విజన్ లేని మున్సిపాలిటీ

ABN , First Publish Date - 2021-01-11T05:30:00+05:30 IST

‘నేను చదువుకున్న దుబ్బాక ఏమీ మారలేదు. అవే సందులు, అవే వీధులు...ఇంచు మాత్రం కూడా వెనక్కి జరగలేదు. కాపోళ్ల వాడకు పోయి నేను పాలు తెచ్చుకునేటోడిని. ఆ రోడ్లు అలాగే ఉన్నాయి. మనకు అవకాశం వచ్చింది. ఇక రహదారులను మార్చుకుందాం. వెడల్పు చేసుకుందాం. అభివృద్ధి చేసుకుందాం’’. ఇవీ 2015లో సీఎం కేసీఆర్‌ దుబ్బాక పర్యటనలో మాట్లాడిన మాటలు.

విజన్ లేని మున్సిపాలిటీ
అనుమతులకు మించి నిర్మించిన దుబ్బాక పాతరోడ్డులోని భవనం

 దుబ్బాకలో  నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు

 సెట్‌బ్యాక్‌ నిబంధనల అమలు బేఖాతరు

 అయినా చర్యలు తీసుకోని అధికారులు!


  ‘‘నేను చదువుకున్న దుబ్బాక ఏమీ మారలేదు. అవే సందులు, అవే వీధులు...ఇంచు మాత్రం కూడా వెనక్కి  జరగలేదు. కాపోళ్ల వాడకు పోయి నేను పాలు తెచ్చుకునేటోడిని.  ఆ రోడ్లు అలాగే ఉన్నాయి. మనకు  అవకాశం వచ్చింది. ఇక రహదారులను మార్చుకుందాం. వెడల్పు చేసుకుందాం. అభివృద్ధి చేసుకుందాం’’. ఇవీ 2015లో సీఎం కేసీఆర్‌ దుబ్బాక పర్యటనలో మాట్లాడిన మాటలు. 

  ‘‘దుబ్బాకకు బాహ్యవలయం అవసరం. మున్సిపాలిటీకి చుట్టూ రింగ్‌రోడ్డు,  పట్టణంలోని అంతర్గత రహదారులను అభివృద్ధి చేసుకుని మాస్టర్‌ప్లాన్‌ను అమలు పర్చుకుందాం. వీలైన చోట రహదారులను వెడల్పు చేసుకుందాం’’ ఇటీవల ఉప ఎన్నికలో విజయంసాధించిన దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్‌రావు అన్న మాటలివి.

 ఆరేళ్ల క్రితం సీఎం చెప్పిన మాటలు.. ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ నుంచి వెలువడిన అభిప్రాయం ఒకేలా ఉన్నా.. దుబ్బాకలో మాస్టర్‌ ప్లాన్‌ అమలవుతుందా? అన్న సందేహమే నియోజకవర్గ ప్రజల్లో మెదలుతున్నది. దుబ్బాక మున్సిపల్‌ అధికారుల తీరు ఈ అనుమానానికి ఊతమిస్తున్నది


దుబ్బాక, జనవరి11 :  సరిగ్గా మూడేళ్ల క్రితం కూడా దుబ్బాక మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించేందుకు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కార్యచరణ రూపొందించారు. అంతలోనే మాస్టర్‌ప్లాన్‌ అమలుకు ఏదో అవాంతరం రావడంతో పాటు, ముందస్తు ఎన్నికలు రావడంతో ఆ ప్లాన్‌ కాస్తా అటకెక్కింది. మాస్టర్‌ ప్లాన్‌ దేవుడెరుగు? ఇక్కడ అధికారుల తీరుతో అసలుకే ఎసరుగా మారుతున్నది. 

