిశుధ్య పనులు

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 14 : సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు సోమవారం నుంచి సమ్మెకు దిగారు. యూనియన్‌ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు జిల్లాలో 20వేల మంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. దీంతో ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు, కందుకూరు, మార్కాపురం, చీరాల మున్సిపాలిటీలు, గిద్దలూరు, కనిగిరి, చీమకుర్తి, అద్దంకి నగర పంచాయతీల్లో పారిశుధ్య పనులు నిలిచిపోయాయి. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మునిసిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, అందరినీ రెగ్యులర్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అందజేస్తామని హామీలు ఇచ్చారన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయినా ఇంత వరకూ ఒక్క హామీని కూడా పరిష్కరించకపోగా ఔట్‌సోర్పింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి కార్మికులకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల జీవితాలకు భద్రత, భరోసా కరువైందన్నారు. ఇప్పటికైనా స్పందించి ఆదుకోవాలని కోరారు. మునిసిపల్‌ వర్క్‌ర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సామ్రాజ్యం మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ఈపీఎఫ్‌ రికార్డులను సరిచేసి ఆ సొమ్మును కార్మికుల ఖాతాల్లో జమ చేసి, తిరిగి తీసుకునే విధంగా అకాశం కల్పించాలని కోరారు. వివిధ కారణాలతో చనిపోయిన కార్మికులకు బదులుగా వారి కుటుంబ సభ్యులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. త్వరితగతిన కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేసే వాటర్‌ వర్క్స్‌, స్ట్రీట్‌ లైట్‌ సిబ్బంది, కంప్యూటర్‌ ఆపరేటర్లకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు శ్రీరామ్‌ శ్రీనివాసరావు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. మంగళవారం కూడా సమ్మె కొనసాగనుంది. 


Updated Date - 2021-06-15T07:30:26+05:30 IST