ఏపీలో అరాచక పాలన సాగుతోంది: కేంద్రమంత్రి మురళీధరన్

ABN , First Publish Date - 2022-01-24T18:53:21+05:30 IST

కడప: జిల్లాలో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ, పార్లమెంట్ ఇన్చార్జ్ మంత్రి మురళీధరన్ పర్యటిస్తున్నారు.

ఏపీలో అరాచక పాలన సాగుతోంది: కేంద్రమంత్రి మురళీధరన్

కడప: జిల్లాలో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ, పార్లమెంట్ ఇన్చార్జ్ మంత్రి మురళీధరన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కడప సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో అశాంతి నెలకొందని, సీఎం జగన్ మోహన్ రెడ్డి అసమర్థత వల్ల రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. సీఎం జగన్ పాలనపై దృష్టి పెట్టకపోవడంతో వైసీపీ నాయకులు రాష్ట్రంలో రెచ్చిపోతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్రమాలకు తెరలేపారని, ఏపిలో ఇస్లామిక్ పండమెంటల్ కార్యకలాపాలు ఎక్కువయ్యాయన్నారు. అల్లర్లకు కొందరు ప్రోత్సహిస్తున్నారని, దీనికి సీఎం బాధ్యత వహించాలన్నారు.


ఆత్మకూరు బీజేపీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని మురళీధరన్ అన్నారు.  వైసీపీ నేతలు ప్రభుత్వం రాక మునుపు ఒక మాట.. వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శ్రీకాంత్ రెడ్డిని చంపేందుకు ఆత్మకూరులో కుట్రపన్నారని మురళీధరన్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఇతర ముఖ్య బీజేపీ నేతలు ఉన్నారు.

Updated Date - 2022-01-24T18:53:21+05:30 IST