మురుసుకునేంత గొప్ప పాలనా?

ABN , First Publish Date - 2021-09-29T06:35:40+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే సన్నివేశం అది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు వచ్చిన మరుసటి రోజు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత మీడియా ముందుకు వచ్చారు....

మురుసుకునేంత గొప్ప పాలనా?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే సన్నివేశం అది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు వచ్చిన మరుసటి రోజు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత మీడియా ముందుకు వచ్చారు. సీఎం జగన్– సంక్షేమ కార్యక్రమాల్లో దూసుకుపోతున్నాం, అందుకే ఎన్నికల్లో విజేతలమయ్యామన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు– మేము పోటీలో లేకపోయేసరికి యుద్ధం ఏకపక్షమైంది అంటూనే, దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోదామని సహజ ధోరణికి భిన్నంగా సవాలు విసిరారు.


చంద్రబాబు సవాళ్లను పక్కనపెడితే ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏంటి? గతంలో మాదిరిగా వైసీపీకి 51శాతం ఓట్లు వస్తాయా అంటే ఔనని గట్టిగా చెప్పలేకపోతున్నారు ఆ పార్టీ నేతలు. అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం సహజం. అయితే అది రెండున్నరేళ్లలోనే భారీగా పెరిగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏప్రిల్‌లో జరిగాయి. ఈ ఆరునెలల్లో పరిస్థితులు అంతో ఇంతో మారాయనేది సుస్పష్టం. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరుతుంటే, అంతా సవ్యంగా ఉంటే, నామినేషన్ వేసి ఇంట్లో కూర్చున్నా ఆ పార్టీ నేతలు సులువుగా గెలవచ్చు. అలాంటి పరిస్థితి కనిపించడం లేదిప్పుడు. బస్సుల్లో బయట ఊళ్ల నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించడం, పోలీసు వ్యవస్థను ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం.. ఇలా రకరకాల మార్గాల్లో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు వైసీపీ నేతలు.


ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో రోడ్ల సౌందర్యం ఎలా ఉందో కనిపించింది. ప్రజలు పన్నులు కడుతోంది సౌకర్యాల కోసం. అంతే కానీ పాలకులకు ఓట్లు తెచ్చే పథకాలను అమలు చేయడానికి కాదు. సోషల్ మీడియాతో పాటు నలుగురు వ్యక్తులు కలిసిన చోటల్లా వినిపిస్తున్న మాటే ఇది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా రోడ్ల మీద తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదు. రాష్ట్రానికి ఒక్క కంపెనీని తీసుకురాలేదు. ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు కానీ, ఆ ఉద్యోగాల్లో ఉన్న వాలంటీర్లకు ఇస్తున్న జీతం ఎంత. ఐదువేల రూపాయల జీతం ఇచ్చేవి కూడా ఉద్యోగాలేనా అనే ప్రశ్న పెరిగి పెద్దదవుతోంది. ‘నాడు నేడు’ పేరుతో స్కూళ్లను అద్భుతంగా మార్చామని చెబుతున్నా, కరోనా వల్ల పిల్లలు ఇప్పటివరకూ స్కూళ్లకు వెళ్లలేదు. ట్రూ అప్ చార్జీలతో కరెంట్ బిల్లుల మోత మోగుతోంది. పెట్రోలు, డీజిలు రేట్ల సంగతి సరే సరి. ప్రజలు వాడే ఏ నిత్యావసర వస్తువు ధర తీసుకున్నా దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో అది నాలుగైదు రూపాయలు ఎక్కువగా ఉందనేది ఎక్కడైనా ఎవరైనా చెబుతున్న మాట.


రాజన్న బాటలో నడుస్తున్నాం అని తరచూ చెప్పే జగన్ నిజంగానే ఆ బాటలో వెళుతున్నారా? వైఎస్ హయాంలో అభివృద్ధి–సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగింది. వైఎస్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా– అందులో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, 108 లాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండటం, నిధులకు కొరత లేకపోవడంతో వైఎస్ ఏం చేసినా చెల్లింది. కానీ జగన్ పరిస్థితి వేరు. జగన్ అధికారంలోకి వచ్చే నాటికే ఆంధ్రప్రదేశ్ పీకల్లోతు అప్పుల్లో ఉంది. పాలకుడు అనేవాడు పరిస్థితుల్ని బట్టి విధానాల్ని మార్చుకోవాలి. కానీ జగన్ తాను అనుకున్నదే జరగాలనే థియరీని నమ్ముకున్నారు. నవరత్నాలతో పాటు ప్రతీ వారం ఒక పథకం అన్నట్లు ఇష్టం వచ్చినట్లు స్కీములు అమలు చేస్తున్నారు. అసలు ఏపీలో ఎన్ని స్కీములు అమలవుతున్నాయో పేపరు చూడకుండా వైసీపీ నేతలు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది.


సంక్షేమ పథకాల్ని అందుకుంటున్న వారితో పాటు అభివృద్ధి ఫలాల్ని ఆశించే వారు కూడా రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అన్నదాతలకు రైతు భరోసా ఒక్కటే ఇస్తే సరిపోదు. పంట పండించాలంటే విత్తనాలు, పొలం దున్నడానికి అయ్యే ఖర్చు తగ్గించడం, కూలీల లభ్యత, మద్దతు ధర, వర్షానికి పంట నష్టపోతే పరిహారం అందడం లాంటివన్నీ అవసరమే. అయితే ప్రభుత్వం రైతు భరోసా ఒక్కదానితోనే ఆగిపోతోంది. నిర్మాణరంగంలోనూ ఇదే పరిస్థితి. ఇసుక ట్రాక్టరు రూ.7వేలకు పైగా పలుకుతోంది. ఎమ్మెల్యేల దయ ఉంటే తప్ప ఇసుక అందని పరిస్థితి. నిత్యావసర వస్తువుల ధరలు, నిర్మాణరంగానికి అవసరమైన వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగాయి. అన్ని స్థాయిల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. పరిపాలనలో తప్పులన్నీ ఎన్నికల్లో విజయాలతో కొట్టుకుపోతాయనేది భ్రమ మాత్రమే. 


అన్ని వర్గాల సంతృప్తి అన్న మంత్రంతో వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన సాగించారు. జగన్ మాత్రం కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని పథకాలను అమలు చేస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెప్పినా అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అందుకే చంద్రబాబు ఎన్నికలకు వెళదాం రా అని సవాలు విసిరి ఉండవచ్చు. పోలీసుల సహకారం, పార్టీ కార్యకర్తల దౌర్జన్యంతో ఎన్నికల్ని గెలవవచ్చనే వ్యూహం ఒకటి రెండు ఎన్నికల్లో పనిచేస్తుందేమో కానీ ప్రతిసారీ సఫలం కాదు.

శ్రీరమ

Updated Date - 2021-09-29T06:35:40+05:30 IST