నారీశక్తిగా ఎదగాలి

ABN , First Publish Date - 2021-12-01T04:58:36+05:30 IST

మహిళలు స్వతహాగా ఎదగగలిగితేనే సమాజంలో

నారీశక్తిగా ఎదగాలి
ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న నారా భువనేశ్వరి

  • ఎన్టీఆర్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి


మొయినాబాద్‌/మొయినాబాద్‌ రూరల్‌: మహిళలు స్వతహాగా ఎదగగలిగితేనే సమాజంలో రాణిస్తారని ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌ గ్రామంలోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ విద్యాసంస్థల్లో మంగళవారం సాయంత్రం ఫ్రెషర్స్‌ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై ఏర్పాటు చేసిన నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచినట్లు తెలిపారు. తిరుపతితో సహా ఇతర ప్రాంతాల్లో  వరద సంభవించినప్పుడు సహాయమందించడంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ వలంటీర్లు కీలకపాత్ర పోషించారని, వారికి ధన్యవాదాలని తెలిపారు. వరద బాధితులకు ఎన్టీఆర్‌ ట్రస్టు అండగా ఉంటుందన్నారు. మహిళలు అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు స్వతహాగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా విద్యార్థినులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సామాజిక సేవాపథంలో 24ఏళ్లు గడిచినట్లు గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ విద్యాసంస్థల్లో అభ్యసించిన విద్యార్థులు అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్నారన్నారు. ఇక్కడ అన్నిరకాల మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్యనందిస్తునట్లు చెప్పారు. కొత్త వేరియంట్‌ నేపథ్యంలో ఎన్టీఆర్‌ స్కూల్‌ విద్యార్థులకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. విద్యార్థులకు చదువులో మంచి భవిష్యత్తును నిర్మించుకునే విధంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ విద్యాసంస్థలు వేదికగా నిలుస్తున్నాయన్నారు. సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థినులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీఈవో రాజేందర్‌కుమార్‌, డీన్‌ ఎం.వీ.రామారావు, విద్యాసంస్థల డైరెక్టర్‌ ఎన్‌.ఎ్‌స.ప్రసాద్‌, ప్రిన్సిపాల్స్‌ ఎస్‌జే.రెడ్డి, శ్రీనివా్‌సరావు, సీవోవో మోహన్‌రావు, పీఆర్‌వో సురేష్‌, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2021-12-01T04:58:36+05:30 IST