వ్యక్తిగత విభేదాలే రాజకీయ కక్షలుగా!

ABN , First Publish Date - 2020-07-02T09:45:43+05:30 IST

అవనిగడ్డ నియోజకవర్గంలో సంచలనం రేకెత్తించిన టీడీపీ నేత తాతా సాంబశివరావు హత్యకు రాజకీయ విభేదాలు, వివాహేతర సంబంధమే

వ్యక్తిగత విభేదాలే రాజకీయ కక్షలుగా!

తోడైన వివాహేతర సంబంధం

పెద గౌడపాలెంలో టీడీపీ 

ఎంపీటీసీ అభ్యర్థి దారుణ హత్య

లొంగిపోయేందుకు సిద్ధమైన నిందితులు


నాగాయలంక, జూలై 1 : అవనిగడ్డ నియోజకవర్గంలో సంచలనం రేకెత్తించిన టీడీపీ నేత తాతా సాంబశివరావు హత్యకు రాజకీయ విభేదాలు, వివాహేతర సంబంధమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. తాతా సాంబశివరావు కుటుంబానికి పరిశె వేణు కుటుంబానికి ఏడేళ్లుగా వ్యక్తిగత కక్షలున్నాయి. 2014 వరకు ఇరు కుటుంబాలు టీడీపీలోనే ఉండగా, ఆ తరువాత పరిశె కుటుంబం వైసీపీలో చేరింది.  నాటి నుంచి ఇరు వర్గాల నడుమ ఉన్న వ్యక్తిగత కక్షలు రాజకీయ కక్షలుగా మారాయి.


దీనికి ఓ వివాహేతర సంబంధం తోడైంది. 2017లో తాతా సాంబశివరావు తన ప్రత్యర్థి పరిశె వేణుపై దాడికి పాల్పడ్డాడు. ఆ కేసులో తనకు సరైన న్యాయం జరగలేదని సాంబశివరావుపై వేణు కక్ష పెంచుకున్నాడు. తదనంతర పరిణామాల్లో తాతా సాంబశివరావును గ్రామ టీడీపీ అధ్యక్షునిగా, ఎంపీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. దీంతో సాంబశివరావు ఎన్నికైతే తమకు రక్షణ లేకుండా పోతుందని ప్రత్యర్థి వర్గం భావిస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే, సాంబశివరావు కుటుంబానికి చెందిన ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించాడని పరిశె వేణు తమ్ముడు చంటితో బుధవారం ఉదయం కూడా సాంబశివరావు ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. అప్పటికే సాంబశివరావుపై కక్ష పెంచుకున్న పరిశె కుటుంబం నాగాయలంక నుంచి స్వగ్రామానికి వెళ్తున్న సాంబశివరావుపై పర్రచివర శివారు మెరకపాలెం వద్ద దాడి చేయాలని ప్రణాళిక రూపొందించుకుని, సాంబశివరావుపై విచక్షణా రహితంగా దాడి చేసి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. 


లొంగుబాటుకు పరిశె కుటుంబం సిద్ధం 

హత్య కేసులో అనుమానితులుగా భావిస్తున్న పరిశె వేణు, చంటి, వారి సోదరి అంక నాగులు పోలీసుల వద్ద లొంగిపోయేందుకు రాయభారం నడుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. బుధవారం రాత్రే అనుమానితులు ముగ్గురూ  పోలీసుల వద్ద లొంగిపోయినట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి లొంగుబాట్లు లేవని నాగాయలంక పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2020-07-02T09:45:43+05:30 IST