భార్య పేరు..భర్త జోరు

ABN , First Publish Date - 2021-04-14T06:45:12+05:30 IST

పెద్ద అంబర్‌పేట మునిసిపాలిటీలో కొందరు మహిళా కౌన్సిలర్ల భర్తలు హల్‌చల్‌ చేస్తున్నారు.

భార్య పేరు..భర్త జోరు

 కొందరు మహిళా కౌన్సిలర్ల తీరు

పెద్ద అంబర్‌పేటలో..

 అన్ని తామై వ్యవహరిస్తున్న కొందరు

 మహిళా కౌన్సిలర్ల భర్తలతో పరేషాన్‌

అధికారులు, సిబ్బందిపై దురుసు ప్రవర్తన

అబ్దుల్లాపూర్‌మెట్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): పెద్ద అంబర్‌పేట మునిసిపాలిటీలో కొందరు మహిళా కౌన్సిలర్ల భర్తలు హల్‌చల్‌ చేస్తున్నారు. వారు కొన్ని సందర్భాల్లో అధికారులు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నా, ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. వారితో వాగ్వాదానికి దిగలేని కొందరు సర్దుకుపోదాం అన్న ధోరణిలో ఉంటుండటంతో కౌన్సిలర్ల భర్తలు మరింత రెచ్చిపోతున్నారు.  ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారికంటే, వారి భర్తలు.. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మేం చెప్పినట్లు చేయాల్సిందే..

మునిసిపాలిటీ అధికారులు, సిబ్బంది తాము చెప్పినట్లు వినాల్సిందే అన్నట్లుగా కొందరు మహిళా కౌన్సిలర్ల భర్తలు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నేరుగా కార్యాలయానికి వచ్చి పైరవీలు చేస్తున్నారని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అక్రమ నిర్మాణాల విషయంలో మహిళా కౌన్సిలర్ల ఆగడాలు మితిమీరుతున్నట్లు తెలుస్తోంది. నా వార్డులో ఫలానా నిర్మాణం జరుగుతోంది. దాని జోలికి వెళ్లవద్దని అధికారులు, సిబ్బందికి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ పని చేసిన టీపీవోతో అక్రమ నిర్మాణాల విషయంలో కొందరు కౌన్సిలర్ల భర్తలు పలుమార్లు వాగ్వాదానికి దిగారు. ఓ సందర్భంలో సదరు టీపీవో ‘నన్ను ప్రశ్నించడానికి మీరెవరూ’ అంటూ గట్టిగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. వారి ఆగడాలను భరించలేకే సదరు టీపీవో తాను డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న పెద్ద అంబర్‌పేట మునిసిపాలిటీలో పని చేయలేనని అధికారుల వద్ద మొర పెట్టుకుని రెగ్యూలర్‌ పోస్టింగ్‌ ఉన్న చోటనే విధులు నిర్వహిస్తున్నారు. కొందరు మహిళ కౌన్సిలర్ల భర్తల పెత్తనం ఎక్కువ అన్న నేపథ్యంలోనే ఈ మునిసిపాలిటీలో ఉద్యోగం చేసేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, అధికారిక కార్యక్రమాల్లోనూ కొందరు మహిళా కౌన్సిలర్ల భర్తలే కౌనిలర్లుగా చెలామణి  అవుతున్నారు. వార్డుల్లో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో వారే కౌన్సిలర్లుగా వ్యవహరించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.   

Updated Date - 2021-04-14T06:45:12+05:30 IST