టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ మధ్య దూరం

ABN , First Publish Date - 2021-04-11T06:42:47+05:30 IST

జల్‌పల్లి మునిసిపాలిటీలో టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీల మధ్య విబేధాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి

టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ మధ్య దూరం

జల్‌పల్లి మునిసిపాలిటీలో..

పహాడిషరీఫ్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): జల్‌పల్లి మునిసిపాలిటీలో టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీల మధ్య విబేధాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మునిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ వేరువేరుగా 28 స్థానాల్లో పోటీ చేయగా, 15స్థానాల్లో మజ్లిస్‌, 12 స్థానాలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నాయి. పొత్తులో భాగంగా చైర్మన్‌గా మజ్లిస్‌ నుంచి అబ్దుల్లా సాదిని ఎన్నుకోగా, టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఫర్హానా నాజ్‌ను వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలే కొనసాగాయి. ఆరు నెలల క్రితం 28వ వార్డు కౌన్సిల ర్‌ నాజియా బేగం అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవల మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయంలో రంగారెడ్డి జిల్లాలోని కార్పొరేషన్ల చైర్మన్లు, మునిసిపల్‌ మేయర్లు, కమిషనర్లతో జరిగిన సమావేశంలో జల్‌పల్లి మునిసిపల్‌ చైర్మన్‌ స్థానిక సమస్యలను లేవనెత్తారు. మంత్రి సరైన సమాధానం చెప్పలేదని చైర్మన్‌ సదరు సమావేశాన్ని బహిష్కరించారు. తర్వాత మంత్రి జల్‌పల్లి మునిసిపాలిటీపై సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నారని విమర్శించారు. దీనికి టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ప్రతి విమర్శలు చేశారు. గతంలో 28వ వార్డును మజ్లిస్‌ కైవసం చేసుకోగా, ఈసారి ఎలాగైనా అక్క డ పాగా వేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న నాయకులంతా టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఈసారి విజయం తమదేనని ధీమాతో గులాబీ నేతలు ఉన్నారు. తమ స్థానాన్ని గతం కంటే ఎక్కువ మెజారిటీతో నిలుపుకుంటామని మజ్లిస్‌ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతోంది.  

 

Updated Date - 2021-04-11T06:42:47+05:30 IST