కార్మికాగ్రహం

ABN , First Publish Date - 2020-08-05T11:27:58+05:30 IST

మాట తప్పను, మడమ తిప్పను అంటూనే అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా తమను రెగ్యులర్‌ చేయలేదంటూ ..

కార్మికాగ్రహం

 ముఖ్యమంత్రి తీరుపై మండిపాటు

కార్పొరేషన్‌లో 2 వేల మంది విధుల బహిష్కరణ


నెల్లూరు (సిటీ), ఆగస్టు 4 : మాట తప్పను, మడమ తిప్పను అంటూనే అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా తమను రెగ్యులర్‌ చేయలేదంటూ మున్సిపల్‌ కార్మికులు సీఎం జగన్‌పై మండిపడ్డారు. ఇచ్చిన హామీని నెరవేర్చనందుకు నిరసనగా కార్మికులు మంగళవారం ఒక్కరోజు సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు, సొసైటీల్లో పనిచేసే 1250 మంది పారిశుధ్య కార్మికులతోపాటు, 250 మంది డ్రైవర్లు, 300 మంది తాగునీటి విభాగం సిబ్బంది, మరో 100 మంది భూగర్భ డ్రైనేజీ కార్మికులు, కార్యాలయంలో పనిచేసే 100 మంది ఉద్యోగులు విధులను బహిష్కరించారు. వారంతా సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో నిరసన తెలిపారు.


ఓట్లు వేసి గెలిపించిన వారిని పట్టించుకునే స్థితిలో ముఖ్యమంత్రి లేడని  నాయకు లు కత్తి శ్రీనివాసులు, అల్లాడి గోపాల్‌, నాగేశ్వరరావులు విమర్శించారు. కార్పొరేషన్‌ అధికారులు కార్మికులకు గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లు కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. మాజీ డిప్యూటీ మేయర్‌ మాదాల వెంకటేశ్వర్లుతోపాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా, నగరంలో పారిశుధ్య కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో వారి స్థానంలో ప్రైవేట్‌ కార్మికులతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 300 మంది పర్మినెంట్‌ కార్మికులతోపాటు మరో 350 ప్రైవేట్‌ కార్మికులతో అత్యవసర పారిశుధ్య పనులు జరిపించారు. అవసరాన్ని బట్టి ప్రైవేట్‌ వాహనాలతో చెత్త తరలించామని  ఎంహెచ్‌వో వెంకట రమణయ్య పేర్కొన్నారు.

Updated Date - 2020-08-05T11:27:58+05:30 IST