Abn logo
Apr 8 2021 @ 23:48PM

పురం.. గరం

ముగ్గురిని తొలగించిన కమిషనర్‌

మణుగూరు మునిపాలిటీలో ఆగని ఆందోళన

ధర్నాను కొనసాగించిన కార్మికులు

మద్దతు పలికిన వామపక్ష నాయకులు

మణుగూరు, ఏప్రిల్‌ 8 : మణుగూరు మునిసిపాలిటీలో చెలరేగిన కాక చల్లారడం లేదు. మునిసిపాలిటీ కమిషనర్‌ నాగప్రసాద్‌ తమపై అనుచిత వ్యాఖ్యలను చేస్తూ ఒత్తిడి గురిచేస్తున్నారని ఆరోపిస్తూ కాంట్రాక్టు సిబ్బంది, కార్మికులు బుధవారం ఆందోళన బాట పట్టిన విషయం విధితమే. కాగా ఈ ఆందోళనకు కారకులు వీరేనంటూ కమిషనర్‌ నాగప్రసాద్‌ ముగ్గురు శానిటరీ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఫోన్‌ ద్వారా పేర్కొనడంతో గురువారం కూడా కార్మికులు ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం ఎదుట చేస్తున్న ఆందోళనను ఉధృతం చేశారు. టెంట్‌ వేసి బైఠాయించి కమిషనర్‌ వైఖరిపై మండి పడ్డారు. సీపీఎం నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వామపక్షాల పార్టీ నాయకులు కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మునిపాలిటీ కాంట్రాక్టు కార్మికులు, సిబ్బంది మాట్లాడుతూ తొలగించిన ముగ్గురు సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వర్క్‌ ఇన్స్‌స్పెక్టర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దుర్భాషలను కమిషనర్‌ వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బకాయి జీతాలను వెంటనే ఇవ్వాలన్నారు. తొలగించిన డ్రైవర్లను తిరిగి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నీటి సరఫరా విభాగంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న తెల్లం దర్మరాజు, చంద్రయ్య, తదితరులకు వెంటనే జీతాలు చెల్లించాలని పట్టుబట్టారు. ఈ సందర్బంగా నాయకులు రాంమ్మూర్తి, సుధాకర్‌, మధుసూధన్‌ రెడ్డి, చలపతి రావు, కర్నె రవి మాట్లాడుతూ కార్మికులపై అధిక పనిభారాన్ని మోపడమే కాకుండా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా కమిషనర్‌ ప్రవర్తించడం సరికాదన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కార్మికులకు తమ మద్దతు ఉంటుందన్నారు.


Advertisement
Advertisement