ఫ్రెండ్‌కు ప్రేయసిని పరిచయం చేశాడా వ్యక్తి.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్.. చివరకు..

ABN , First Publish Date - 2020-04-06T18:10:19+05:30 IST

తను ప్రేమిస్తున్న మహిళ తనకు దక్కదేమోననే అనుమానంతో అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ మోకు ఆనంద్‌రెడ్డిని హత్య చేసినట్టు ప్రధాన నిందితులు పోలీసుల ముందు అంగీకరించారు. హత్యకేసులో పాల్గొన్న ఆరుగురిలో చివరి ఇద్దరు పింగిళి ప్రదీప్‌రెడ్డి

ఫ్రెండ్‌కు ప్రేయసిని పరిచయం చేశాడా వ్యక్తి.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్.. చివరకు..

ప్రియురాలు దక్కదేమోనని హత్య

అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ ఆనందరెడ్డి హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్టు


వరంగల్‌ అర్బన్‌ (ఆంధ్రజ్యోతి): తను ప్రేమిస్తున్న మహిళ తనకు దక్కదేమోననే అనుమానంతో అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ మోకు ఆనంద్‌రెడ్డిని హత్య చేసినట్టు ప్రధాన నిందితులు పోలీసుల ముందు అంగీకరించారు. హత్యకేసులో పాల్గొన్న ఆరుగురిలో చివరి ఇద్దరు పింగిళి ప్రదీప్‌రెడ్డి, నిగ్గుల రమే్‌షను శనివారం అరెస్టు చేసినట్టు హన్మకొండ సీఐ పత్తిపాక దయాకర్‌ ఆదివారం తెలిపారు. మృతుడు మోకు ఆనంద్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి స్నేహితులు. ఇద్దరు కలిసి చాలా రోజులుగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రదీప్‌రెడ్డికి మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడగా.. ఇద్దరు పెళ్లి చేసుకునే వరకు వెల్లింది. కాగా మధ్యలో వచ్చిన ఆనంద్‌రెడ్డికి ప్రదీప్‌రెడ్డికి వ్యాపార లావాదేవీలు ఉండడం, సదరు మహిళ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినది కావడంతో ఆమెను ఆనంద్‌రెడ్డికి పరిచయం చేశారు. 


ఆ తర్వాత ప్రదీప్‌రెడ్డికి తెలియకుండా ఆనంద్‌రెడ్డి మహిళతో ఫోన్‌లో మాట్లాడేవాడని, ఈ విషయం తెలిసిన ప్రదీప్‌రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలిపారు. పలుమార్లు ఆనంద్‌రెడ్డిని హెచ్చరించాడు. అయినా ప్రియురాలు తనకు దక్కదేమోనని ఆనంద్‌రెడ్డిపై ప్రదీప్‌రెడ్డి పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆనంద్‌రెడ్డిని అడ్డుతొలగించుకుంటేనే ఆమె దక్కుతుందని హత్యకు పథకం రూపొందించాడు. తన వద్ద పనిచేసే డ్రైవర్‌ నిగ్గుల రమేష్‌, వ్యాపార భాగస్వామి విక్రంరెడ్డి, క్వారీలో పని చేసే శివరామకృష్ణ, మధుకర్‌, శంకర్‌ సహాయంతో గత మార్చి 8న ఆనంద్‌రెడ్డిని భూపాలపల్లి శివారు రాంపూర్‌ అడవుల్లోకి తీసుకెళ్లి హత్యచేశారు. హన్మకొండ అశోక హోటల్‌ నుంచి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 


వీరిలో ఇటీవలే నలుగురిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.  ఈ క్రమంలో ప్రదీప్‌రెడ్డి, రమేష్ హన్మకొండకు చెందిన వెంగళరావు వద్ద తీసుకున్న కారును ఇచ్చేందుకు వస్తున్నట్టు పక్కా సమాచారం వచ్చింది. దీంతో శనివారం ఉదయం హన్మకొండ పబ్లిక్‌ గార్డెన్‌ వద్ద ఈ వీరిని అరెస్టు చేశారు. విచారణలో హత్య చేసిన తీరును అంగీకరించారని సీఐ వెల్లడించారు. నిందితుల వద్ద హత్యకు ఉపయోగించిన కత్తులతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ ఎస్‌ఐలు శ్రీనివా్‌సయాదవ్‌, బొజ్జ రవీందర్‌, లక్కర్సు కొంరెల్లితో పాటు సిబ్బంది సుమన్‌, వెంకటేశ్‌ కేసును ఛేదించారు.

Updated Date - 2020-04-06T18:10:19+05:30 IST