HYD : వీడిన తల్లీకుమార్తెల మృతి కేసు మిస్టరీ.. ‘ఆంధ్రజ్యోతి’ ఊహించిందే నిజం!

ABN , First Publish Date - 2021-07-17T13:44:37+05:30 IST

‘ఆంధ్రజ్యోతి’ ఊహించినట్లే...

HYD : వీడిన తల్లీకుమార్తెల మృతి కేసు మిస్టరీ.. ‘ఆంధ్రజ్యోతి’ ఊహించిందే నిజం!

  • తండ్రే నిందితుడు 
  • ఆర్థిక సమస్యలే కారణం

హైదరాబాద్ సిటీ/బోయినపల్లి : బోయినపల్లి పరిధిలో ఈ నెల 1న వెలుగు చూసిన తల్లీకుమార్తెల అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. ‘ఆంధ్రజ్యోతి’ ఊహించినట్లే తండ్రే నిందితుడని తేలింది. నిందితుడిని బోయినపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు.  బోయినపల్లి సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాలు.. రాజస్థాన్‌ హనుమాన్‌ జిల్లా నోహార్‌ గ్రామానికి చెందిన విజయ్‌ భాంటియా (41) రాణిగంజ్‌లోని ఓ సేఫ్టీ సామగ్రి డిస్టిబ్యూషన్‌ దుకాణంలో ఏజెంట్‌. భార్య స్నేహ(40), కవలలు హన్సిక (15), వర్షిక(15), కుమారుడు వీరూ భాంటియా(10) ఉన్నారు. పిల్లలు న్యూబోయినపల్లిలోని పల్లవి మోడల్‌ స్కూల్‌లో చదువుతుండడంతో విజయ్‌ కుటటుంబంతో కలిసి ఆరేళ్లుగా అక్కడి మనోవికాస్‌నగర్‌లో ఉంటున్నారు. తొలుత ఆర్థికంగా బాగానే ఉన్నా, విజయ్‌ భాంటియా లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


మనోవేదనకు గురై భార్యాపిల్లలను అంతం చేసి, తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. జూన్‌ 30న విజయ్‌ కుటుంబసభ్యులతో కలిసి రాత్రి భోజనం చేశాడు. అనంతరం విజయ్‌, స్నేహ, హన్సికలు ఓ గదిలో, వర్షిక, వీర్‌ భాం టియాలు మరో గదిలో నిద్రపోయారు. ఇదే అదనుగా విజయ్‌ భాంటియా తెల్లవారుజామున మొదట హన్సిక గొంతు నులిమి, అనంతరం భార్య స్నేహ ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు. ఉదయం ఏడు గంటలకు పాల వ్యాపారి రావడంతో పాలు తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు. మిగతా ఇద్దరు పిల్లలను హతమార్చడానికి ధైర్యం చాలకపోవడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కుటుంబానికి రోజూ ఆలస్యంగా నిద్ర లేవడం అలవాటు. ఉదయం 10 గంటలకు నిద్ర లేచిన వర్షిక వెళ్లి చూడగా, తల్లిదండ్రులు ఇంకా పడుకొనే ఉన్నారు. పాలు అందుబాటులో ఉండటంతో వర్షిక టీ చేసింది.


11గంటలకు తల్లిదండ్రులను నిద్ర లేపే ప్రయత్నం చేయగా, వారు లేవ లేదు. అనుమానం వచ్చి రాజస్థాన్‌లోని తాతకు ఫోన్‌ చేసింది. ఆయన కవాడిగూడలోని బంధువు రాకేష్‌కు ఫోన్‌ చేసి, విషయం చెప్పాడు. రాకేష్‌ వచ్చి చూడగా, స్నేహ.. హన్సిక చనిపోయి ఉన్నారు. విజయ్‌ కొనఊపిరితో ఉండడంతో చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హన్సిక మెడపై గాయాలు ఉండటాన్ని గుర్తించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయ్‌ భాంటియాను పలుమార్లు విచారించారు. శుక్రవారం మరోసారి అదుపులోకి తీసుకునివిచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఆర్థిక ఇబ్బందులతో అందరినీ చంపి, తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2021-07-17T13:44:37+05:30 IST