నమ్మించి మోసం!

ABN , First Publish Date - 2021-02-27T06:06:48+05:30 IST

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలు మంత్రి వెలంపల్లిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

నమ్మించి మోసం!

పశ్చిమ ముస్లింలకు ఎమ్మెల్సీ ఏదీ?

ఆసిఫ్‌కు  న్యాయం చేస్తానని నాడు జగన్‌ హామీ

వెలంపల్లి రాజకీయంతో మొండిచేయి

మంత్రిపై పశ్చిమ నేతల ఆగ్రహం


విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలు మంత్రి వెలంపల్లిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కారణంగానే ఎమ్మెల్సీ సీటును సెంట్రల్‌ నియోజకవర్గ నాయకులు తన్నుకుపోయారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన నియోజకవర్గంలో మరో బలమైన ప్రత్యర్థిని తయారు చేసుకోవడం ఇష్టం లేని మంత్రి పశ్చిమకు దక్కాల్సిన సీటును సెంట్రల్‌కు ధారాదత్తం చేశారని విమర్శిస్తున్నారు. 


ఆంధ్రజ్యోతి, విజయవాడ : వెలంపల్లి శ్రీనివాసరావు 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పశ్చిమ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనపై వైసీపీ అభ్యర్థి జలీల్‌ఖాన్‌ విజయం సాధించారు. 2016లో జలీల్‌ఖాన్‌ టీడీపీలో చేరారు. దీంతో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ దిక్కులేనిదయింది. ఆ సమయంలో పార్టీ కోసం ఆసిఫ్‌ నిలబడ్డారు. నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా ఏడాదిపాటు ఆయనే ఉన్నారు. ఆ తర్వాత వెలంపల్లి వైసీపీ తీర్థం పుచ్చుకోగా, ఆసిఫ్‌ను పక్కనపెట్టేశారు. ఆ సమయంలో ఆసిఫ్‌కు న్యాయం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ఆసిఫ్‌ కూడా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూవచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆసిఫ్‌కు ఎమ్మెల్సీ సీటు లభిస్తుందని అంతా ఆశించారు. కానీ వెలంపల్లి చక్రం తిప్పారు. తన నియోజకవర్గంలో మరో బలమైన ప్రత్యర్థిని తయారు చేసుకోవడం ఇష్టం లేక ఆసిఫ్‌కు ఎమ్మెల్సీ దక్కకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. చివరికి సెంట్రల్‌ నియోజకవర్గ వైసీపీ నాయకుల చొరవతో కరీమున్నీసాకు ఎమ్మెల్సీ సీటు దక్కింది. ఇప్పటికే వీఎంసీ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెకు అనూహ్యంగా ఎమ్మెల్సీ సీటు దక్కడంతో సెంట్రల్‌ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలే ఆశ్చర్యపోయారు. 


మేయర్‌ సీటు కోసం రాజకీయం

విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ సీటు దక్కించుకునేందుకు విజయవాడ వైసీపీ నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మంత్రి వెలంపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న పుణ్యశీల పేరును కొందరు పార్టీ నాయకులు తెరపైకి తెచ్చారు. అయితే ఆమె పేరును వెలంపల్లి ససేమిరా అంటున్నారని పార్టీ వర్గాల సమాచారం. 42వ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న చైతన్యరెడ్డి పేరును మంత్రి ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న గౌతంరెడ్డి కుమార్తె నికితారెడ్డి కూడా మేయర్‌ రేసులో ఉన్నట్లు సమాచారం. దీంతో మేయర్‌ సీటును ఎలాగైనా పశ్చిమ నియోజకవర్గానికే ఖాయం చేసుకునేందుకు మంత్రి వెలంపల్లి ఎమ్మెల్సీ సీటును సెంట్రల్‌ నియోజకవర్గానికి ఇచ్చేసినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తన మనిషిని మేయర్‌ని చేసుకునేందుకు నియోజకవర్గ ముస్లింలను మంత్రి అణగదొక్కేశారని ముస్లిం నాయకులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2021-02-27T06:06:48+05:30 IST