‘పురపోరు’కు DMK టిక్కెట్‌ కోసం లక్షమంది దరఖాస్తు

ABN , First Publish Date - 2022-01-22T14:25:03+05:30 IST

తొమ్మిది జిల్లాల్లో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో తన సత్తాను చాటిన అధికార డీఎంకే ఫిబ్రవరిలో జరుగనున్న కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించేందుకు వ్యూహరచన చేస్తోంది. రాష్ట్ర

‘పురపోరు’కు DMK టిక్కెట్‌ కోసం లక్షమంది దరఖాస్తు

చెన్నై: తొమ్మిది జిల్లాల్లో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో తన సత్తాను చాటిన అధికార డీఎంకే ఫిబ్రవరిలో జరుగనున్న కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించేందుకు వ్యూహరచన చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలాఖరులోగా 21 కార్పొరేషన్లు, 138 మున్సిపాలిటీలు, 490 పట్టణ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవశం చేసుకోవాలని డీఎంకే అధిష్టానవర్గం ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికలకుగాను అభ్యర్థుల ఎంపిక విషయమై పార్టీ జిల్లా నాయకులతో పలు విడతలుగా ప్రత్యక్షంగా, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌, సీనియర్‌ నాయకుడు దురైమురుగన్‌, ఎంపీ టీఆర్‌ బాలు తదితర నేతలు చర్చించారు. గత డిసెంబర్‌ నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. చెన్నై కార్పొరేషన్‌కు సంబంధించి అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ రెండు నెలల ముందే ముగిసింది. తాంబరం, కార్పొరేషన్‌, మాంగాడు, కుండ్రత్తూరు, గూడువాంజేరి మున్సిపాలిటీలకు సంబంధించి గురువారం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్పొరేషన్‌ వార్డు సభ్యుడిగా పోటీకి రూ.10వేలు, మున్సిపల్‌ వార్డు సభ్యుడికి రూ.5వేలు, పట్టణ పంచాయతీ వార్డు సభ్యుడిగా పోటీ చేయడానికి రూ.2500ల చొప్పున దరఖాస్తు రుసుము కూడా స్వీకరించారు. ఇప్పటి వరకూ అన్నింటికి కలిపి సుమారు లక్షకు పైగా దరఖాస్తులు స్వీకరించినట్లు డీఎంకే సీనియర్‌ నాయకుడొకరు తెలిపారు. ఈసారి అభ్యర్థుల ఎంపిక జిల్లా శాఖ నాయకుల ప్రతిపాదనల మేరకే జరుగనుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం జిల్లా నాయకులు అభ్యర్థుల ఎంపికపై జాబితా తయారు చేసి ఈ నెలాఖరుకల్లా వాటిని పార్టీ అధిష్టానవర్గానికి పంపనున్నారు.

Updated Date - 2022-01-22T14:25:03+05:30 IST