సర్జికల్‌ బ్లేడుతో శరీరం తునాతునకలు

ABN , First Publish Date - 2021-11-29T09:06:05+05:30 IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మీసేవ ఉద్యోగి కాంపెల్లి శంకర్‌ను అతని భార్య హేమలత ప్రియుడు రాజు హత్య చేసినట్లు పోలీసు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ మేరకు రాజు..

సర్జికల్‌ బ్లేడుతో శరీరం తునాతునకలు

  • భార్య ప్రియుడి చేతిలోనే శంకర్‌ హత్య?
  • నేరం ఒప్పుకున్న నిందితుడు రాజు?


జ్యోతినగర్‌, నవంబరు 28: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మీసేవ ఉద్యోగి కాంపెల్లి శంకర్‌ను అతని భార్య హేమలత ప్రియుడు రాజు హత్య చేసినట్లు పోలీసు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ మేరకు రాజు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. శంకర్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసి తల, చేతులు, కాళ్లు, పొట్ట భాగాలను సర్జికల్‌ బ్లేడుతో ముక్కలు చేసిన హంతకుడు రామగుండం ప్రాంతంలోని నాలుగు పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో పడేశాడు. శనివారం ఉదయం ఎన్టీపీసీ ప్లాంటు ప్రహరీ పక్కన శంకర్‌ తల, చేతులు దొరకగా, ఆదివారం ఉదయం కాళ్లు బసంత్‌నగర్‌ ఏరియాలో, పొట్ట భాగం మేడిపల్లి ఓసీపీ ఏరియాలో, నడుము నుంచి మోకాళ్ల వరకు గోదావరిఖని సప్తగిరి కాలనీలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తున్నది. నిందితుడు ఇచ్చిన సమాచారంతోనే శంకర్‌ శరీర భాగాలను పోలీసులు కనుగొన్నట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం. 


ఆ బంధమే అంతం చేసింది? 

ఎన్టీపీసీ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సుగా పని చేస్తున్న శంకర్‌ భార్య హేమలతకు అదే ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్న రాజుతో ఏర్పడిన చనువు వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసినట్లు సమాచారం. అదే ఆస్పత్రిలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న శంకర్‌ తల్లి, అక్కకు హేమలత వ్యవహారం తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలైంది. మూడు నెలల క్రితం భర్త శంకర్‌పై హేమలత ఎన్టీపీసీ పీఎ్‌సలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. అయినా, హేమలత తీరులో మార్పు రాకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 25న శంకర్‌కు హేమలతతో అసభ్యకరంగా ఉన్న ఒక ఫోటోను రాజు పోస్టు చేసినట్లు సమాచారం. మనస్తాపానికి గురైన రాజు భార్యతో మరోసారి ఘర్షణ పడ్డాడు. అదేరోజు రాత్రి హేమలతను నైట్‌ షిఫ్టుకు ఆస్పత్రిలో దించిన అనంతరం మద్యం సేవించిన శంకర్‌ రాత్రి 10 గంటల సమయంలో రాజుకు ఫోన్‌ చేయగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.  శంకర్‌ రాత్రి 10.30 సమయంలో రాజు ఇంటికి వెళ్లగా, అక్కడ ఇద్దరు ఘర్షణ పడ్డారని, రాజు పదునైన వస్తువుతో శంకర్‌ తలపై బలంగా కొట్టడంతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడు శంకర్‌ దుస్తులను తొలగించి తన ఇంటి ఆవరణలోనే తగులబెట్టినట్లు తెలిసింది. శంకర్‌ మృతదేహాన్ని సర్జికల్‌ బ్లేడుతో ముక్కలుచేసి సంచిలో పెట్టుకొని, మృతుడు శంకర్‌ ద్విచక్ర వాహనంపైనే వెళ్లి వివిధ చోట్ల పడేసినట్లు సమాచారం.


పోలీసులు ఆ వాహనాన్ని పెద్దపల్లి బస్టాండ్‌ వద్ద గుర్తించి సీజ్‌ చేశారు. హేమలత ప్రమేయంతో హత్య జరిగిందా? రాజు పథకం ప్రకారమే శంకర్‌ను హతమార్చాడా? ఈ హత్యలో ఎంత మంది ప్రమేయం ఉంది? అనే విషయాలు విచారణలో వెల్లడయ్యే అవకాశముంది. శంకర్‌ శరీర భాగాలకు పోస్టుమార్టం చేసిన అనంతరం బంధువులకు అప్పగించారు. 

Updated Date - 2021-11-29T09:06:05+05:30 IST