పాతికేళ్లు నిండని ఈ కుర్రాడు ఆపద అనగానే ముందుంటాడు!

ABN , First Publish Date - 2021-06-12T19:22:19+05:30 IST

ముషీర్‌ఖాన్‌... పాతికేళ్లు కూడా లేని ఈ కుర్రాడు కరోనా కష్టకాలంలో పౌరులకు సేవలు

పాతికేళ్లు నిండని ఈ కుర్రాడు ఆపద అనగానే ముందుంటాడు!

  • సాయానికి ముందుండే ముషీర్‌
  • కష్టకాలంలో వేలాది మందికి సహకారం


ముషీర్‌ఖాన్‌... పాతికేళ్లు కూడా లేని ఈ కుర్రాడు కరోనా కష్టకాలంలో పౌరులకు సేవలు అందిస్తున్నాడు. వందల మంది ఆకలి తీరుస్తున్నాడు. కరోనాతో పోరాడుతున్న రోగులకు ఆక్సిజన్‌ సమకూర్చాడు. ఒక్క ఫోను కాల్‌తో ఆపదలో ఉన్నవాళ్లకు తన వంతు సాయం చేస్తున్నాడు. 17 ఏళ్ల వయసులోనే ‘ఫ్రీడం అగైన్‌ ఫౌండేషన్‌’ నెలకొల్పి, సామాజిక జీవన పథంలో ముందుకెళ్తున్న మనస్వి ముషీర్‌ గురించి కథనం.


హైదరాబాద్‌ సిటీ : స్నేహితులతో షికార్లు, సరదాలతో గడిపే కాలేజీ రోజుల్లోనే కష్టాల సాలెగూడులో చిక్కుకున్న నిరుపేదల గురించి ఆలోచించాడు ముషీర్‌. పదిహేడేళ్లకే ఫ్రీడం అగైన్‌ ఫౌండేషన్‌ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాడు. ఇంట్లో వాళ్లు ఇచ్చే పాకెట్‌మనీతో బస్తీల్లోని చిన్నారులకు అవసరమైన వస్తువులు కొనిచ్చేవాడు. అప్పుడే దిల్‌సుఖ్‌నగర్‌లోని దివ్యాంగుల ఆశ్రమానికి రెండు ఎయిర్‌ కూలర్లు స మకూర్చాడు. కాచిగూడలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నాడు. ఆ స్కూలుకు కా వాల్సిన మౌలిక వసతులను సమకూర్చుతూ, విద్యార్థుల మానసిక వికాసానికి తోడ్పడే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. 


పదివేల మందికి అన్నదానం

కరోనా తొలిదశలో చాలా మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి పూట గడవని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడారు. అలాంటి కష్టకాలంలో ముషీర్‌ అవసరమున్న చోటుకు వెళ్లి నిత్యావసర సరుకులు పంచాడు. రోడ్డుమీద బతుకీడుస్తున్న అన్నార్తులను గుర్తించి, వాళ్లకు రోజూ భోజన వసతిని కల్పించాడు. అలా మొత్తం సుమారు పది వేల మందికి అన్నదానం చేసినట్లు ముషీర్‌ ఖాన్‌ చెబుతున్నారు. అతనికి స్నేహితులు సయ్యద్‌ షా మహ్మద్‌ ఖాద్రీ, అలీ హమ్జా ఖాన్‌ తోడయ్యారు. వీరంతా బండ్లగూడ, హషామాబాద్‌, దస్తగిరినగర్‌, అమీనానగర్‌ తదితర ప్రాంతాల్లోని నిరుపేదలను గుర్తించి వారికి అవసరమైన సరుకులు, ఆహారపదార్థాలను ఫౌండేషన్‌ తరఫున సమకూర్చారు. గతేడాది వరదల సమయంలోనూ ముంపు ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి నిత్యావసరాలతో పాటు వంట సామగ్రి ఇచ్చారు. ఇప్పటికీ అన్నార్తుల ఆకలితీర్చే మహాక్రతువును కొనసాగిస్తున్నారు.


ప్రాణవాయువు సాయం

కరోనా రెండో దశలో ఆక్సిజన్‌ అందక రోగులు నరకయాతన అనుభవించిన సంగతి తెలిసిందే. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో చాలామందికి ముషీర్‌ ప్రాణవాయువును సమకూర్చాడు. ఆస్పత్రిలో బెడ్ల సమాచారం అందిస్తూ, సకాలంలో రోగికి వైద్యం అందేలా సాయపడ్డాడు. ‘‘కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇరవై ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను అవసరమున్న రోగులకు సరైన సమయంలో అందించగలిగాం. అలా సుమారు డెభ్భైమందికి ప్రాణవాయువును సమకూర్చాం’’ అని చెబుతున్నాడు ముషీర్‌ఖాన్‌. 


ఆపద అనగానే స్పందిస్తూ..

ముషీర్‌ సేవలన్నీ సోషల్‌ మీడియా వేదికగానే సాగాయి. అతని ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల ద్వారా తమకు ఫలానా సాయంకావాలని ఎవరైనా అడిగిందే తడవుగా ముషీర్‌ స్పందిస్తాడు. ఇంట్లో ట్రీట్మెంట్‌ తీసుకుంటున్న రాజ్‌కుమార్‌ అనే వ్యక్తికి ఆక్సిజన్‌ అత్యవసరమని ఒక రోజు అర్థరాత్రి రెండింటప్పుడు మాకు మెస్సేజ్‌ వచ్చింది. అప్పటికప్పుడు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ను తీసుకెళ్లి అందించాం. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు.’’ అని పేర్కొన్నారు ముషీర్‌ఖాన్‌. తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆర్థిక సహాయంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపాడు.

Updated Date - 2021-06-12T19:22:19+05:30 IST