నేను కాదు... నా ప్రతిభ మాట్లాడాలి!

ABN , First Publish Date - 2021-11-27T05:30:00+05:30 IST

ఎక్స్‌పో 2020 దుబాయ్‌ ప్రాంగణంలో.. ‘ఫరిస్థాన్‌’.. అనే పాట వైరల్‌ అయింది. ఈ పాటను పాడింది సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ కూతురు ఖతీజ. సంగీత మాంత్రికుడి....

నేను కాదు... నా ప్రతిభ మాట్లాడాలి!

ఎక్స్‌పో 2020 దుబాయ్‌ ప్రాంగణంలో.. ‘ఫరిస్థాన్‌’.. అనే పాట వైరల్‌ అయింది. ఈ పాటను పాడింది సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ కూతురు ఖతీజ. సంగీత మాంత్రికుడి సోల్‌ఫుల్‌ మ్యూజిక్‌లానే.. ఆయన కూతురి స్వరంలోనూ సోల్‌ ఉందంటున్నారు సంగీత ప్రేమికులు. బురఖాతోనే అంతర్జాతీయ వేదికపై పాట పాడిన ఖతీజా గురించి... 


దుబాయ్‌లోని ఎక్స్‌పోలోని జూబిలీ పార్క్‌లో ‘‘ఫరిస్థాన్‌’’ పాటను లైవ్‌లో పాడింది ఖతీజా రెహమాన్‌. ఆ పాటకి సంగీత దర్శకుడు రెహమాన్‌. లైవ్‌లో తన పాటకు ఆర్కెస్ర్టా ఇచ్చిన ఫిర్దౌస్‌ ఆర్కెస్ట్రాకు కృతజ్ఞతలు చెప్పింది. ఆర్కెస్ర్టాలో అంతా మహిళలే ఉండటం విశేషం. రెహమాన్‌ కూడా తన బిడ్డ పాటకు పులకించిపోయి.. తన యూట్యూబ్‌ చానెల్‌లో షేర్‌ చేశారు. ఆ లింక్‌నే ఖతీజా రెహమాన్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. 


‘‘ఫరిస్థాన్‌.. పాట పాడకముందు ఎంతో నెర్వస్‌గా, ఎగ్జయిట్‌గా ఫీలయ్యా. ఎందుకంటే నా తొలి సోలో పెర్ఫార్మెన్స్‌ కాబట్టి’’ అంటూ ఇన్‌స్టాలో ఖతీజా రాసుకొచ్చింది. అయితే ఆమె తొలిమెట్టును మాత్రం విజయవంతంగా ఎక్కింది. ‘సంగీత దర్శకుడు మా నాన్న కావొచ్చు. అది గేట్‌వే మాత్రమే. ప్రతిభ లేకుంటే ఇక్కడ నిలబడలేమం’టుందీమె. ఖతీజ సింగర్‌, మ్యూజిక్‌ కంపోజర్‌ కూడా. ఆమె తొలి సారి స్వరం వినిపించింది ‘రోబో’ చిత్రంలో. ‘ఓ మర మనిషీ..’ పాటలో ఆమె స్వరంలోని ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది. ఈ పాటనే తమిళం, హిందీ వెర్షన్‌లో కూడా పాడింది ఖతీజానే!


మహిళా సాధికారతకోసం.. 

‘ఇంత సాధించానంటే.. నా ప్రఽధానమైన పునాదులు, బలం.. మా కుటుంబం, సంగీతగురువులే’’ అంటుంది. చెన్నైలోని స్టెలా మేరీ కాలేజీలో ‘కామర్స్‌’ డిగ్రీ అందుకుంది. ఇస్లామిక్‌ స్టడీ్‌సలో మాస్టర్స్‌ చదివింది. ప్రస్తుతం ఏ.ఆర్‌.రెహమాన్‌ ఫౌండేషన్‌కు డైరక్టర్‌తో పాటు ట్రస్టీగా కూడా వ్యవహరిస్తోంది. మహిళా సాధికారతకోసం కృషి చేస్తోంది. నిరంతరం మహిళా సమస్యలను తెలుసుకుంటుంది. చిన్నపాటి వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు సపోర్ట్‌ ఇస్తుంది. చెన్నైలోని ఆద్య క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌, లిటిల్‌ ఫ్లవర్‌ అంధుల పాఠశాలకు వాలంటీర్‌గా పని చేస్తోంది. గ్లోబల్‌ ఇన్‌స్పిరేషనల్‌ ఉమెన్స్‌ లాంటి గొప్ప అవార్డులూ.. ఆమెకు దక్కాయి. 