దుబ్బాకలో ఇటీవల నిర్మాణం చేపడుతున్న భవనాలు కనీస నిబంధనలు పాటించకుండా నిర్మిస్తున్నారు. అందుకు అధికారులు యథేచ్చగా రాజమార్గం చూపుతున్నారనే విమర్శలున్నాయి. ఏకంగా రహదారులను కూడా పగలగొట్టి నిర్మాణాలు చేపడుతున్నారంటే ఎలాంటి మతలబూ లేనిదే అనుమతులు లభిస్తున్నాయా? అనే ప్రశ్న ప్రజల నుంచి వెలువడుతుంది. దుబ్బాకలో అత్యంత ఇరుకైన రహదారిగా దుబ్బాక బస్టాండ్‌ నుంచి, కొత్తరహదారి, పాత రహదారిగా చెప్పొచ్చు. ఈరహదారులు కేవలం 27 ఫీట్ల వెడల్పు మాత్ర మే ఉం టాయి. మున్సిపల్‌ నిబంధనల ప్రకారం కొత్త రహదారి సుమారు 60 ఫీట్ల వరకు ఉండాలి. పాతరోడ్డు 30 ఫీట్ల రహదారిగా ఉండాలి. అయితే వ్యాపార, దుకాణ సముదాయాలు ఎక్కువగా ఉండే రహదారిపై రద్దీ ఉండి వాహనాలు నిలుపుతుండడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. సుమారు 30 ఏళ్ల క్రితం రహదారి ఏర్పడిన నాటి నుంచి కనీసం ఒక్క ఇంచు కూడా వెడల్పుకు నోచుకోలేదు. 

మాస్టర్‌ప్లాన్‌ అమలైతే ఈ రహదారులు సుమారు 60 ఫీట్ల వరకు వెడల్పు చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల క్రితం రూపకల్పన చేసిన ప్లాన్‌ అలాగే ఉండగా పాత రహదారిలో భవన నిర్మాణాలకు యథేచ్చగా అనుమతులు ఇస్తున్నారు.  నిబందనలకు విరుద్ధంగా నాలుగు అంతస్థుల భవనాలను ఎంచక్కా నిర్మిస్తున్నారు. దుబ్బాక మున్సిపల్‌ నిబంధనల ప్రకారం జీప్ల్‌స-2గా అనుమతులుండగా, నాలుగు అంతస్తులను ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్నారు. 27 ఫీట్ల రహదారిపై ఇంచు కూడా సెట్‌ బ్యాక్‌ జరగకుండానే అధికారుల కనుసన్నాల్లోనే నిర్మాణాలు చేస్తున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. గృహ నిర్మాణం కోసమని తీసుకున్న అనుమతిని తుంగలో తొక్కి వ్యాపార అవసరాలకు దుకాణ సముదాయాన్ని నిర్మించినా కూడా పట్టించుకునే నాథుడు లేదు. ఎందుకంటే అధికారుల చేతులు తడుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తామని ఎమ్మెల్యే సమీక్షలు జరుపుతుంటే మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం సాగడం పలు విమర్శలకు తావిస్తోంది.  విజయ దుర్గ కాలనీలో భవన నిర్మాణం చేపట్టిన వ్యక్తి, సెట్‌బ్యాక్‌ నిబంధన పాటించకపోవడంతో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. రెండు భవనాలను కూడా సెట్‌బ్యాక్‌ లేకుండానే సాగిస్తున్నారు. నూతనంగా నిర్మించిన భవనాలు పూర్తయ్యాకా, మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో రహదారుల విస్తీర్ణంలో అధికారుల చిత్తశుద్ధి, ఎమ్మెల్యే పట్టుదల ఎలా ఉంటుందా?అని ప్రజలు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. 


అనుమతిలేని ఇళ్లు ఎన్నో

దుబ్బాకలో ప్రస్తుతం అధికారులు గుర్తించి మిన్నకుండా ఉన్న అనుమతి లేని ఇళ్లు సుమారు 20వరకు ఉన్నాయి.  అలాగే మరెన్నో నిర్మాణాలను అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో బీపా్‌సలో అనుమతి పొందిన వ్యక్తులను మినహాయిస్తే, మిగితా భవనాలు ఒక్కటి కూడా నిబంధనలు పాటించిన దాఖలాలు లేవు.


మాకు ఎలాంటి అధికారం లేదు

- దేవరాజ్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారి

మేము చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అధికారమూ లేదు. కేవలం జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు గుర్తించి చర్య లు తీసుకోవాల్సి ఉంటుంది. పాత చట్టం ప్రకారం మేము మూడు నోటీసులు అందించే అవకాశం ఉండేది. ప్రస్తుత చట్టం ప్రకారం మేం ఏం చేయలేము. 



Updated Date - 2021-01-11T05:30:00+05:30 IST