బీజేపీలో ముసలం

ABN , First Publish Date - 2021-03-03T04:48:19+05:30 IST

జిల్లాలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీలో ముసలం మొదలైంది.

బీజేపీలో ముసలం

-సిర్పూర్‌ అభ్యర్థిగా హరీష్‌బాబు పేరు ఖరారుపై మండిపడుతున్న నాయకులు

-ఛత్రపతి శివాజీ సంకల్పసభతో పొడచూపిన విభేదాలు

-తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్న సీనియర్లు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌) 

 జిల్లాలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీలో ముసలం మొదలైంది. గత నెల 23న కాగజ్‌నగర్‌ పట్టణంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ సంకల్ప సభ వేదికగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు బీజేపీలో చేరారు. అయితే ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమక్షంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణా మాలతో సిర్పూర్‌ నియోజకవర్గంలో గ్రూపు విభే దాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుక్‌, రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్‌ సమక్షంలోనే వచ్చే ఎన్నికల్లో హరీష్‌బాబు అభ్యర్థి అని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కృష్ణకుమారి వెల్లడించడంతో ఒక్కసారిగా నేతల్లో కలకలం రేగింది. ప్రస్తుతం ఇక్కడ డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌, రావి శ్రీనివాస్‌, మాజీ జడ్పీ చైర్మన్‌ సిడాం గణపతి, కొంగ సత్యనారాయణ వంటి నేతలు వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై దృష్టి సారించి పార్టీలో పనిచేస్తున్నారు. ఇందులో డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన రావి శ్రీనివాస్‌ కూడా ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ సోయం బాపురావుకు అత్యంత సన్నిహితుడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ జడ్పీ చైర్మన్‌ సిడాం గణపతి కూడా బీజేపీలో చేరి 2023 ఎన్నికల కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు బీజేపీలో చేరడంతో ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలు ఆయన చేరికను జీర్ణించు కోలేకపోతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ పార్టీలో చేరుతున్న సమయంలోనే టికెట్‌ ఖరారు చేసినట్టు చెప్పటం ఏంటని పలువురు సీనియర్‌ నాయకులు మండిపడుతున్నారు. ఇదే విషయమై సభ ముగియ గానే పలువురు నేతలు రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారం అంతా రాష్ట్ర నాయ కత్వానికి తెలియ కుండానే జరిగిందనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ విషయమై అసంతృప్తిలో ఉన్న నేతలు ఎంపీ సోయం బాపురావుతో పాటు కేంద్ర, రాష్ట్ర నాయ కత్వాలకు ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

ఫకిం కర్తవ్యం?

బీజేపీలో రెండ్రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో సిర్పూర్‌ నియోజకవర్గంలో ఆ పార్టీకి పురిటిలోనే సంధి కొట్టే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బహి రంగ సభ వేదికగా చోటు చేసుకున్న పరిణామాలతో బీజేపీలోనే కాకుండా నియోజకవర్గంలోనూ రాజ కీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ నలుగురు ప్రధాన నేతలతో పాటు మరో ముగ్గురు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. పాల్వాయి చేరికతో ఈ ఏడుగురి మధ్య టికెట్‌ కోసం పోటీ మరింత ఊపందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంపీ, జిల్లా అధ్యక్షుడి ఆశిస్సులు ఎవరికి ఉంటే వారికి మాత్రమే టికెట్‌ లభించే అవకాశాలున్నాయి. వాస్తవానికి టికెట్‌ ఖరారులో బీజేపీది భిన్నమైన విధానం. ఏ అభ్యర్థిని ఖరారు చేయాలన్న పార్టీ అనుబంధ సంఘాలైన ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ వంటి సంస్థలు ఇచ్చే సర్వే నివేదికలతో పాటు జిల్లా అధ్యక్షుడి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసు కుంటారు. అదీకాకుండా ఎన్నికలకు ముందే అభ్య ర్థులను ప్రకటించరు. అలాంటిది సిర్పూర్‌ అభ్యర్థి ఫలానా వ్యక్తి అన్నట్టుగా సభా వేదికపై వెల్లడిం చడం పలువురు నాయకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈపరిస్థితుల్లో అసంతృప్తితో ఉన్న పలు వురు నేతలు పార్టీ నాయకత్వానికి నిరసన వ్యక్తం చేయటమే కాకుండా దీనిపై ఏదో ఒక స్పష్టత ఇచ్చే వరకు తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీలో అసంతృప్తితో ఉన్న నేతలతో ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం సంప్రదింపులు ప్రారంభించిందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మాజీ జడ్పీ చైర్మన్‌ సిడాం గణపతిని కాంగ్రెస్‌ పార్టీ నేతలు సంప్రదించినట్లు సమాచారం. మరోవైపు రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవి వరించే పక్షంలో ఆయనకు సన్నిహితుడైన రావి శ్రీనివాస్‌కు కూడా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పిలుపు రావచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. 


Updated Date - 2021-03-03T04:48:19+05:30 IST