ఇన్‌స్టాలోనూ ముఖం కనిపించదు..

సంగీతంలోనూ, సామాజిక సేవలోనూ బిజీగా ఉండే ఖతీజా రెహమాన్‌ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఆమె ముఖం ఇప్పటికీ ఎక్కడా కనిపించదు. బురఖాలోనే ఉండే ఫొటోలే నెట్‌లో కనిపిస్తాయి. అంతెందుకూ ఇన్‌స్టా లాంటి సామాజిక మాధ్యమాల్లో ఆమె బురఖాతోనే దర్శనమిస్తుంది. ఇన్‌స్టాలో చూస్తే ఆమె మనస్తత్వం ప్రత్యేకం అనిపిస్తుంది. మహిళల గురించి డిస్కస్‌ చేస్తూనే ఉంటుంది. టెడెక్స్‌లో మాట్లాడినా, తన కుటుంబంతో ఫొటో దిగినా, అంబానీ ఫ్యామిలీతో ఫోటో దిగాల్సి వచ్చినా.. ఎలాంటి గొప్ప వేదిక అయినా.. ఆమె బురఖాలోనే కనిపిస్తుంది. 


పదునైన మాటలతో..

‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’తో రెహమాన్‌కి ప్రపంచస్థాయి గుర్తింపొచ్చింది. రెండేళ్లకిందట జరిగిన పదో వార్షికోత్సవంలో రెహమాన్‌తో పాటు ఖతీజా కూడా ఓ వేదికను పంచుకుంది. ఆ సమయంలో నెటిజన్లు ఆమె మీద విరుచుకుపడ్డారు. ఆమె భయపడలేదు. ‘ఇలా ఉండటం నా ఛాయిస్‌’ అన్నది. బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్‌ కూడా ‘‘సఫొకేటెడ్‌.. కల్చరల్‌ ఫ్యామిలీలో సులువుగా బ్రెయిన్‌వాష్‌, ఎడ్యుకేట్‌’’ చేయొచ్చు అని ట్వీట్‌ చేసింది. అయితే ఖతీజా ‘‘ఈ ప్రశ్న మళ్లీ మళ్లీ వినాల్సి వస్తోంది. సమాధానం ఇవ్వాల్సి వస్తోంది. నేను ఇలా ఉండటం నాకైతే హ్యాప్పీ. మా ఇంట్లోవారికీ, ఎవరికీ ఇబ్బంది లేదు. నన్ను యాక్సెప్ట్‌ చేసిన అందరికీ థ్యాంక్స్‌.


మీకు సఫొకేటెడ్‌గా ఉంటే ఫ్రెష్‌ ఎయిర్‌ పీల్చుకోండి. నా తీరు కాదు.. నా పని మాట్లాడాలి. మీరు ఫెమినిజమ్‌ గురించి గూగులింగ్‌ చేయండి. మహిళలను కించపరచటం కాదు’’అనే అర్థంలో  చురకలంటిస్తూ ఖతీజా సోషల్‌మీడియాలో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. మన జీవితం గురించి ఇతరులు జడ్జ్‌ చేయడమేంటి? అనే స్వభావం ఆమెది. ‘‘ఫ్రీడమ్‌టుచూస్‌’’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో రెహమాన్‌ ఆ మధ్య సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.



Updated Date - 2021-11-27T05:30:00+05:30 IST